ప్రజావేదికని కూల్చివేయమన్న సీఎం…మండిపడుతున్న టీడీపీ నేతలు

Share Icons:

అమరావతి, 24 జూన్:

ఈరోజు అమరావతిలోని ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఈ ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించారని దుయ్యబట్టారు.

‘మనం కూర్చున్న ఈ బిల్డింగ్ చట్టబద్ధమయినదేనా?  దీన్ని నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్దంగా, అవినీతి సొమ్ముతో కట్టారు. ఓ ఇల్లీగల్ బిల్డింగ్ లో ఇంతమంది అధికారులం ఇల్లీగల్ అని తెలిసీ సమావేశం జరుపుకుంటున్నాం. గరిష్ట వరద వస్తే ఇది మునిగిపోతుంది అని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఈ లేఖను ఇచ్చారు. అందువల్లే అనుమతిని జారీచేయలేమని ఆయన స్పష్టం చేశారు. అయినా టెండర్ అంచనాలను రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచి నిర్మించారు.

ఇందుకోసం ఇద్దరు బిడ్డర్లు రాగా, ఒకరిని ఉద్దేశపూర్వకంగా తప్పించారు. ప్రజావేదిక అన్నది అవినీతితో కట్టిన అక్రమ నిర్మాణం. రేపు పొద్దున ఈ తప్పును మరొకరు చేయకుండా మేం ఆదర్శంగా నిలుస్తాం. అందుకోసం ప్రజావేదికను ఎల్లుండి నుంచి కూలగొడతాం. అక్రమ కట్టడాల తొలగింపును ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం’ అని ప్రకటించారు.

ఇక ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు స్పందించారు. ప్రజావేదిక అన్నది ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనం అని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. అలాంటి ప్రజావేదికను కూల్చేస్తామని ఏపీ సీఎం జగన్ చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజావేదికను కూల్చేస్తామని చెబుతున్న వ్యక్తి అసలు అందులో సమావేశాన్ని ఎందుకు పెట్టాడని ప్రశ్నించారు. ప్రజావేదిక ప్రాంతం గత 50 ఏళ్లలో ఎప్పుడూ ముంపునకు గురికాలేదన్నారు. కరకట్టపై ప్రజావేదికతో పాటు చాలా కట్టడాలు ఉన్నాయనీ, వాటిని కూడా తొలగిస్తారా? అని నిలదీశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు నివాసం, ప్రజావేదిక మధ్య బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటి నుంచి నేరుగా ప్రజావేదిక వద్దకు వచ్చి ఆందోళన చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవేళ టీడీపీ నేతలు ఆందోళనకు దిగితే వారిని అరెస్ట్ చేసి తరలించేందుకు కూడా పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

 

Leave a Reply