ఆర్ధిక స‌ర్వే లోగుట్టు!

Share Icons:

ఆర్ధిక స‌ర్వే లోగుట్టు!

దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ ఎటు వెళుతున్న‌దో తెలుసుకోవ‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నా కేంద్ర వార్షిక బ‌డ్జెట్ ముందు కేంద్ర ప్ర‌భుత్వం వెలువ‌రించే ఆర్ధిక స‌ర్వేనే మ‌నం సంపూర్ణంగా న‌మ్మాల్సి ఉంటుంది. న‌మ్ముతాం కూడా.

అయితే ఈ సారి ఆర్ధిక స‌ర్వేలో వెలువ‌డిన అంశాలు చూస్తే న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేదు. ఎందుకో తెలియ‌దు కానీ ఆర్ధిక స‌ర్వేలో వెలువ‌రించిన అంశాలు వాస్త‌వ దూరంగా ఉన్న‌ట్లుగానే క‌నిపిస్తున్న‌ది. పెద్ద నోట్ల ర‌ద్దు, జిఎస్‌టి అమ‌లుతో దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ కుదేలైపోయింద‌నేది నిర్వివాదాంశం.

పెద్ద నోట్ల ర‌ద్దు అంశం ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది.

పెద్ద నోట్ల ర‌ద్దు దేశంలోని అన్ని రంగాల్ని అధఃపాతాళానికి తొక్కేసింది. ముఖ్యంగా కోట్లాది మంది దిన‌స‌రి కూలీలు రోడ్డున ప‌డ్డారు. దాంతో ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయం, సేవా రంగాలు కోలుకోలేని స్థితికి చేరుకున్నాయి.

దాన్నించి త‌ల‌పైకెత్తి చూసేలోగానే జిఎస్‌టి అమ‌లు ప్రారంభ‌మైంది. జిఎస్‌టి అమ‌లుతో చిన్న త‌ర‌హా వ్యాపారాలు దిక్కుతోచ‌ని స్థితికి చేరుకున్నాయి. జిఎస్‌టి పేరుతో విధించిన బంధ‌నాలు తెంపు కోవ‌డం ఇప్ప‌టిలో సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఈ రెండు కోలుకోలేని దెబ్బ‌లే.

ఇలాంటి దారుణమైన రెండు దెబ్బ‌లు కొట్టి ఇప్పుడు ఆ దెబ్బ‌లు మానిపోయాయి చూసుకోండ‌ని ఆర్ధిక స‌ర్వే చెబుతోంది. కొట్టిన దెబ్బ‌లు మానాయో లేదో మ‌న‌కు తెలుసు క‌దా వేరే వాళ్లు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఇంత దారుణ‌మైన ప‌రిస్థితి నుంచి కోలుకుని 2018-19 ఆర్ధిక సంవ‌త్స‌రంలో వృద్ధిరేటు అంచనా 7% నుంచి 7.5% వ‌ర‌కూ ఉంటుంద‌ని ఆర్ధిక స‌ర్వే చెప్ప‌డం అందువ‌ల్లే న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేదు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిల‌బ‌డుతుంద‌ని చెప్పిన ఆర్ధిక స‌ర్వేను అందుకే న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేదు.

స‌వాళ్లు ఎదురు కావ‌చ్చ‌ని వారే చెబుతున్నారు

ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలో సిద్ధమైన ఈ సర్వేను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

వృద్ధి అంచనాలు బాగున్నప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చని సర్వే హెచ్చరించింది.

ముఖ్యంగా పెరుగుతున్న ముడి చమురు ధరల నుంచి సవాలు ఎదురుకావ‌చ్చున‌ని స‌ర్వే చెబుతున్న‌ది.

నిధులకు కొరత ఉన్నా విద్య, ఆరోగ్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోందని ఆర్ధిక స‌ర్వే చెప్ప‌డం కూడా న‌మ్మ శ‌క్యం కావ‌డం లేదు.

ప్రస్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో జీడీపీ వృద్ధిరేటు 6.75 శాతంగా నమోదు కానుంది.

కేంద్ర గణక కార్యాలయం అంచనా వేసిన 6.5 శాతం కంటే ఇది ఎక్కువే. వచ్చే ఏడాది ఎగుమతులు, పెట్టుబడులు తిరిగి పుంజుకోనున్నాయ‌ని ఆర్ధిక స‌ర్వే అంచ‌నా వేస్తున్న‌ది.

2016-17లో7.1%, అంతక్రితం ఏడాది 8%, 2014-15లో 7.5 శాతం చొప్పున వృద్ధి నమోదైన విషయం తెలిసిందే.

ముంచేస్తున్న ముడిచ‌మురు

జీఎస్‌టీ అమలు, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లోప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఎగుమతులు పుంజుకుంటే వృద్ధిరేటు 7.5 శాతం కంటే అధికంగానే నమోదవుతుంది. అయితే ముడి చమురు ధరల కారణంగా కొంత ప్రతికూలతలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ముడి చమురు ఎగుమతులు 14 శాతం మేర పెరగవచ్చు.

2018-19లో మరో 10-15 శాతం మేర పెరిగే అవకాశాలు ఉండొచ్చు. దీనివల్ల జీడీపీపై 0.2-0.3 శాతం; ద్రవ్యోల్బణంపై 0.2-0.3 శాతం మేర ప్రభావం పడే అవకాశం ఉంది.

అదే సమయంలో బ్యారెల్‌ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే కరెంట్‌ ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉంది.

ముడిచ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావానికి, జిఎస్‌టి ర‌ద్దు ప్ర‌భావానికి తోడైతే ప‌రిస్థ‌తి ఎలా ఉంటుందో సామాన్య‌మాన‌వుడికి కూడా అర్ధం అవుతుంది.

అందుకే ఆర్ధిక స‌ర్వేపైనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అందుకే ఇన్ని అనుమానాలు

ఆర్థిక వృద్ధి వేగంగా నమోదు కావడానికి కావలసిన అత్యంత ముఖ్యమైన రెండు అంశాలైన ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులను మెరుగుపరచుకోవాలి.

వచ్చే ఏడాది ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం కారణంగా ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇన్ని స‌వాళ్ల మ‌ధ్య మ‌నం ఎలా మెరుగుప‌డ‌తాం? వృద్ధిరేటు ఎలా సాధిస్తాం???

మామాటః ముంజేతి కంక‌ణానికి అద్ద‌మేలా అనేది ఒక సామెత‌. దీనికి స‌రిగ్గా స‌రిపోతుంది క‌దా?

Leave a Reply