అదిరిపోయే ‘ఇఫ్తార్’ విందు!!

Share Icons:

హైదరాబాద్:

పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించిన మాసం కావడంతో మహ్మదీయుల క్యాలెండర్‌లో వచ్చే తొమ్మిదవ మాసమైన రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులంతా పవిత్రంగా భావిస్తారు.

భక్తి శ్రద్దలతో భగవంతుడిని ప్రార్ధిస్తూ.., కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. పిల్లలు, వృద్దులు, ఆనారోగ్యంతో బాధపడేవారు మినహా అందరూ దీక్షలో పాల్గొంటారు. తెల్లవారుజామున మొదలైన వీరి ఉపవాస దీక్ష సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ముగుస్తుంది. అయితే ఉదయం తీసుకునే ఆహారాన్ని ‘సహర్’ అనీ, సాయంత్రం ఉపవాస దీక్ష తర్వాత తీసుకునే ఆహారాన్ని ‘ ఇఫ్తార్’ అని పిలుస్తారు. ఈ ఇఫ్తార్ విందుకి ఓ ప్రత్యేకత ఉంది. సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ముస్లిం సోదరులు హిందువులతో కలిసి కూర్చుని ఆనందంతో విందు ఆరగిస్తారు.

ఇఫ్తార్ విందు.. భలే పసందు… 

ఉదయం నుండి రాత్రి వరకూ చేసే ఉపవాస దీక్షలో ముస్లిం సోదరులు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టరు. ఆఖరికి ఉమ్ము మింగరు. ఏం తినాలనుకున్న రాత్రి అయ్యాకే.. ఇఫ్తార్ విందులోనే కావలసినవన్నీ తింటారు. ఈ ఇఫ్తార్ విందులో ఆహారపదార్ధాలు ప్రదేశాలని బట్టి మారుతూ ఉంటాయి కానీ, దీక్ష నియమావళి మాత్రం మారదు. తొలుతగా ఖర్జూర పండ్లతో మొదలయ్యే ఈ ఇఫ్తార్ విందులో రకరకాల పండ్లు, ఖీర్, రకరకాల స్వీట్లు, కబాబ్, శవర్మ, కునఫా, జిలేబి, పరోటాలు, దాల్ ఖీమా, స్టఫ్డ్ రోస్ట్ చికెన్ దజాజ్, మటన్ కుర్మా, ఖీర్ ఖుర్మా, హలీమ్, బిర్యానీ వంటి ఎన్నో రకాల ఆహార పదార్ధాలను ఆరగించవచ్చు.

ఆరోగ్యవంతమైన ఇఫ్తార్ విందు…

ఒక్కసారి పైన చెప్పిన పదార్ధాలన్నిటినీ గమనిస్తే ఇఫ్తార్ విందు ఎంత ఆరోగ్యకరమైనదో అర్ధం అవుతుంది. ఉదయం నుండి దీక్ష చేసి నీరసం వచ్చి ఆరోగ్యం పాడవ్వకుండా ఉండటం కోసం  ఈ ఆహార పదార్ధాలన్నీ విందులో ఆరగిస్తారు. అందుకే ఇఫ్తార్ విందుకి అంతా ప్రత్యేకత ఉంటుంది. శరీరానికి త్వరిత శక్తిని ఇచ్చే ఖర్జూర నుండి పండ్లు, స్వీట్లు, హలీమ్, బిర్యానీ వంటి ఆహార పదార్ధాలన్నీ శరీరం దృఢంగా ఉండేందుకు సహకరిస్తాయి.

ప్రభుత్వం సైతం ఇఫ్తార్ విందు పెడుతుంది…

ప్రతి సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తుంది. పసందైన వంటలతో, హిందూ- ముస్లింల మైత్రితో కళకళలాడే ఈ విందు కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు.

ముస్లింలు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో ఈ విందు మరింత కన్నుల పండుగగా ఉంటుంది. ప్రతి యేటా లాగే ఈ ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు కోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తుంది. రంజాన్ పండుగ కోసం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం దానిలో 15 కోట్ల రూపాయలు ఇఫ్తార్ విందు కోసమే ఖర్చు చెయ్యనుంది. జూన్ 8న కనువిందు చేయనున్న ఈ ఇఫ్తార్ విందు కోసం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముస్తాబు  అవ్వనుంది.

ప్రతి మసీదుకు ఇఫ్తార్ విందు కోసం లక్ష రూపాయలు మజూరు చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 800మసీదుల్లో ఒక్కో మసీదుకు 500 బహుమతులను(బట్టలను) అందిస్తున్నారు. విందు కోసం వచ్చే ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఎటువంటి ఇక్కట్లు కలగకుండా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపడుతోంది.

మామాట: వీలైతే ఈ పసందైన ఇఫ్తార్ విందు మీరూ ఆరగించండి..

 

 

Leave a Reply