అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి రజనీ….!పీకేతో కమల్ మంతనాలు

Share Icons:

 

చెన్నై, 22 జూన్:

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీలు డీఎంకె, అన్నాడీఎంకెలకి పోటీగా కమల్ హాసన్, రజనీకాంత్‌లు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమల్ పార్టీ పెట్టి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగగా… సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా త్వరలో పార్టీ పెట్టి తప్పకుండా తమిళనాడు ఎన్నికల్లో పోటీచేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు తెలిపారు.

తాజాగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్‌ తప్పకుండా పోటీచేస్తారని, స్థానిక ఎన్నికల్లో పోటీచేయర ని తెలిపారు. మరో రెండేళ్లలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడికి ప్రకృతి కారణమని, దీనిపై ఎవరు ఎన్ని అస్యత ఆరోపణలు చేసిన ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ఘనవిజయం తరువాత ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌కు డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్‌ సేవలను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం వినియోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పీకే సారథ్యంలోని ఐ-ప్యాక్ టీమ్‌తో ఆమె ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సినీనటుడు కమల్ హాసన్‌ను ప్రశాంత్ కిశోర్ కలవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం చెన్నైలోని కమల్ హాసన్ సారథ్యంలో ఎమ్ఎన్ఎమ్ పార్టీ కార్యాలయానికి వెళ్లిన ప్రశాంత్ కిశోర్… ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఎన్ఎమ్ పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం ఖాయమనే ప్రచారం మొదలైంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఎమ్ఎన్ఎమ్ పార్టీ వర్గాలు నిరాకరించాయి.

 

Leave a Reply