ఉత్తర కొరియాలోకి కరోనా వస్తే అధికారులకు అదే ఆఖరిరోజు: కిమ్ వార్నింగ్

More than 2,700 cases of coronavirus in China as death toll climbs to 80
Share Icons:

ఢిల్లీ: చైనాలోని వుహాన్‌ నగరంలో మొదలైన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే. మొత్తం 57 దేశాల్లో కరోనా కేసులు వెలుగుచూడటంతో మరింత కలవరానికి గురిచేస్తోంది. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలకు కరోనా వ్యాపించింది.

ఇప్పటికే వైరస్ సౌత్ కొరియాను భయపెడుతోంది. శుక్రవారం ఒక్క రోజే ఆ దేశంలో కొత్తగా 594 మందికి సోకింది. ఫలితంగా ఆ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 2,931 మందికి చేరింది. తాజాగా, మరో ముగ్గురు మహిళలు ఈ వైరస్ కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 16కు పెరిగింది. మరోవైపు చైనాలో నిన్న 47 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా అందులో 45 మంది ఒక్క హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. కొత్తగా మరో 427 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలోని బాధితుల సంఖ్య 79,251 మందికి చేరింది.

దక్షిణ కొరియాను కోవిడ్ వణికిస్తుండడంతో పక్కనే ఉన్న ఉత్తరకొరియా అప్రమత్తమైంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, తన దేశపు అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇంతవరకూ కరోనా వైరస్ తమ దేశంలోకి రాలేదని గుర్తు చేసిన ఆయన, దేశంలోకి వైరస్ వ్యాపిస్తే, వైద్య ఆరోగ్య అధికారులు కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వుంటుందని, అది మరణ దండన కూడా కావచ్చని హెచ్చరించారు. సరిహద్దులు దాటి ఈగను కూడా దేశంలోకి రానివ్వవద్దని, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకోవాలని ఆయన అన్నారు.

ఉత్తర కొరియా సరిహద్దులన్నీ మూసి వేయాలని, కరోనా ప్రభావం తగ్గేంత వరకూ దేశంలోని పౌరులెవరూ విదేశాలకు వెళ్లరాదని, విదేశాల్లోని వారెవరికీ దేశంలోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ఉత్తర కొరియన్లను కూడా దేశంలోకి అడుగు పెట్టనివ్వరాదని ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ రైళ్లను, విమానాలను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఉత్తర కొరియాకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లయింది.

అటు ఇటలీలో 11 నగరాలలో ప్రజా రవాణా నిలిపివేయగా, బ్రిటన్, జపాన్, ఇరాన్, జర్మనీలు పాఠశాలలను మూసివేశారు. కాలిఫోర్నియాలో 8,400 మంది కరోనా అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. భారత్ సహా పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీని జారీచేయగా.. మక్కా సందర్శనకు వచ్చే విదేశీ యాత్రికులను సౌదీ తాత్కాలికంగా నిషేధించింది.

ఇరాన్‌లో కరోనా వైరస్‌తో 200 మందికిపైగా మృతిచెందినట్టు ఇరాన్ ఆరోగ్య విభాగం వర్గాలు వెల్లడించాయని బీబీసీ ప్రకటించింది. మరోవైపు, ఆసియా రీజినల్ సమ్మిట్‌ను అమెరికా వాయిదా వేసింది. తమ పౌరులు అత్యవసరమైతే తప్ప ఇటలీ పర్యటనను రద్దుచేసుకోవాలని సూచించింది.

 

Leave a Reply