ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుతున్నారా… ఇది తెలుసుకోండి

Share Icons:

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17,

జబ్బుచేసినవారికి, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకూ నరకం చూపిస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడాకి కళ్లెం పడింది.  అనారోగ్యంతో వెళితే అడ్డగోలు ఫీజులు రుద్ది.. అవి చెల్లించకపోతే ఇంటికి పంపేది లేదని ఆసుపత్రివారు ఇక భీష్మించేందుకు ఎంతమాత్రం అవకాశం ఉండదు! ఫీజుల బకాయి పేరుతో ఆస్పత్రి యాజమాన్యాలు రోగి డిశ్చార్జ్‌కు అడ్డుపడినా.. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు తిరస్కరించినా అది తీవ్ర నేరం కానుంది. ఈ మేరకు రోగుల హక్కులపై అధికార పత్రం తాలూకు ముసాయిదాను జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సిద్ధం చేసింది. ఈ డ్రాఫ్ట్‌ చార్టర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. రోగుల హక్కుల పత్రంపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

అనంతరం రోగుల హక్కులపై అధికార పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డ్రాఫ్ట్‌లోని వివరాల ప్రకారం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాలనుకున్న రోగిని, సంబంధీకులకు అప్పగించాల్సిన మృతదేహాన్ని ఫీజు బకాయిలు తదితర తప్పుడు పద్ధతుల్లో ఆస్పత్రులు అడ్డుకోకూడదు. ఇక రోగికి అందజేస్తున్న వైద్యసేవలు, చికిత్స వివరాలను కుటుంబీకులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలునూ ఈ డ్రాఫ్ట్‌ కల్పించింది. రోగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు అతడికి సంబంధించిన కేస్‌ పేపర్స్‌ను, ఇండోర్‌ పేషంట్‌ రికార్డ్స్‌ను, ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్స్‌ తాలూకు ఒరిజినల్‌ కాపీలను సదరు కుటుంబీకులు కోరిన 24 గంటల్లో ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆస్పత్రి యాజమాన్యం అందజేయాల్సి ఉంటుంది.

అలాగే ఈ రికార్డ్స్‌ అన్నింటినీ డిశ్చార్జ్‌ అయిన తర్వాత 72 గంటల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. రోగికి అందుతున్న వైద్యసేవలు, చికిత్సపై అతడి సంబంధీకులు సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవాలనుకుంటే వారి నిర్ణయాన్ని ఆస్పత్రి యాజమాన్యాలు విధిగా గౌరవించాలి. ఆ మేరకు వారు కోరితే.. రోగికి సంబంధించిన సమగ్ర కేస్‌షీట్‌ను సంబంధీకులకు అందజేయాల్సివుంటుంది. ఆస్పత్రిపై రోగుల బందువులు ఎలాంటి ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఈ డ్రాఫ్ట్‌లో పొందుపర్చారు.

మామాట:   విధి విధానాలు బాగున్నాయి, మరి అమలులో ఇంత కఠినంగా ఉంటారా.

Leave a Reply