మన తెలుగు సామెతలు (‘ఎ – ఏ – ఐ’ అక్షరములతో)

Share Icons:

ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు
ఎంగిలికి ఎగ్గు లేదు – తాగుబోతుకు సిగ్గు లేదు
ఎంచపోతే మంచమంతా కంతలే
ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు
ఎండా వాన కలిసివస్తే కుక్కా నక్కల పెళ్ళంట
ఎండు నేలమీద ఎండ్రకాయ కనబడితే వాన పడుతుంది
ఎంత వుంటేనేం తినేది అన్నమే, బంగారం కాదు
ఎంత తిన్నా పరగడుపే
ఎంత ఉప్పు తింటే అంత దాహం
ఎంత చెట్టుకు అంత గాలి
ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు
ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే
ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడే తోక
ఎంత ప్రొద్దుండగా లేచినా సందు చివరే తెల్లవారినట్లు
ఎంత ప్రాప్తమో అంతే ఫలం
ఎంతమంచి గొల్లవాడికైనా వేపకాయంత వెర్రి వుండకపోదు
ఎంతయినా పరాయి సొమ్ము పరమాన్నమన్నట్లు
ఎంతవాడయినా ఆడదానికి లోకువే
ఎంత వాడయినా కాంతా దాసుడే
ఎంత వెలుగుకు అంత చీకటి
ఎంత సంపదో అంత ఆపద
ఎంత సంపాదించినా కూటికే – ఎంత బ్రతికినా కాటికే
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు
ఎందుకు ఏడుస్తున్నావంటే, మొగుడు కొట్టబోయే దెబ్బలకందంట
ఎక్కడ వున్నావే గొంగళీ అంటే వేసిన చోటే వున్నానన్నదట
ఎక్కడయినా బావే గానీ వంగ తోట దగ్గర కాదు
ఎక్కడికి పోయినా ఏలినాటి శని తప్పదన్నట్లు
ఎక్కడికి పోయినా చేసుకున్న ఖర్మం ఎదురు వస్తుంది
ఎక్కడిదిరా ఈ పెత్తనమంటే – మూలనుంటే నెత్తినేసుకున్నానన్నాడట
ఎక్కడి నీరూ పల్లానికే పయనం
ఎక్కమంటే ఎద్దుకు కోపం – దిగమంటే కుంటికి కోపం
ఎక్కి కాయను చూసి, దిగివచ్చి రాయి రువ్వినట్లు
ఎక్కినవానికి ఏనుగు లొజ్జు
ఎక్కువగా తిన్న పొట్ట – ఏకులు పెట్టిన బుట్ట చిరుగవు
ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం – తక్కువ తెలివి తన్నుల కారణం
ఎక్కువ వెల పెట్టి గుడ్డును, తక్కువ వెల పెట్టి గొడ్డును కొనరాదు
ఎగదీస్తే బ్రహ్మ హత్య – దిగదీస్తే గో హత్య
ఎగిరి పడే గొడ్డే మరి మానెడు మోస్తుంది
ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి
ఎట్లాంటి కోమటికైనా నిమ్మకాయంత బంగారం వుంటుంది
ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది
ఎడపిల్ల ఏరాలితో సమానం
ఎడమచేత్తో తెలియక చేసేది కుడిచేత్తో తెలిసి అనుభవించాలి
ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లు
ఎత్తివచ్చిన కాపురానికి ఏ కాలూనినా ఒక్కటే
ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు
ఎత్తుకు పైఎత్తు
ఎత్తుబారం మొత్తుకోళ్ళు
ఎత్తువారి బిడ్డ
ఎత్తెత్తి అడుగులేస్తే పుల్లాకుల మీద పడ్డాయట
ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే
ఎద పొంగుతోంది – నా వన్నెలు చిన్నెలు చూడమన్నదట
ఎదురు అన్నది మాట – ఎదాన పెట్టింది వాత
ఎదుట ఉన్నవాడు పెళ్ళికొడుకు
ఎదుట లేకుంటే ఎదలో వుండదు
ఎదురింట్లో పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు
ఎదురుగుండా అద్దముంటే వెక్కిరించుకో బుద్ధి
ఎదురు తిరిగిన కుక్క, ఏదుపంది ఒక్కటే
ఎదురు పడిన వాడే నా మొగుడు అన్నట్లు
ఎద్దు ఎండకు లాగు – దున్న నీడకు లాగు
ఎద్దుకు, ఎనుబోతుకు లంకె వేసినట్లు
ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి?
ఎద్దు కొద్దీ సేద్యం – చద్ది కొద్దీ పయనం
ఎద్దు క్రొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు
ఎద్దుగా కలకాలం బ్రతికేకంటే ఆబోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు
ఎద్దును అడిగా గంట కట్టేది?
ఎద్దున్నవాడి సేద్యం చూడు – మంది వున్నవాడి బలం చూడు
ఎద్దు పుండు కాకికి ముద్దా?
ఎద్దు బీదదయితే చేను బీద
ఎద్దు మంచిదయితే సంత కెందుకు వెళుతుందిట?
ఎద్దులా ఉన్నావు పని చేయలేవా?
ఎద్దులా తిని మొద్దులా నిద్ర పోయినట్లు
ఎద్దువలె కుక్కను పెంచి తానే మొరిగినట్లు
ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం
ఎన్నడూ దొరకనమ్మకు ఏగానీ దొరికితే ముడిమీద ముడి ఏడు ముళ్ళు వేసిందట
ఎన్నాళ్ళున్నా అత్తారింటికి పోకతప్పదు
ఎన్ని పుటాలు పెట్టినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదు
ఎన్ని విద్యలయినా కుల విద్యకు సాటిరావు
ఎన్నో వ్రణాలు కోసానుగానీ, నా వ్రణమంత బాధలేదు అన్నాడట
ఎముకలేని నాలుక ఎట్లా త్రిప్పినా తిరుగుతుంది
ఎముక లేని నాలుక ఏమయినా పలుకుతుంది
ఎరగని ఊళ్ళో మొరగని కుక్క
ఎరువుసొమ్ములు బరువుచేటు – తియ్యా పెట్టా తీపులచేటు – అందులో ఒకటి పోతే అప్పుల చేటు
ఎరువు వుంటే వెఱ్ఱివాడూ సేద్యగాడే
ఎరువు పెట్టిన చేను – ఏలుబడి అయిన కోడలు
ఎరువు లేని చేను – వేగంలేని ఏరూ ఒకటే
ఎరువు లేని పైరు – పరువు లేని వూరూ ఒక్కటే
ఎఱను వేసి చేపను పట్టినట్లు
ఎఱుక పిడికెడు ధనము
ఎఱ్ఱ కోమటినీ నల్ల బ్రాహ్మడినీ నమ్మరాదు
ఎఱ్ఱభూమి పంట ఒకనాటి మాట
ఎలుకమీద కోపంతో ఇంటికి నిప్పంటించుకొన్నట్లు
ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు తెల్లవార్లూ బాడుగ తోలారుట
ఎవడి కంపు వాడికింపు
ఎవడి నోటికంపు వాడికి తెలియదు
ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు
ఎవరి ఏడుపు వాళ్ళకే తగులుతుంది
ఎవరి పిచ్చి వారికి ఆనందం
ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కి ఏడ్వటానికి?
ఎవరికి పెట్టావే దండమంటే మీలో బుద్ధిహీనుడికి అన్నదట
ఎవరికి వారే యమునాతీరే
ఎవరి పాపాన వాళ్ళే పోతారన్నట్లు
ఎవరి ప్రాణం వారికి తీపి
ఎవరి బిడ్డ వారికి ముద్దు
ఎవరి ముడ్డి క్రిందకి నీళ్ళు వస్తే వాళ్ళే లేస్తారు
ఎవరూ లేకపోతే అక్క మొగుడే దిక్కు
ఎసట్లో గింజలన్నీ పట్టి చూడాలా?

అక్షరంతో

ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు
ఏ ఎండకా గొడుగు పట్టినట్లు
ఏకాంతంలో కాంతా కలాపాలే ముద్దన్నట్లు
ఏ కర్రకు నిప్పంటుకుంటే ఆ కర్రే కాలుతుంది
ఏకాదశి ఇంటికి శివరాత్రి వెళ్ళినట్లు
ఏ కాలు జారినా పిర్రకే మోసం
ఏకుతో తాకితే మోకుతో కొడతారు
ఏకులాగ వచ్చి మేకులాగా అయినట్లు
ఏ గాలికా చాప యెత్తినట్లు
ఏ గుంటనీరు ఆ గుంటకేనన్నట్లు
ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది
ఏ గూటి పక్షి ఆ గూటికే
ఏ గ్రహం పట్టినా ఆగ్రహం పట్టరాదు
ఏ చెట్టూ లేనిచోట ఆముదపుచెట్టు మహావృక్షం
ఏటవతల యిచ్చేకన్నా యేట్లో పారేయటం ఉత్తమం
ఏటి ఈతకు లంక మేత సరి
ఏటి వొడ్డు చేను ఏరు వస్తే ఉంటుందా?
ఏటి వొడ్డు చేనుకు మాటిమాటికీ భయం
ఏటికి ఎదురీదినట్లు
ఏటికి లాగితే కోటికీ – కోటికి లాగితే ఏటికీ అన్నట్లు
ఏటిగట్టు దాని మాట యెన్నడూ నమ్మరాదు
ఏటిముందర – కూటిముందర తడవ సెయ్యకు
ఏటివంక లెవరు తీరుస్తారు?
ఏటివరద – నోటిదురద రెండూ ఒక్కటే
ఏటుకు ఏటు – మాటకు మాట
ఏట్లో పారే నీరు యెవరు త్రాగితేనేం?
ఏట్లో వేసినా యెంచి వేయాలి
ఏడవగలిగితే ఏడ్చేకొద్దీ వ్యవసాయం
ఏడవనేరిస్తేనే వ్యవసాయం
ఏడ్చి ముఖం కడుక్కున్నట్లు
ఏడు కురచలు చూచి యెద్దు కొనాలి
ఏడుపులో ఏడుపు
ఏడుపులో ఎడమ చేయి అన్నట్లు
ఏడు మాటలు మాట్లాడినా ఏడడుగులు నడిచినా గుణం తెలుస్తుంది
ఏడు మెతుకులు కతికితే ఏనుగంత బలం
ఏడుస్తూ ఏరువాక సాగిస్తే కాడీ, మోకూ దొంగలు యెత్తుకుపోయారట
ఏడ్చేదాని ఎడమచేతి క్రిందా, కుట్టేదాని కుడిచేతి క్రిందా కూర్చోరాదన్నట్లు
ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడు అన్నట్లు
ఏడ్చేవాడిని చూచి నవ్వినట్లు
ఏతాము పాటకు ఎదురుపాట లేదు
ఏ దారి అంటే గోదారి అన్నట్లు
ఏదుంతిన్నా ఏకాదశే పందుంతిన్నా పరగడుపే
ఏ దేముడు వరమిచ్చినా మొగుడు లేందే పిల్లలు పుట్టరు
ఏనుగంత తండ్రి ఉండే కంటే ఎలుకంత తల్లి మేలు
ఏనుగుకు వెలక్కాయలు లొటలొట
ఏనుగు తొండమూ తిరుగుబోతు ముండ వూరుకోవు
ఏనుగు దాహానికి చూరునీళ్ళా?
ఏనుగు నిచ్చి అంకుశం దాచుకున్నట్లు
ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లు
ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యే
ఏనుగుమీద ఈగ వాలినట్లు
ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండాకూడా!
ఏనుగులే గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా సంగతేమిటి అన్నదట
ఏ పని చేసినా పొయ్యిలో ఏకులు దాచుకున్నట్లే
ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు
ఏ పుట్టలో ఏ పాముందో?
ఏ పూజ తప్పినా పొట్టపూజ తప్పదు
ఏబ్రాసికి పనెక్కువ – లోభికి ఖర్చెక్కువ
ఏ మందలో పట్టినా, మన మందలో ఈనితే సరి
ఏమి చేసుకుని బ్రతకనమ్మా అంటే నోరు చేసుకుని బ్రతకమన్నట్లు
ఏమి చేస్తున్నావురా అంటే పారబోసి యెత్తుతున్నా అన్నాట్ట
ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట
ఏమీ ఎరుగని వాడు చీరముడి, పోకముడి విప్పి ఆశ్చర్యంగా చూసాడట
ఏమీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి పోయిందట
ఏమీ లేకపోతే మూట విప్పి మళ్ళీ కట్టమన్నట్లు
ఏమీ లేనమ్మకు యేడ్పులే శరణ్యం
ఏమీ లేనివానికి ఏతులు లావు – స్వాములవారికి జడలు లావు
ఎముకలు విరిగేటట్లు పనిచేస్తే దంతాలు అరిగేటట్లు తినవచ్చు
ఏరా బడాయిబావా అంటే ఏమే గుడ్డి కంటి మరదలా అన్నాడట
ఏ రాయి అయితేనేమి పండ్లూడ గొట్టుకోవటానికి!
ఏ రేవుకు వెళ్ళినా ముళ్ళపరిగే దొరికిందన్నట్లు
ఏరు యెన్ని వంకలు పోయినా కలిసేది సముద్రంలోనే
ఏరు యెంతపారినా కుక్కకు గతుకునీళ్ళే
ఏరు ఏడామడలదూరం వుండగానే చీరవిప్పి చంకలో పెట్టుకున్నదట
ఏరు దాటి తెప్ప తగలేసినట్లు
ఏరు పోయిందే పోక – యేలిక చెప్పిందే తీర్పు
ఏరు ముందా? ఏకాదశి ముందా?
ఏరు మూరెడు తీస్తే – కొలను బారెడు తీస్తుంది
ఏలటానికి వూళ్ళు లేకపోవచ్చుకానీ బిచ్చమెత్తుకు తినటానికి వూళ్ళే లేవా?
ఏలేవాడి యెద్దు పోతేనేం – కాచేవాడి కన్ను పోతేనేం?
ఏళ్ళు యెగసన – బుద్ధి దిగసన
ఏవాడ చిలుక ఆవాడ పలుకు పలుకుతుంది
ఏ వేషం వేస్తేనేం? గ్రాస మొస్తుంది గదా!
ఏ వేషం వచ్చినా దివిటీ వానికే చేటు

అక్షరంతో

ఐదు నిముషాల సుఖానికి మరుజన్మ నెత్తాలి అందిట
ఐశ్వర్య దేవత హలంలోనే వుంది
ఐశ్వర్యానికి అంతం లేదు – దారిద్ర్యానికి మొదలూలేదు

Leave a Reply