పీకే స్ట్రాటజీ: జగన్‌ గెలుపుని రిపీట్ చేసిన కేజ్రీవాల్..!

Share Icons:

ఢిల్లీ: 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అదిరిపోయే మెజారిటీతో గెలవడానికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో ఉందో అందరికీ తెలిసిందే. ఆయన మాస్టర్ మైండ్‌తో టీడీపీని చిత్తు చేసి, వైసీపీకి బంపర్ విక్టరీ అందించారు. అలా జగన్‌కు తిరుగులేని రాజకీయ వ్యూహాలు అందించి ఘన విజయం దక్కేలా చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… బీజేపీని అడ్డుకుని మరోసారి కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం దక్కించుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఎన్నికల వ్యూహకర్తగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.

లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో ఇక ఆప్ పనైపోయినట్టే అని చాలామంది భావించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్ సభ తరహా ఫలితాలే రిపీట్ అవుతాయని బీజేపీ భావించింది. కానీ కేజ్రీవాల్ ఇక్కడే ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా అనేక అంశాల్లో ఆయనకు సలహా ఇచ్చారు.

అంతేకాదు ఎన్నికల సమయంలో జాతీయవాదం తెరపైకి వచ్చేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలకు పీకే గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం ఢిల్లీలో తమ పార్టీ చేసిన అభివృద్ధిపై మాత్రమే ప్రజలకు వివరించాలని పీకే ఆప్‌కు సూచించారు. దీంతో పాటు ఆప్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేజ్రీవాల్‌కు పీకే అనేక సలహాలు సూచనలు చేశారు. దీని ఫలితంగానే నేడు ఢిల్లీ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకోగలిగింది.

ఇదిలా ఉంటే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణలపై అప్పుడే ట్విట్టర్‌లో విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించకపోవడంతో ఆ పార్టీ ఆప్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయిందని కొందరు నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి అర్వింద్ కేజ్రీవాల్…మరి మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ ఆప్ పదేపదే ప్రశ్నించింది. ట్విట్టర్ వేదికగానూ నిత్యం ఈ విషయంలో సమాధానం చెప్పాలని బీజేపీని ప్రశ్నించింది ఆప్. కేజ్రీవాల్‌కు పోటీగా ఓ బలమైన బీజేపీ నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేకపోవడంతో ఎన్నికలకు ముందే ఆ పార్టీ బలహీనపడిపోయింది.

అలాగే ఎన్నికల ప్రచారాన్ని స్థానిక అంశాల నుంచి జాతీయత వైపునకు మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇది కూడా ఎన్నికల్లో బీజేపీ నష్టపోవడానికి కారణమయ్యిందని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా జాతీయ నేతలు మోదీ, అమిత్ షాల ఇమేజ్‌ తమను గెలిపిస్తుందని భావించారు. వ్యక్తగతంగా బీజేపీ అభ్యర్థులు స్వయం ప్రకాశకులు కాకపోవడం కూడా బీజేపీ పేలవమైన ప్రదర్శనగా కారణంగా విశ్లేషిస్తున్నారు.

 

Leave a Reply