విలువలున్న విద్య అవసరం

Share Icons:

విలువలున్న విద్య అవసరం 

విద్య విలువైన భూషణం. అమూల్యమైన వరం. ఎన్ని ఉన్నా విద్య లేకపోతే అన్నీ వ్యర్థం. ‘విద్యలేని వాడు వింత పశువు’ అన్న నానుడి తెలిసిందే. విద్య, విజ్ఞానాలకు ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. తల్లిదండ్రులు సంతానానికిచ్చే కానుకలలో ఉత్తమ విద్యకు మించిన కానుక మరొకటి లేదు. ఆస్తిపాస్తులు ఎన్ని సమకూర్చినా మంచి విద్యాబుద్ధులు, నైతిక శిక్షణ అందించకపోతే భావితరాలకు అంధకారం తప్ప ఏమి మిగలదు. నేడు మన విద్యావ్యవస్థను పరికించినట్లయితే విలువలతోకూడిన విద్య మనకు ఎక్కడా కనిపించడంలేదు.

దేశంలో లంచం, అవినీతి, తీవ్ర మత భావనలు, బాధ్యతారాహిత్యం చదువుకున్న యువతలో సైతం నైతికత దిగజారుడుతనం పెచ్చరిల్లిపోతున్నాయి. చదువులు ప్రతిభ గల శాస్త్రవేత్తనో, ఇంజనీరునో, డాక్టరునో అందిస్తున్నాయేగాని విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఘోరంగా విఫలం అయ్యాయి. అందువల్లనే ఒక వార్డుమెంబర్‌ నుంచి కేంద్ర మంత్రి వరకు ఒక అటెండర్‌ ఉద్యోగి నుంచి ఐఎఎస్‌ ఆఫీసర్‌ వరకు అవినీతిపరులుగా ఉండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. యువత నైతికత మీద దేశ భవిష్యత్తు ఆధారపడుతుంది. ఎందుకంటే నేటి విద్యార్థులు రేపటి పౌరులు, దేశంలోని యువత తప్పుదోవ పట్టే దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. యువతలో నైతికత కొరవడితే దేశ భవిష్యత్తు కుంటుపడుతుంది. మనిషికి పశువుకి తేడా నీతి నడవడికలే. కాని శాస్త్ర సాంకేతికాభివృద్ధి జరుగుతున్నకొద్ది ఈ అంతరం తరిగిపోతూ వస్తున్నది. పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని యువకులు పబ్‌ సంస్కృతి, అశ్లీల నృత్యాలు, డేటింగ్‌, ప్రేమ, పిచ్చి వంటి విశృంఖల చేష్టల వైపు ఆకర్షితులవుతున్నారు. అవినీతిని నిరోధించడానికి ఎన్ని చట్టాలు  చేసినా అవి మనిషిని పూర్తిగా నియంత్రించకపోవడానికి గల ముఖ్య కారణం నైతికత లేని విద్య.

ఈ విషయంలోనే  దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం “నైతికతతో కూడిన విద్య వచ్చే వరకు  సమాజంలో ఉన్న అవినీతిలో ఎటువంటి మార్పురాదు..   పర్యావరణ ప్రాముఖ్యాన్ని గుర్తించి విద్యలో ఒక తప్పనిసరి అంశంగా ప్రవేశపెట్టారు. శాంతి విద్య, విలువల ఆధారిత విద్య కూడా అలగే ప్రవేశపెట్టాలి. అప్పుడే మన దేశం ఆదర్శ దేశంగా మారే అవకాశం ఉంది. అంధకారం నుండి వెలుగు వైపునకు తీసుకొచ్చిన నైతిక విద్య నేడు కూడా మార్పును తీసుకొని వస్తుంది” అన్నారు.  విద్య ఒక గొప్ప వారసత్వం. విద్యతో అజ్ఞానం పటాపంచలవుతుంది. సత్యం, అసత్యం, న్యాయం, అన్యాయం, మంచి చెడు, లాభనష్టాల విచక్షణ  విద్యలోనే అవగతం అవుతున్నాయి.

ప్రస్తుతం అందరూ ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు కాని మానవతా విలువలను మరచి పోతున్నారు. పెద్దలను గౌరవించటం, తోటివారితో మర్యాదగా మాట్లాడటం, విద్య నేర్పిన గురువులను గౌరవించటంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. చదువులతో పాటు మానవతా విలువలు పెరగాలే తప్ప తగ్గకూడదు. మానవతా విలువలు లేని చదువు నిరక్షరాస్యతతో సమానం. అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే మానవతా విలువలకు లోబడి జీవిస్తున్నారు. మానవతా విలువలు అనేవి మనకు సమాజంలో గౌరవ మర్యాదలు సంపాదించిపెడతాయి. సమాజంలో మనిషి హుందాగా బ్రతకడానికి డబ్బు, చదువుతో పాటు గౌరవమర్యాదలు కూడా చాలా అవసరం. సమాజంలో మనిషికి గౌరవం లేకపోతే ఆ మనిషి భూమి మీద జీవిస్తున్నా లేనట్లే అవుతుంది.

సమాజంలో మనకంటూ గౌరవ మర్యాదలు చాలా అవసరం. గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకునేవి. వాటిని మనం సంపాదించుకోవటం చాలా సులభం. ఎప్పుడు మనిషి మానవతా విలువలు కలిగి వుంటాడో అప్పుదే అప్రయత్నంగా గౌరవమర్యాదలు లభిస్తాయి. జీవితంలో విజయం సాధించాలంటే చదువుతో బాటు లోకజ్ఞానం కూడా చాలా అవసరం అని గుర్తించాలి. లోకజ్ఞానం లేకపోతే సమాజంలో బ్రతకటం చాలా కష్టం. ఏది మంచి ఏది చెడు అనే విషయంప్రతి ఒక్కరూ కూడా గ్రహిస్తారు. మంచి చెడులను గ్రహించే శక్తి దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి ప్రసాదించాడు. దానిని ఉపయోగించుకున్నవారు సమాజంలో మంచిగా స్థిరపడగలుగుతున్నారు. దేనికైనా సరే ప్రతిఫలం వుంటుంది. అది మంచికైనా సరే చెడుకైనా సరే. వారిని బట్టి మనం వ్యవహరించవలసి వుంటుంది. మానవతా విలువలు మనష్యులను మనుష్యులుగా తీర్చిదిద్దుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది వారు పెద్దపెద్ద చదువులు చదివి ఉన్నతస్థానాన్ని సంపాదించాలన్న వ్యామోహంలో పడి మానవతా విలువలు మరచి పోతున్నారు. మానవతా విలువలు మరచిపోవటం వల్ల నష్టమేగానీ లాభం అంటూ ఏమీ వుండదు.

విద్యలో రాణించగల అవసరం స్త్రీకి ఎంతయినా వుంది. విద్యను అభ్యసించటం వల్ల స్త్రీ తన ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటుంది. తద్వారా తననుతాను గౌరవించుకుంటుంది. తన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతుంది. వారికి సరైన శిక్షణ ఇస్తుంది. స్త్రీ విద్యావంతురాలు కావటం వల్ల ఒక ఇల్లు, ఇంటి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి వీధి, వీధి నుంచి గ్రామం, గ్రామం నుంచి సమాజం సుశిక్షుతుల్ని చేస్తుంది. స్త్రీ విద్యావంతురాలు కాకపోతే ఇవన్నీ ఎలా సాధ్యం?

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply