తెలుగు పత్రికారంగంలో ఘనాపాఠి  పొత్తూరి 

Share Icons:

తెలుగు పత్రికారంగంలో ఘనాపాఠి  పొత్తూరి 

తెలుగు పత్రికారంగంలో విలువలకు, వ్యక్తిత్వానికి పెద్దపీట వేసి దశాబ్దాలాకాలం ఆ పునాదులమీద తనకంటూ ఒక ప్రత్యేక పాత్రికేయ భవంతిని నిర్మించుకుని, ఆరు దశాబ్దాలకుపైగా అందరి గౌరవం అభిమానం సంపాదించుకున్న దిట్ట శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు. పంచకట్టులో, పొడవు చేతుల తెల్ల చొక్కా పై ఉత్తరీయంతో చిరునవ్వులు చిందిస్తూ అచ్చ తెలుగుతనం మూర్తీభవించే సంస్కృతి, సంప్రదాయం,  నిలువెత్తు విగ్రహం.

పత్రికారంగంలో అనేక పరిణామాలని,  మార్పులని చూశారు. 1957లో ఆంధ్రజనతలో అడుగు పెట్టి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలతో అపార అనుభందం ఉంది. ఈనాడు, ఉదయం, వార్త పత్రికలలోనూ అనుభవజ్ఞులైన వ్యక్తి వీరు. ఆంధ్రప్రభ సంపాదకులుగా ఈయన చాలా కాలం పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు. ఎందరో సాహిత్యకారులకి బాసటగా నిలిచి తెలుగు భాషాభ్యున్నతికి కారకులైయ్యారు. తెలుగు భాషా వికాస ధోరణి ఆయన్ను ఎప్పుడూ వీడలేదు. తెలుగు సర్వతోముఖాభివృద్ధికి నేటికీ ఈయన తన వంతు కృషి చేస్తున్నారు. నూట యాబై యేళ్ళ తెలుగు పత్రికా చరిత్రను ఆకళింపు చేసుకుని నిలువుటద్దంగా ప్రసిద్ధికెక్కారు. నాటి పత్రికా విలువలు ఎరిగి, నేడు విలువలు ఎలా, ఏ కారణాల చేత మారిపోయాయో తెలిసిన వారు. దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు గారితో పొత్తూరిగారికి చక్కని సాన్నిహిత్యం ఉండేది.

మనుషులలో ఉన్న మంచితనం చూడడం వీరి విశేష గుణం. తిరగేసిన ఏ గ్రంధానైనా క్షుణ్ణంగా అర్ధం చేసుకుని, విషయంలో మంచిని, రచయిత విధానాన్ని విశదీకరించగలరు. తెలుగు సాహిత్యం పట్ల పొత్తూరి నిష్ఠ అపారమైనది. నిశితమైన దృక్కు కలిగి ఉన్న వ్యక్తి. యావత్ తెలుగు పత్రికా చరిత్రనెరిగిన మేటి సంపాదకులు పొత్తూరి. ఓ మేటి పాత్రికేయునిలో ఉండవలసిన లక్షణాలన్నీ పొత్తూరిలో చూడ వచ్చు. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ అంశాలలో అపారమైన జ్ఞానం సంతరించుకున్నారు. పొత్తూరి వారిది ఎప్పుడూ ప్రసన్న వదనమే. అనుగ్రహమే కానీ, ఆగ్రహం చూడలేదు ఎవరూ. పాత్రికేయ రంగంలో అందరికీ గురుతుల్యులు. చిన్న-పెద్ద, వారి స్థాయి తేడా లేకుండా అందరితో సౌమ్యంగా మాట్లాడే సహృదయులు.

నాటి పత్రికలు విలువలు పాటించేవని. సంపాదకులు నడిపించేవారని, నేడు యజమానులే నడిపిస్తూ, పత్రికలను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి తాపత్రయ పడుతూ,  రేటింగులకి ప్రాధాన్యం ఇవ్వడం వలన విలువలు క్షీణించాయ కుండ బద్దలుకొట్టినట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారాయన. తెలుగు సాహిత్య జగత్తులో గత అరవై యేళ్ళుగా సాగుతున్న కృషిని, పరిణామాలని వినాలనుకుంటే పొత్తూరి ద్వారా వినవచ్చు. ఆయనది అపారమైన అనుభవం. సాహిత్య ప్రియులందరికీ ఆయన అందుబాటులో వుంటారు. సభలలో తరచు పాల్గొంటారు. అనేక పుస్తకాలకి ముందు మాట వ్రాసారు.  విషయాన్ని చదువరుకలు బోధపడేటట్టు సరళమైన భాషలో చెప్తారు. ఈ నేర్పు, కూర్పు, ఉదార గుణం పొత్తూరి ప్రత్యేకత అని చెప్పవచ్చు.

నేడు పత్రికల్లో చాలా మటుకు విలువలు అంతరిస్తున్నాయని, వ్యయ ప్రయాసలు పెరిగి పొవడం వల్ల పత్రికారంగానికి గడ్డురోజులని ఆయన అభిప్రాయం.  ఓ రచయిత మంచి చదువరి అయి వుండాలని శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి చెప్పిన విషయం పొత్తూరి విషయంలో అక్షర సత్యం. ఈయన గొప్ప చదువరి. చదవడంతో పాటు రచయిత సమ కాలీన స్థితి గతులు, భాషా పదజాల ప్రయోగం, రచాన నడక, దాని ఉనికి, అందులోని నిక్షిప్త సారం ఇలాటి విషయాలన్నీ ఆపోశన పట్టిన వ్యక్తి. ఇవి రచనా కౌశలం పెంపొందిస్తాయి. ఇవి కాక రచయిత ధోరణి, వారి భావాలు, విషయం తెలిపే విధానం, వారికున్న చింతన ఇలాటి విషయాల్ని కూడా ఆకళించుకుంటారు. ఇది సామాన్య విషయమేమి కాదు. దీనికి “సద్ చింతన” ఉండాలి. ఇది పొత్తూరిలో మెండుగా ఉంది. నియమ నిబద్దతలు కలిగిన అనుభవ యోగ్య భాషా పరిజ్ఞానికుడు. వీటికితోడు విభిన్న క్షేత్ర, రంగ విషయాలు తెలసి ఉన్నందువలన రచనలపై మంచి పట్టు సాధించిన వారు పొత్తూరి.  రచనలు వాడుక భాషలో వ్రాస్తే అది ప్రజలకు మరింత చేరువవుతుందని ఈయన నిరూపించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్ పట్టాతో గౌరవించింది.  హైద్రాబాదు, విజయనగర్ కాలనీ, పి ఎస్ నగర్ లో స్థిరపడ్డారు.  అనేక అంశాలపై సాహితీ సభల్లోనూ, ఆకాశవాణిలోను పలు ప్రసంగాలు చేసారు.

పొత్తూరి వ్రాసిన ఆధ్యాత్మిక సంపాదకీయాల సంకలనమే “చింతన”. స్ఫూర్తిగా నిలచిన మహనీయుల మీద వ్రాసిన సంపాదకీయాల సంకలనం  చిరస్మరణీయులు;  తెలుగులో ఏ పత్రికలు ఏయే భావాలతో పుట్టాయో, ఏమి ప్రత్యేకతలు సంతరించుకున్నాయో, మహనీయులు ఎలా శ్రమించారో “నాటి పత్రికల మేటి విలువలు” లో వివరించారు. “తెలుగు పత్రికలు” – తెలుగు పత్రికల చరిత్రకు అద్దం పడుతుంది.  సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ ఇత్యాది అంశాల మీద అనేక సంకలనాలు తన కలం ద్వారా, సంపాదకీయం ద్వారా దాదాపు 160 వ్యాసాలు ప్రజల ముందుకి తీసుకొచ్చారు. ఆదే “వ్యాసప్రభ”. జవహర్‌లాల్ నెహ్రు పంచాయతీ రాజ్ పై ప్రసంగాలను, కులదీప్ నయ్యర్ రచించిన జడ్జ్‌మెంట్ ను తెనుగీకరించారు.

ఫొత్తూరి టి టి డి ప్రచురణలకు సంపాదకుడిగా ఉన్నారు. ఈయనకి చాలా కాలం బ్రిటీష్ లైబ్రరి సభ్యత్వం ఉండేది. కొన్ని దశాబ్దాల తెలుగు పత్రికలను డిజిటల్ (ఎలక్ట్రానిక్) రూపంలోకి మళ్ళించి అంతర్జాలం (ఇంటర్ నెట్) మీద అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ పథకం అవిష్కరించారు ఆయన. ఇలాటి అనుభవ పూర్ణ తెలుగు భాషా విశారధుల ఆవశ్యకత నేడు ఎంతైనా వుంది. పొత్తూరి వెంకటేశ్వరరావు (86) ఫిబ్రవరి 8, 1934 లో గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. తండ్రి: వెంకట సుబ్బయ్య,  తల్లి: పన్నగేంద్రమ్మ.  తెలుగు పత్రికారంగంలో ప్రముఖులుగా విరాజిల్లిన ఆ మూర్తి కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2020 మార్చ్ అయిదో తేదీ ఉదయం పరమపదించారు. ఆ చిరునగవుల వదనం చిన్నబోయింది. కలం ఆగిపోయింది. అంత పెద్ద వారికి సమకాలికునిగా రంగంలో ఉండడం అదృష్టం. గర్వ కారణం.

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply