RCB vs KXIP: సింగిల్ కోసం.. క్రిస్‌గేల్‌కి చెమటలు పట్టించిన చాహల్

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో చివరి ఓవర్‌లో ఫలితం తేలే మ్యాచ్‌ల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో షార్జా వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ ఆఖరి బంతికి గెలిచి ఊపిరి పీల్చుకుంది. కేఎల్ రాహుల్ (61 నాటౌట్: 49 బంతుల్లో 1×4, 5×6), క్రిస్‌గేల్ (53: 45 బంతుల్లో 1×4, 5×6) లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో ఉన్నా.. పంజాబ్ టీమ్ చివరి 6 బంతుల్లో 2 పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. దానికి కారణం చాహల్ బౌలింగ్‌లో క్రిస్‌గేల్ ఉదాసీనత బ్యాటింగ్.

పంజాబ్ విజయానికి చివరి 6 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వేసి లోపలికి చాహల్ కట్ చేశాడు. దాంతో.. దాన్ని స్వ్కేర్‌ లెగ్ దిశగా హిట్ చేసిన గేల్.. బంతి నేరుగా ఫీల్డర్ అరోన్ ఫించ్ చేతుల్లోకి వెళ్లడంతో సింగిల్ తీయలేదు. ఇక రెండో బంతిని వైడ్ అనుకుని వదిలేయగా.. అది కాస్తా లోపలికి వచ్చేసింది. దాంతో.. అప్పటి వరకూ చాహల్ బౌలింగ్‌ని కామెడీగా నవ్వుకుంటూ ఎదుర్కొన్న క్రిస్‌గేల్‌కి చెమటలు పట్టేశాయి. మూడో బంతిని తప్పనిసరి పరిస్థితుల్లో హిట్ చేయగా.. బంతి మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పడిక్కల్ ముందు వాలింది. అయితే.. తత్తరపాటులో ఆ బంతిని పడిక్కల్ వేగంగా చేతుల్లోకి తీసుకోలేకపోయాడు. దాంతో.. అతని చేతి నుంచి బౌన్స్ అయిన బంతి కాస్త దూరంగా పడింది. అయినప్పటికీ.. రాహుల్- గేల్ సింగిల్‌తో సరిపెట్టారు. వాస్తవానికి చివరి ఓవర్‌లో బంతి బ్యాట్స్‌మెన్‌కి తాకితే చాలు.. సింగిల్ తీసేస్తుంటారు. ఇక ఫీల్డర్ చిన్న తప్పిదం చేసినా.. డబుల్‌ని రాబడుతుంటారు. కానీ.. గేల్- రాహుల్ జోడీ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంలో విఫలమైంది.

తొలి మూడు బంతులకి కలిపి ఒక పరుగు మాత్రమే రాబట్టిన పంజాబ్.. విజయానికి చివరి మూడు బంతుల్లో ఒక పరుగు అవసరమైంది. అయితే.. నాలుగో బంతిని చాహల్ ఊరిస్తూ విసిరినా రాహుల్ హిట్ చేయకుండా బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి పాయింట్ దిశగా ఫుట్ చేశాడు. కానీ.. అప్పటికే ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్‌ని బెంగళూరు కెప్టెన్‌ అక్కడికి మార్చి ఉండటంతో.. సింగిల్ రాలేదు. ఇక ఐదో బంతికి తప్పనిసరిగా సింగిల్ తీయాల్సి రావడంతో.. కవర్స్ దిశగా బంతిని నెట్టిన రాహుల్ సాహసోపేతంగా సింగిల్‌కి వెళ్లిపోయాడు. కానీ.. క్రిస్‌గేల్ వేగంగా క్రీజులోకి రాలేక రనౌటయ్యాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న గేల్ సేవ్ అయ్యేందుకు క్రీజులోకి డైవ్ చేసే సాహసం చేయలేదు.

చివరి బంతికి ఒక పరుగు అవసరమవగా.. అప్పుడే క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. చాహల్ విసిరిన బంతిని క్రీజు వెలుపలికి వచ్చి ఫుల్ టాస్ రూపంలో అందుకుని లాంగాన్ దిశగా సిక్స్ కొట్టడంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి చివరి ఓవర్‌కి పంజాబ్ చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. క్రీజులో ఉన్న ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మంచి జోరుమీదున్నారు. షార్జా స్టేడియం చిన్నది.. దానికి తోడు.. అప్పటికే చెరో ఐదు సిక్సర్లు బాదారు కూడా. అయినప్పటికీ.. సింగిల్ కోసం ప్రయత్నించడం హాస్యాస్పదం. మొత్తానికీ చాహల్ బౌలింగ్‌లో కామెడీ చేయబోయి పీకలమీదకి తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా.. క్రిస్‌గేల్. గత ఏడాది కూడా చాహల్ బౌలింగ్‌లో హిట్ చేసి కామెడీగా అతడ్ని కవ్విస్తూ.. ఢీకొడుతూ క్రిస్‌గేల్ కనిపించాడు. కానీ.. రాత్రి మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయ్యింది. గతంలో క్రిస్‌గేల్ బెంగళూరు టీమ్‌కి ఆడి ఉండటంతో.. చాహల్‌తో అతనికి బాగా చనువు ఉంది. మ్యాచ్‌లోనూ తొలి ఓవర్ నుంచే మైదానంలో క్రిస్‌గేల్ కామెడీ చేష్టలతో కనిపించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. పరుగు కోసం అరోన్ ఫించ్ వెళ్లాల్సిందిగా సైగలు చేయడం.. మధ్యలోనూ ఆర్సీబీ ఆటగాళ్లని కవ్విస్తూ కనిపించాడు. మొత్తంగా.. కామెడీ చేస్తూ మ్యాచ్‌లోకి ఎంట్రీ ఇచ్చి గేల్.. సీరియస్ రనౌట్‌తో వెనుదిరిగాడు.

మ్యాచ్‌లో తొలుత విరాట్ కోహ్లీ (48: 39 బంతుల్లో 3×4), క్రిస్ మోరీస్ (25 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 3×6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని పంజాబ్ 177/2తో ఛేదించింది.