కడపలో టీడీపీ ఖాళీ…వైసీపీలోకి జగన్ ప్రత్యర్ధి….

Share Icons:

కడప: కడప జిల్లాలో టీడీపీ ఖాళీ కానుంది. ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరికొందరు వైసీపీ వైపు వెళ్లనున్నారు. ఈక్రమంలోనే జగన్ ప్రత్యర్ధి,  పులివెందులకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి పార్టీ ఫిరాయించడం దాదాపుగా ఖరారైంది. తెలుగుదేశం పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పబోతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. దీనికోసం ముహూర్తం చూసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదన ఆయన వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు సతీష్ రెడ్డి. పార్టీ నుంచి ఎలాంటి అండ లేనప్పటికీ.. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేయడం ఆనవాయితీ. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు.

తాను వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నానంటూ వస్తోన్న వార్తలను సతీష్ రెడ్డి తోసిపుచ్చట్లేదు. ఇలాంటి వాతావరణం మధ్య ఆయన పార్టీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశం అయ్యారు. విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి బాగోలేదని, అగ్ర నాయకత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల పార్టీని బాగు చేయలేమని కూడా సతీష్ రెడ్డి అనుచరులు కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం చేయడం లేదా.. పార్టీ ఫిరాయించడం ఈ రెండింట్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమైందని సమాచారం.

పులివెందుల నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాలపై సతీష్ రెడ్డికి మంచి పట్టు ఉంది. పార్టీ పరంగా కాకపోయినా.. సతీష్ రెడ్డిని చూసి టీడీపీకి ఓట్లు వేసే ప్రజలు ఉన్నారు. వారికోసమైనా తాను రాజకీయాల నుంచి వైదొలగకూడదనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. పార్టీకి అతీతంగా.. రాజకీయాలతో సంబంధం లేకుండా తన వెంట నడిచే అనుచరులు, అభిమానుల కోరిక మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడానికి సతీష్ రెడ్డి సన్నాహాలు పూర్తిచేశారని అంటున్నారు.

సతీష్ రెడ్డి పార్టీని ఫిరాయించితే.. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టే. తన వెంట ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఆయన వైసీపీలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Leave a Reply