మన తెలుగు సామెతలు (‘ఆ’ అక్షరంతో)

Share Icons:

మన తెలుగు సామెతలు (‘ఆ’ అక్షరంతో)

ఆఁ అంటే అపరాధం – కోఁ అంటే బూతుమాట
ఆఁ అంటే ఆరు నెలలు
ఆ యింటికి ఈ ఇల్లెంత దూరమో ఈ యింటికాయిల్లూ అంతే దూరం
ఆ యింటికి తలుపూ లేదు, ఈ యింటికి ద్వారబంధమూ లేదు
ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
ఆకతాయి కోరికల ఆకలి కేకలే సోయగాల విహారాలన్నట్లు
ఆకలి అవుతోంది అత్తగారూ అంటే రోకలి మింగవే కోడలా అన్నదట
అకలి ఆకాశమంత – నోరు సూది బెజ్జమంత
ఆకలిగొన్న కరణం పాత కవిలి బయటకు తీసాడట
ఆకలిగొన్నమ్మ ఎంగిలికి రోయదు
ఆకలి తీరేందుకు అర్ధగంట పోరు చాలు అన్నదట
ఆకలి రుచి ఎరుగదు – నిద్ర సుఖ మెరుగదు
ఆకలిలేనివానికి అజీర్ణం సంగతి ఏమి తెలుస్తుంది?
ఆకారం వుంటే శ్రీకారం ఉండొద్దూ!
ఆకారం చూసి ఆశ పడటమేగానీ, ‘అందులో’ పసలేదు అయ్యకు అందట
ఆకారం వికారంగా వున్నా బుద్ధి సూరేకారంగా వుంది
ఆకార పుష్టి – నైవేద్యనష్టి
ఆకాశమంత ఎత్తు ఎదిగినట్లు
ఆకాశమంత గొప్ప అన్నట్లు
ఆకాశానికి నిచ్చెనలు వేసినట్లు
ఆకు యిస్తే అన్నం పెట్టినంత పుణ్యం
ఆకుకు అందక – పోకకు పొందక
ఆకు చుట్టను – ఆడదానిని నమ్మరాదు
ఆకుతోట సేద్యం అన్ని అవసరాలనూ తీరుస్తుంది
ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెట్టినట్లు
ఆకులు నాకే వాళ్ళింటికి మూతులు నాకే వాళ్ళు వచ్చినట్లు
ఆకులో అంతా పెట్టి అంచున పెంట పెట్టినట్లు
ఆకూ పోకా అందిస్తే అందాలన్నీ వడ్డిస్తా అందట
ఆగభోగాలు – అంకమ్మ శివాలు
ఆగభోగాలు అంకమ్మవి, పొలికేకలు పోలేరమ్మవి
ఆ గొడ్డు మంచిదయితే ఆ వూళ్ళోనే అమ్ముడయ్యేదిగా
ఆచారం అన్నంభొట్లూ అంటే పెద్ద చెరువును కుక్క ముట్టుకుపోయిందన్నాడట
ఆచారం ఆరుబారులు – గోచీపాత మూడుబారలు
ఆచారం ముందు – అనాచారం వెనుక
ఆచారానికి అంతం – అనాచారానికి ఆది లేవు
ఆచారాలు నిలుస్తాయి – అర్థాలు పోతాయి
ఆటా పాటా మా యింట – మాపటి భోజనం మీ యింట
ఆడంగులలో పెదబావ
ఆడంబరానికి అంటకత్తెర వేసినట్లు
ఆడ చెత్త – మగ బంగారం
ఆడదానికి అలుసిస్తే తలకెక్కి కూర్చుంటుంది
ఆడదాని కౌగిలి సుఖాల లోగిలి
ఆడదానిచేతి అర్థం – మగవాడిచేతి బిడ్డ మనవు
ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు
ఆడదాని బుద్ధి అపరబుద్ధి
ఆడదాని బ్రతుకూ – అరిటాకు బ్రతుకూ ఒక్కటే
ఆడదాని మాట ఆపదలకు మూలం
ఆడదాని మాట నీటి మూట
ఆడదాన్ని చూచినా, అర్థాన్ని చూచినా బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు
ఆడది తిరిగి – మగాడు తిరక్క చెడతారు
ఆడది అబద్ధమాడితే గోడపెట్టినట్లు, మగాడు అబద్ధమాడితే తడికె పెట్టినట్లు
ఆడది లేనిది అడవి – మగాడు లేనిది మఠం
ఆడదే అమృతమూ, హాలాహలమూ
ఆడదై పుట్టేకంటే అడవిలో మ్రానై పుట్టేది మేలు
ఆడపిల్ల పరువాలు సంబరాల జాతరలు అన్నట్లు
ఆడపడచు ఉసూరుమంటే ఆరు తరాలు అరిష్టం
ఆడపిల్ల పుట్టిందంటే, ఆయువు సగం క్రుంగిందన్నమాటే
ఆడపిల్ల పెళ్ళి – అడుగు దొరకని బావి ఒకటే
ఆడ పెత్తనం – తంబళ్ళ దొరతనం
ఆడ బిడ్డ అర్ధమొగుడు
ఆడబిడ్డ కత్తికి ఇరువైపులా పదునే
ఆడబోతే చూడబుద్ధి – చూడబోతే ఆడ బుద్ధి
ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు
ఆడలేక మద్దెల ఓడన్నట్లు
ఆడశోకం – మగ రాగం ఒక్కటే
ఆడి తప్పితే అపకీర్తి
ఆడిది ఆట – పాడింది పాట
ఆడది నీతి తప్పిన తర్వాత అంతేమిటి? ఇంతేమిటి?
ఆడబుద్ధి కంటే అపర బుద్ధి లేదు
ఆడే కాలూ – పాడే నోరూ వూరుకోవు
ఆ తండ్రికి కొడుకు కాడా!
ఆ తుష్టికీ, ఈ నష్టికీ సరి
అత్రగాడు ఒళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నాట్ట
ఆత్రగాడికి బుద్ధి తక్కువ
ఆత్రానికి పోతే ఆడపిల్ల పుట్టినట్లు
ఆదర్శాలు శిఖరమెక్కితే, అవసరాలు అగాధంలోకి తోస్తాయి
ఆదాయంలేని శెట్టి వరదకు పోడు
ఆదిలోనే హంసపాదన్నట్లు
ఆ పడుగులోనిదే ఈ పీలికా
ఆపదకు పాపం లేదు
ఆపద మ్రొక్కులు – సంపద మరపులు
ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు
ఆపదలో అడ్డుపడే వాడే చుట్టము
ఆపదలో ఆదుకోవాలి, ఆస్థిలో పంచుకోవాలి
ఆమడ నడిచినా ఆరిక కూడు తప్పలేదు
ఆమని సోయగాలు అందాలు విందులు అన్నట్లు
ఆ మాటా ఈ మాటా యింటి పెద్దకు
ఆమాటకూ, ఈ మాటకూ పెద్దకోడలు – ఆచేతి తుడుపుకూ, ఈచేతితుడుపుకూ అడ్డుగోడ
ఆముదాల బేరం – కామెర్ల రోగం నమ్మరానివి
ఆయ మెరిగి వ్యయం చేయాలి
ఆయాసాల మొగుడికి రేసు గుర్రంలాటి భార్య అన్నట్లు
ఆయుర్దాయం గట్టిగా వుంటే అడవిలో వున్నా బ్రతకవచ్చు
ఆయుర్దాయం వున్న రోగి హస్తవాసి వున్నా వైద్యుడి దగ్గరికే పోతాడు
ఆయువు గట్టిదయితే చాలు అన్ని రోగాలు పోతాయి
ఆయుష్యం ఆరుపాళ్ళు – యాతన ఏడు పాళ్ళు
ఆయుష్షు లేక చచ్చాడు గానీ వైద్యం లేక కాదు
ఆయెనమ్మా పెండ్లి – అణిగెనమ్మా రంధి
ఆరంభ శూరుడికి ఆర్భాటాలెక్కువ
ఆరగించగా లేనిది అడిగితే వచ్చిందా!
ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట
ఆరాటమేగానీ పసలేదన్నట్లు
ఆరాటాల పెళ్ళాం – ఆయాసాల మొగుడు
ఆరికకు చిత్త గండం – ఆడదానికి పిల్ల గండం
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె
ఆరుద్ర కార్తె విత్తనానికీ – అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు
ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి
ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి
ఆరుద్రతో అదను సరి
ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది
ఆరుద్ర వాన అదను వాన
ఆరుద్రకు ఆమ్లాలు కూడా పండుతాయి
ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు
ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు
ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు
ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం
ఆర్భాటపు ఆడదానికి ఆరుగురు మొగుళ్ళు
ఆర్చేవారే గానీ తీర్చేవారే లేరు
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు
ఆలికి అదుపు – ఇంటికి పొదుపు
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
ఆలికి లొంగినవాడూ, అరగాణిలో పడినవాడూ ఉక్కిరి బిక్కిరి అవుతాడు
ఆలిని అదుపులో పెట్టలేడు గానీ, మందిని అదుపులో పెడతాడట
ఆలిని విడిస్తే హరిదాసు – సంసారం విడిస్తే సన్యాసి
ఆలి మాట విన్నవాడూ – అడవిలో పడ్డవాడూ ఒక్కడే
ఆలి వంక వారు ఆత్మ బంధువులు
ఆలి శుచి ఇల్లు చెబుతుంది
ఆలి ఏడ్చిన ఇల్లు – ఎద్దు ఏడ్చిన సేద్యం కలసిరావు
ఆలి చచ్చిన వారికి ఆలి బంగారం
ఆలి బెల్లం – తల్లి విషం
ఆలుమగల కలహం అద్దం మీద ఆవగింజ వేసినంతసేపే
ఆలుమగల కలహం అన్నం తినేదాకానే
ఆలుమగల కలహం కౌగిళ్ళలోకి చేరే వరకే
ఆలు లేత – నారుముదురు
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు
ఆవగింజంత సందు వుంటే అరవై గారెలు తిననా? అన్నాడట
ఆవాలు ముద్ద చేసినట్లు
ఆవాహనా లేదు, విసర్జనా లేదు
ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా?
ఆవు తొలి చూలు – గేదె మలిచూలు మంచిది
ఆవునిచ్చి పలుపు దాచుకున్నట్లు
ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు
ఆవు పాడి ఎన్నాళ్ళు? ఐశ్వర్య మెన్నాళ్ళు?
ఆవులను మళ్ళించినవాడే అర్జునుడు
ఆవులలో ఆబోతై తినాలి – అత్తవారింట అల్లుడై తినాలి
ఆవులిస్తే ప్రేగులు లెక్కబెట్టినట్లు
ఆవులూ ఆవులూ పోట్లాడుకుంటూ లేగల కాళ్ళు విరగత్రొక్కినట్లు
ఆవు లేని యింట అన్నమే తినరాదు
ఆవేశం ఆకాశమంత – ఆలోచన ఆవగింజంత
ఆశకు అంతు లేదు – గోచీకి దరిద్రం లేదు
ఆశకు అంతం లేదు – నిరాశకు చింత లేదు
ఆశకు పోతే గోచీ వూడిందట
ఆశకు మించిన దూరం – వడ్డీకి మించిన వేగం లేవు
ఆశకు ముదిమి – అర్థికి సౌఖ్యం లేవు
ఆశ గలమ్మ దోష మెరుగదు – పూటకూళ్ళమ్మ పుణ్య మెరుగదు
ఆశ బోధిస్తున్నది – అవమానం బాధిస్తున్నది
ఆశబోతు బాపనికి గోచీపాతే సంచి
ఆశలు తగ్గించుకుంటే అశాంతికి తావులేదు
ఆశ సిగ్గెరుగదు – నిద్ర సుఖ మెదుగదు
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యమంటారు
ఆశ్లేష వర్షం అందరికీ లాభం
ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుంది
ఆశ్లేష ముసలి కార్తె – ఆగి ఆగి తుంపర తుంపరగా కురుస్తుంది
ఆశ్లేషలో అడుగుకొక చినుకు పడినా అడిగినన్ని వడ్లు
ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
ఆశ్లేషలో ఊడ్చినట్లయితే అడిగినంత పంట
ఆశ్లేషలో తడిస్తే ఆడది మగవాడౌతుంది
ఆశ్లేషలో పూస్తే అంతులేని పంట
ఆషాఢమాసంలో అరిశెలు వండను ప్రొద్దు వుండదు
ఆషాఢానికి ఆకుపోతలు
ఆసక్తి మారకం – అనాసక్తి తారకం
ఆసనంలో పుండు – అల్లుడి వైద్యం
ఆసులో పుల్లలా తిరిగినట్లు
ఆస్థికొక కొడుకు – ప్రేమకొక కూతురు
ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొగమాటం పనికిరాదు

 

Leave a Reply