RCB KKR Rivalry: కోల్‌కతా, బెంగళూరు మధ్య వైరం ఏంటి? కోహ్లి, గంభీర్ గొడవేంటి?

Share Icons:
‘కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలాంటి వైరం లేదు’.. అబుదాబీలో అక్టోబర్ 21న ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలివి. ఇంతటితో ఆగకుండా.. రెండుసార్లు టైటిల్ గెలిచిన కోల్‌కతాకు.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీతో శత్రుత్వం ఏంటనేలా గంభీర్ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు చాలు.. ఇరు జట్ల మధ్య వైరం ఉందని చెప్పడానికి. అసలు ఇరు జట్ల మధ్య శత్రుత్వం ఎలా మొదలైందో చూద్దాం..

2008లో ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు తలపడ్డాయి. ఆ రోజు నుంచే ఇరు జట్ల మధ్య శత్రుత్వం మొదలైంది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 73 బంతుల్లో 158 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. బదులుగా బెంగళూరు 82 రన్స్‌కే ఆలౌటయ్యింది. మొదటి మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిన ‘టెస్టు టీం’ బెంగళూరు ఆ ఏడాది పాయింట్ల పట్టికలో ఏడోస్థానానికి పరిమితమైంది.

2011 ఐపీఎల్ వేలానికి ముందు గేల్‌ను కోల్‌కతా రిలీజ్ చేసింది. మిగతా ఫ్రాంచైజీలేవి అతడి పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో అతడు జమైకాలోనే ఉండిపోయాడు. ఆ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో ఓడిన ఆర్సీబీ.. గాయపడిన డిర్క్ నన్నెస్‌‌కు రీప్లేస్‌మెంట్‌గా గేల్‌ను జట్టులోకి తీసుకుంది. కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు గేల్ ఆర్సీబీతో చేరాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 171 రన్స్ చేయడంతో.. ఆ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ గెలుస్తుందని భావించారంతా. కానీ ప్రాక్టీస్ లేకపోయినా.. జెట్ లాగ్ ఇబ్బంది పెట్టినా.. ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగిన గేల్.. ఆ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. 10 ఫోర్లు, 7 సిక్సులతో 55 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. ఆ సీజన్లో బెంగళూరు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. గేల్ వచ్చిన తర్వాత రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిన ఆర్సీబీ.. ఆ సీజన్లో ఫైనల్‌కు చేరుకుంది.

ఇరు జట్ల మధ్య వివాదం 2013లో ముదిరింది. 2013 సీజన్లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సీజన్లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో.. గంభీర్, విరాట్ మైదానంలోనే గొడవపడ్డారు. ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 155 పరుగులు చేసింది. ఆర్సీబీ ఛేజింగ్‌కు దిగగా.. లక్ష్మీపతి బాలాజీ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి ఔటయ్యాడు. దీంతో కేకేఆర్ కెప్టెన్ గంభీర్ సహా.. ఆటగాళ్లందరూ కవర్ రీజియన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు.

కోహ్లి.. ఔటయ్యాక పెవిలియన్ వైపు వెళ్లకుండా.. బౌలర్‌ను ఏదో అన్నాడు. దీంతో కోపం పట్టలేకపోయిన గంభీర్.. కోహ్లి వైపు ఆగ్రహంతో దూసుకెళ్లాడు. ఈ ఢిల్లీ క్రికెటర్లిద్దర్నీ ఢిల్లీకే చెందిన రజత్ భాటియా సముదాయించడంతో వివాదం సమసిపోయింది. ఆ మ్యాచ్‌లో 50 బంతుల్లోనే 85 రన్స్ చేసిన గేల్ బెంగళూరును గెలిపించాడు. మ్యాచ్ ముగిశాక గంభీర్.. కోహ్లీని చీక్స్ అని ముద్దుగా పిలవగా.. గంభీర్‌ను విరాట్ భయ్యా అని ఆప్యాయంగా పలకరించడం విశేషం.

2017 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ 49 రన్స్‌కే బెంగళూరును ఆలౌట్ చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఆ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 131 పరుగులకు ఆలౌటయ్యింది. బదులుగా బెంగళూరు 49 రన్స్‌కే కుప్పకూలింది. కోల్‌కతా బౌలర్లు కౌల్టర్ నైల్, క్రిస్ వోక్స్, గ్రాండ్‌హోమ్ తలో మూడు వికెట్లు తీయడంతో ఆర్సీబీలో ఒక్కరు కూడా డబుల్ డిజిల్ స్కోరు చేయలేకపోయారు. ఆ మ్యాచ్‌లో గెలిచాక… కోల్‌కతా టీం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది.

అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉన్న ప్రతిసారీ నైట్ రైడర్స్ ఫ్యాన్స్.. ఆర్సీబీ 49 రన్స్‌కే ఆలౌట్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎగతాళి చేస్తుండేవారు. ఇది సహజంగానే బెంగళూరు ఫ్యాన్స్‌కు కోపం తెప్పించేది. ఈ సీజన్లో కోల్‌కతాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో 82 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లి సేన.. రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. కోల్‌కతాను ఆర్సీబీ 84 రన్స్‌కే పరిమితం చేయడంతో.. లెక్క సరిచేశామని ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.