చరిత్ర సృష్టించిన పసికూన అఫ్ఘాన్‌…బంగ్లాపై సంచలన విజయం…

rashid-khan-leads-afghanistan-to-historic-test-win-over-bangladesh
Share Icons:

చిట్టగాంగ్:

టెస్ట్ క్రికెట్ లో పసికూన అఫ్ఘానిస్థాన్‌ చరిత్ర సృష్టించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తోనే సరిపెట్టుకోకుండా టెస్టుల్లోనూ అదరగొడుతున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ బరిలోకి దిగిన ఏకైక టెస్ట్‌లో విజయదుందుభి మోగించింది. తమ(10) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న బంగ్లాదేశ్(9)ను వారి సొంత ఇలాఖాలో మట్టికరిపించింది. కెప్టెన్ రషీద్ ఖాన్ (6/49) విజృంభణతో బంగ్లాతో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘన్ ఘన విజయం సాధించింది.

ఇక రషీద్ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 173 పరుగులకే ఆలౌట్ కావడంతో.. అఫ్ఘాన్ 224 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ టెస్టు చరిత్రలో ఆడిన తొలి మూడు టెస్టుల్లో రెండింట నెగ్గి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియా సరసన నిలిచింది. స్పిన్నర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో మొత్తం 40 వికెట్లు నేలకూలగా.. అందులో ఒక్క వికెట్ మినహా.. మిగిలిన 39 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం విశేషం.

ఇక 398 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 136/6తో సోమవారం బంగ్లా రెండో ఇన్నింగ్స్ కొనసాగించగా.. మ్యాచ్‌కు పలుమార్లు వర్షం ఆటంకం కలిగించింది. ఒకదశలో వరుణుడు బంగ్లాను గట్టెక్కించేలా కనిపించినా.. కాస్త తెరిపినివ్వడంతో ఆటగాళ్లు మైదానంలో దిగారు. ఆరంభం నుంచే స్పిన్ దాడి మొదలెట్టిన ఆఫ్ఘన్ 17.2 ఓవర్లలో మిగిలిన 4 వికెట్లు పడగొట్టింది.

అలాగే అత్యంత పిన్న వయస్సులో టెస్టు విజయాన్ని అందుకున్న తొలి కెప్టెన్‌గా రషీద్‌ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన రషీద్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

జట్ల స్కోర్లు..

ఆఫ్ఘానిస్తాన్: మొదటి ఇన్నింగ్స్: 342 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 260 ఆలౌట్.

బంగ్లాదేశ్: 205 ఆలౌట్, 173-ఆలౌట్

Leave a Reply