55 ఏళ్ళ కిందట ఎన్నికల విషయం – ఓ మధుర జ్ఞాపకం…

Share Icons:

1967 ఎన్నికల్లో మా అన్నయ్య నందిరాజు శ్రీహరిరావు సత్తెనపల్లి నుంచి జనసంఘ్ అభ్యర్థిగా వావిలాల వంటి ఉద్దండులతో పొటీపడ్డప్పుడు కుటుంబం మొత్తం ప్రచారానికి వెళితే, నేను మాత్రం తాడికొండ నుంచి సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అత్యంత ఆప్తులు, అన్నింటా మార్గదర్శకులు, శ్రేయోభిలాషి అరుణక్క భర్త శ్రీ రావెల సోమయ్య గారి ప్రచారానికి, ఎన్నికల ఏజంటుగా వెళ్ళాను. ఇద్దరూ గెలవరని తెలుసు. కాని నమ్మిన సిద్ధాంతాలు, విలువల రాజకీయాలు ఆనాటివి.

అనంతరం, కళాశాలలో మా చరిత్ర విభాగం అధిపతి మన్నవ గిరిధరరావు టీచర్స్ కాన్‌స్టిట్యుయెన్సీ – జూపూడి యజ్ఞనారాయణ (మా బంధువు) గ్రాడ్యుయేట్స్ కాన్‌స్టిట్యుయెన్సీ జనసంఘ్ ఎం.ఎల్.సీ. అభ్యర్ధులుగా; సివిఎన్ ధన్ [రవి కాలేజ్] ఇండిపెండెంట్ గా(కమ్యూనిస్టు సహకారం) పోటీ చేసినప్పుడు, ఒకవైపు గిరిధర రావు గారికి సహకరిస్తూ ధన్ గారికి ప్రచారం చేశాను. గిరిధర రావు, జూపూడి యజ్ఞనారాయణ గెలిచారు. ధన్ పరాజయం పాలయ్యారు. బంధువైనా యజ్ఞనారాయణ గారికి ప్రచారం చెయ్యలేదు.

అంతే కాదు.  జనసంఘ్ కు ప్రాణమిచ్చిన మా అన్నయ్య శ్రీహరిరావు భాజపా విలువలు లేని రాజకీయాలకు విసుగెత్తి, బిఎంఎస్ అనుబంధ షాప్ వర్కర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ అధ్యక్షులుగా ఉంటూనే , 2 వేలు మించి ఓట్లు రావని గట్టి నమ్మకంతో.. 2004 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్ కు పోటీగా జనసంఘ్ తరఫున పోటీచేసి నిరసన ప్రకటించారు. పూర్వ ఎంఎల్సి టి. ఎస్. రామారావు గారు సంపూర్ణంగా ప్రోత్సహించారు. 1340 ఓట్లే వచ్చాయి. చాయ్ తో నాలుగు ప్రెస్ కాన్ఫరెన్సులే నిర్వహించారు.

పాత్రికేయునిగా ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికల్లో కర్తవ్యం నిర్వహించాను. దౌర్భాగ్యం… నేటి దిగజారుడు, అధమ రాజకీయాలు, ఎన్నికలు. అధికార దుర్వినియోగం. బెదిరింపులు, వందలకోట్ల డబ్బు ప్రవాహం. పార్టీలకు అతీతంగా విలువలు, నీతి ఎప్పుడో అంతర్ధానమయ్యాయి. ఇంతకు మించి దిగజారుడు ఉండదు.

-నందిరాజు రాధాకృష్ణ, (అ)విశ్రాంత పాత్రికేయడు.

Leave a Reply