అక్టోబర్ 15 నుంచి రైతుల భరోసా…డిసెంబర్ లో మున్సిపాలిటీ ఎన్నికలు…

janasena mla varaprasad praises cm jagan
Share Icons:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాని అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6 వేలు సాయంతో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.12,500 పంట సాయం చేయనుంది. అయితే ఇప్పటికే కేంద్రం రూ. 6 వేలు సాయాన్ని విడతల వారీగా రైతులకు అందజేస్తుంది. మరి రాష్ట్రం ఇచ్చే రూ. 6,500 సాయం ఒకసారే ఇస్తారా లేక విడతల వారీగా ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

అయితే రైతు భరోసా అమలు చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ అధికారులుకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకాన్ని నిజమైన రైతులందరికీ అందేలా చూడాలని కోరారు. గురువారం ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లబ్ధిదారుల గుర్తింపునకు ఈ నెల 18 నుంచి 25 వరకు సర్వే చేయలని సూచించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని వెబ్‌లాండ్‌ జాబితాను గ్రామ పంచాయితీల వారీగా పరిశీలించి అందులో ఉన్న వారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలన్నారు.

అయితే గతంలో మాదిరిగా వ్యవసాయం చేయని వారికి, విదేశాల్లో ఉంటూ సాగు చేయని భూ యజమానులకు, వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్, చేపల చెరువులుగా మార్పిడి చేసిన వారికి రైతు భరోసా కింద లబ్ధి కలగకూడదని జగన్ అన్నారు.

ఏపీలో కొత్త మున్సిపాలిటీలు..

రాష్ట్రంలో చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని అడుగుతున్నారనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు. అయితే ప్రజలు ఫోన్ చేస్తే చాలామంది మున్సిపల్ అధికారులు అసలు కాల్ లిఫ్ట్ చేయడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కొందరు మున్సిపల్ కమిషనర్లపై పై బొత్స కన్నెర్ర చేశారు. ‘ప్రభుత్వ ధనంతో ఫోన్లు కొంటున్నారు. బిల్లులు కట్టుకుంటున్నారు.

కానీ మా ఫోన్లకు స్పందించకపోవడం కమిషనర్లకు కరెక్ట్ కాదు’ అని హెచ్చరించారు. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జలశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమం విషయంలో అధికారులు ఎంతమాత్రం రాజీ పడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నమాట వాస్తవమేననీ, అయినా ఓ ప్రణాళికతో తాము ముందుకెళుతున్నామని చెప్పారు.

అలాగే వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం కింద అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. వచ్చే ఉగాది నాటికి ఇళ్లు లేని పేదలకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారనీ, అందుకు అనుగుణంగా మున్సిపల్ కమిషనర్లు గ్రామ వాలంటీర్లు, సచివాలయం అధికారుల సేవలను వినియోగించుకోవాలని బొత్స చెప్పారు.

 

Leave a Reply