పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి 

Share Icons:

నవంబరు 23 న సేవాతత్పరుడుసమతావాది సత్యసాయి 94 జయంతి

పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

1926 నవంబర్‌ 23న ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజులకు నాలుగో సంతానంగా సత్యసాయిబాబా జన్మించారు. కొండగుట్టల మధ్య ఉన్న ఓ కుగ్రామమైన గొల్లపల్లిలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు సత్యసాయికి మొదట్లో.. సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. 1940 అక్టోబర్‌ 20న తన 14వ ఏట తాను ‘సత్యసాయిబాబా’ను అంటూ తన అవతారాన్ని ప్రకటించుకున్నారు. 1941లో తొలిసారి బాబా భవిష్యవాణిని వినిపించారు. 25వ జన్మదినోత్సవం రోజున ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం చేశారు. అప్పటినుంచి బాబా కీర్తి ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తించాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆయన బోధనలు నాలుగు ముఖ్య విషయాలఉగా ప్రసిద్ధికెక్కాయి. అవే..ఒకటే కులం – మానవత; ఒకటే మతం – ప్రేమ; ఒకే భాష – హృదయం; ఒకే దేవుడు – అంతటా ఉన్నవాడు.

1954వ సంవత్సరం నుంచి ట్రస్ట్‌ తరపున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే 1956లో జనరల్‌ ఆస్పత్రి, 1991లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందజేస్తారు. 1964లో విద్యాసేవలు ప్రారంభించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాలయాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందజేస్తున్నారు. 1981లో శ్రీసత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలో తాగునీటి సమస్యను నివారించేందుకు 1995లో 300 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.

సమాజానికి సేవలు:  సత్యసాయిబాబా సమాజహితంగా అనేక సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాధినేతలు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంతోమంది ప్రముఖులు సత్యసాయిబాబాను దర్శించుకున్నారు.  బాబా శివైక్యం చెందినా.. భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంతినిలయం సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమవుతోంది.  బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ తమ హృదయాలలో నెలకొని ఉన్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు. మానవ సేవలోనే మాధవుణ్ని చూసి తరించమని భక్తులకు బోధించారు.

కుగ్రామమైన పుట్టపర్తిలో పేదలకు వైద్య సౌకర్యార్థం నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇందుకు ప్రధానమైన ఉదాహరణ. అంతేకాదు కరువుల జిల్లాకు తాగు నీటిసౌకర్యం, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే విద్యాలయాల నిర్మాణం, పట్టెడన్నానికి నోచుకోని దీనుల చెంతకే ఆహారం సేవాదళ్‌ కార్యకర్తలు మోసుకెళ్లే అమృత కలశం పథకం, ఇవన్నీ సమాజానికి ప్రేమతో పంచిన వరాలే. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ మనుషులంతా ఒక్కటేనని చెప్పారు. అన్ని మతాల సారమూ ఒకటేనని, మనిషిని మనిషి ప్రేమించాలి అని   చెప్పారు. వీణలో తీగెలు వేరువేరుగా ఉంటున్నాయి కాని వీణ ఒక్కటే. అదే విధంగా ఈ దేశమంతా ఒక వీణ, మతాలే తీగెలు. వీణలో ఏ ఒక్క తీగె అపస్వరం పలికినప్పటికీ వినడానికి ఇంపుగా ఉండదు, కనుక అన్ని మతాల క్షేమాన్ని, అందరి సంక్షేమాన్ని మనం ఆశించాలి అని   మతసామరస్యం గురించి ఉద్భోదించారు. సత్య సాయి బాబా అధ్వర్యంలో అప్పుడు ప్రత్యక్షంగా, ఇప్పుడు పరోక్షంగా ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి.

ఉన్నత విద్య : ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ  ప్రస్తుతం దీని పేరు, శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం).దేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా “A++” రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ. ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపూర్‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య   నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు.

వైద్యం : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 1991 నవంబరు 22న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించారు. బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. ఇది 2001 జనవరి 19న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రాంభించారు. ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. దాదాపు అయిదులక్షల మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది.  అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది. ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి.

త్రాగు నీరు: అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200కోట్ల రూపాయల పైన ఖర్చుతొ నిర్మించిన ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టులు త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి గోదావరి నదినుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరు సరఫరా చేసే ప్రాజెక్టు, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. మరికొన్ని వివిధ స్థాయిల్లో ఉన్నాయి, ఇంకొన్ని ప్రతిపాదన స్థాయి దాటాయి.

సాయి సమితులు : ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి. సత్యసాయి సమితి చిహ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళాలు ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింసలకు చిహ్నాలు. సత్యసాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ ‘సనాతన సారధి’ అనే మాస పత్రికతో బాటు 40 భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు. వివిధ దేశాలలో వారి శాఖలున్నాయి. 2001లో “సాయి గ్లోబల్ హార్మొనీ అనే రేడియో స్టేషన్ ప్రాంభమైంది. సత్యసాయి సంస్థలకు పెద్దమొత్తాలలో విదేశాలనుండి విరాళాలు లభిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ సత్యసాయిబాబా, 2004 ఏప్రిల్ 24 ఆదివారం ఉదయం (ఉత్తరాయణం వసంత రుతువు చైత్రబహుళ సప్తమి ఉత్తరాషాడ నక్షత్రంలో) 7.40 నిమిషాలకు ఈ పాంచభౌతిక దేహాన్ని విడనాడారు.

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply