మరో పెళ్లికి సిద్ధమవుతున్న పుతిన్

Putin -preparing -for- another- wedding
Share Icons:

మాస్కో, డిసెంబర్ 30,

“ఎంతవారైనా కాంత దాసులే” అన్నది పాత తెలుగు సామెత. ముదిమి మీద పడ్డా మగవాడు ఎప్పుడూ మరో పెళ్లికి సిద్ధంగా ఉంటాడన్నది ప్రతీతి. ఇందుకు మనకళ్ల ముందే ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఇ.రామస్వామి నాయకర్ వృద్ధాప్యంలో పెళ్లి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏడు పదుల వయసులో లక్ష్మీపార్వతిని వివాహమాడారు. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇన్ ఛార్జిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ దాదాపు ఏడు పదుల వయసులో మరో పెళ్లి చేసుకున్నారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అంతూపొంతూ ఉండదు. తాజాగా ఈ కోవలోకి చేరారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

అమెరికా తర్వాత అత్యంత శక్తిమంతమైన అగ్రరాజ్య అధిపతిగా పేరొందిన, అంతర్జాతీయ నాయకుడు, రష్యా దిగ్గజంగా పేరొందిన పుతిన్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నారన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవి పుకార్లు షికార్లు చేయడం కాదు. వదంతులు, ఊహాగానాలు అసలు కావు. స్వయంగా పుతిన్ వెల్లడించిన విషయం. అయితే ఆమె ఎవరు? ఎక్కడి వారు? ఎప్పుడు పెళ్లాడుతారు? వంటి వివరాలను వెల్లడించడం లేదు పుతిన్.అయినప్పటికీ ఆమె ఎవరో? ఎక్కడి వారో వంటి వివరాలు అంతర్జాతీయ మీడియా పసిగట్టింది. వివరాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 66 సంవత్సరాల పుతిన్ మనసు దోచుకున్న ఆ అతివ పేరు అలీనాకబేవా. మాజీ జిమ్నాసిస్ట్. ఒక జిమ్నాసిస్ట్ గా దేశానికి ఎన్నో పతకాలు అందించిన గొప్ప క్రీడాకారిణి ఆమె. 2004లో దేశానికి బంగారు పతకాన్ని ఆమె సాధించిపెట్టారు. జిమ్నాసిస్ట్ గా అనేక పోటీల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు. చిన్నప్పటి నుంచి తండ్రి నీడలో ఆటలే ప్రాణంగా ఆమె పెరిగారు.

ఉమ్మడి సోవియట్ యూనియన్ లో ఉజ్బెకిస్థాన్ ప్రాంతానికి చెందిన వారు. ఇప్పుడు ఉజ్బెకిస్థాన్ ప్రత్యేక దేశం. 1983లో ఆమె జన్మించారు. క్రీడాకారిణిగా అలీనా “డోపింగ్” ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2008లోనే పుతిన్ తో ప్రేమాయణంలో పడినట్లు చెబుతారు. రష్యా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో మీడియా హౌస్ ను నడపటం ప్రారంభించారు. విష‍యం ఇప్పుడు వెలుగులోకి వచ్చినప్పటికీ పుతిన్ తో అలీనా సహజీవనం ఎప్పటి నుంచో కొనసాగుతున్నట్లు మాస్కో మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతానికి ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది రష్యా పత్రికా ప్రపంచం.కుటుంబపరంగా పుతిన్ ఇద్దరు పిల్లల తండ్రి. 1983లో ల్యూద్మీనా ను వివాహం చేసుకున్నారు.

దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు వైవాహిక జీవితం ప్రశాంతంగా నడిచింది. 2013లో విడాకులు తీసుకున్నారు. 2000 అక్టోబరులో రష్యా అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించిన పుతిన్ వెంట ల్యూద్మినాకూడా ఉన్నారు. అప్పుడు వారు ప్రఖ్యాత ఆగ్రాలోని తాజ్ మహల్ ను కూడా సందర్శించి అనేక ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ దంపతులకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు. ఒకరు మరియా పుతిన్. ఈమె 1985 ఏప్రిల్ 28న జన్మించారు. రెండో కుమార్తె మెకటెరినా పుతిన్. ఈమె 1986 ఆగస్టు 31న జన్మించారు. వారిద్దరూ వివాహాలు చేసుకుని కుటుంబ జీవితాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం కూతుళ్లతో పుతిన్ కు పెద్దగా కుటుంబ సంబంధాలేవీ లేవు. తల్లితండ్రుల వైవాహిక బంధం చెడిపోవడం, తాజాగా తండ్రి మరో పెళ్లికి సిద్ధపడటంపై వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జరుగుతున్న పరిణామాలపై మౌనం పాటిస్తున్నారు.

రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఎవరి జీవితాలు వారివే. ఎవరిని ఎవరూ ప్రభావితం చేసే పరిస్థితి లేదు.66 సంవత్సరాల పుతిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు ఆసక్తికరం. ఆయన ఎదిగిన తీరు, కిందిస్థాయి నుంచి ఒక గూఢచారి ఏజెంటు స్థాయి నుంచి అంతర్జాతీయ నేతగా ఎదిగిన క్రమంలో అనేక ఆటుపోట్లు, కష్టనష్టాలు, ఎన్నో ఉన్నాయి. లెనిన్ గ్రాండ్ లో ఆయన 1952లో జన్మించారు. లెనిన్ గ్రాండ్ స్టేట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం సోవియట్ యూనియన్ గూఢాచారి సంస్థ (కేజీబీ) లో నిఘా అధికారిగా 16 సంవత్సరాలు పనిచేశారు. నిఘా అధికారిగా ఉన్నత నాయకులకు చేరువయ్యారు. అదే సమయంలో రాజకీయాలపై ఆసక్తిని పెంచుకున్నారు. 1991లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరిపోయారు.

నాటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ పాలనాయంత్రాంగంలోకి ప్రవేశించారు. అనతికాలం లోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.1999 డిసెంబరు 31న రష్యా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసే పరిస్థితి ఎప్పుడూ ఎదురవ్వ లేదు. క్రమంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ప్రధానిగానో, అధ్యక్షుడిగానో ఉంటున్నారు. 2000 నుంచి 2004 వరకూ తొలిసారిగా అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకూ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తించారు. 2008 నుంచి 2012 వరకూ రెండోసారి ప్రధానిగా పనిచేశారు. 2012 నుంచి 2018 వరకూ మూడోసారి అధ్యక్షుడిగా చక్రం తిప్పారు. 2018 మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు.

ఈ పదవిలో మరో నాలుగేళ్లు ఉంటారు. తద్వారా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. గతంలో జోసెఫ్ స్టాలిన్ ఎక్కువ కాలం అధికారంలో ఉన్న నేతగా గుర్తింపు పొందారు. రష్యా అధ్యక్షుడిగా దేశానికి పూర్వ వైభవం సాధించి పెట్టారన్న భావన ప్రజల్లో ఉంది. అగ్రరాజ్యంగా చితికిపోయిన రష్యాను బలోపేతం చేశారు. తద్వారా అంతర్జాతీయంగా దేశాన్ని అమెరికాకు దీటుగా రష్యాను నిలబెట్టారు. ఇప్పుడు అమెరికాను నిలదీసే పరిస్థితికి వచ్చారు. ఇదే రష్యా ప్రజల్లో ఆయనను నాయకుడిగా నిలబెట్టాయి. మొత్తానికి నాయకుడిగా గుర్తింపు పొందిన పుతిన్ తాజాగా పెళ్లి ద్వారా వార్తల్లోకి ఎక్కారు.

 

మామాట: తలలు బోడులైన తలపులు బోడులౌనా… 

Leave a Reply