మళ్ళీ ఓడిన తెలుగు టైటాన్స్….తమిళ్ తలైవాస్ ని గెలిపించిన రాహుల్ చౌదరీ….

Rahul Chaudhari Stars as Tamil Thalaivas Thump Telugu Titans 39-26 in Hyderabad
Share Icons:
హైదరాబాద్:

 

ప్రొ కబడ్డీ సీజన్ 7 తొలి మ్యాచ్ లో యూ ముంబా చేతిలో ఓడిపోయిన తెలుగు టైటాన్స్….ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో కూడా ఘోర పరాజయం పాలైంది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 26-39తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది.

 

ఇక మొన్నటి వరకు మన జట్టు తరఫున ఆడిన రాహుల్ చౌదరి అద్భుత ప్రదర్శనకు మన్‌జీత్ చిల్లర్ ఉడుం పట్టు తోడవడంతో తలైవాస్ అలవోకగా గెలుపొందింది.

 

రాహుల్ (12 పాయింట్లు)కు బెస్ట్ రైడర్ అవార్డు దక్కగా.. మన్‌జీత్ (6 పాయింట్లు)ను బెస్ట్ డిఫెండర్ పురస్కారం వరించింది. టైటాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కబడ్డీ బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ (6 పాయింట్లు) మరోసారి నిరాశ పరిచాడు.

 

ఇక గత ఆరు సీజన్లగా తెలుగు జట్టులో ఆడిన రాహుల్ తొలిసారి తమిళ్ జట్టులోకి అడుగుపెట్టి అదరగొట్టాడు. సొంత మైదానంలాంటి గచ్చిబౌలిలో రాహుల్ చౌదరి చెలరేగిపోయాడు.

 

తలైవాస్ తరఫున తొలి రైడ్‌కు వచ్చిన రాహుల్ పాయింట్ సాధించాడు. ఇక వరుసగా తెలుగు ఆటగాళ్లు సిద్ధార్థ్ దేశాయ్, రజనీశ్‌ను పట్టేసిన తలైవాస్ ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగించిన తంబీల జట్టు వరుస పాయింట్లతో అదరగొట్టింది. ఫలితంగా తొలి అర్ధభాగం ముగిసేసరికి టైటాన్స్ 10-20తో వెనుకంజలో నిలిచింది.

 

ఇక రెండో సగంలోనైనా.. తెలుగు జట్టు మ్యాజిక్ చేస్తారనుకుంటే అదీ సాధ్యపడలేదు. అజయ్ ఠాకూర్, రాహుల్ చౌదరి, మన్‌జీత్ చిల్లర్, మోహిత్ చిల్లర్, షబ్బీర్ బాబుతో కూడిన తమిళ్ తలైవాస్‌కు తెలుగు టైటాన్స్ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది.

 

మ్యాచ్‌లో మన జట్టు రెండు సార్లు ఆలౌట్ కాగా.. ప్రత్యర్థి జట్టు కోర్టు ఒక్కసారి కూడా ఖాళీ కాలేదు. ఆఖర్లో కొన్ని పాయింట్లు సాధించినా.. అప్పటికే అలస్యమైపోవడంతో టైటాన్స్‌కు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 42-24తో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది.

Leave a Reply