సానుకూల దృక్పథమే ఆరోగ్యం

Share Icons:

సానుకూల దృక్పథమే ఆరోగ్యం

ఆరోగ్యం, ఆనందం, శాంతి సౌఖ్యాలకు సానుకూల దృక్పథమే  సరైన ఔషధం. ఈ భావన వేదకాలం నుంచి ప్రాచుర్యంలో వున్నది. నరకంలో స్వర్గాన్ని, స్వర్గంలో నరకాన్ని సృష్టించగల శక్తి మన ఆలోచనలకు వుంది. అనేక సమస్యలు, రుగ్మతల నుంచి బయటపడటానికి మంచి ఆలోచనలు తోడ్పడతాయని అనేక పరిశొధనలు నిరూపించాయి. ఆలోచనలను సానుకూలంగా మార్చుకుని, సర్దుబాటు తత్వాన్ని అలవర్చుకుంటే జీవితం సుఖమయమవుతుంది. పాలను తోడుచుక్క పెరుగులా మార్చినట్లు అనుకూల ఆలోచనలు తోడు నీడగా బంధాలు అనుబంధాలను గట్టిపరుస్తాయి. అదే పాలలో ఉప్పురాయి పడితే విరిగిపోయినట్టే ప్రతికూల భావాలు జీవితాలను బాధామయం చేస్తాయి. సమయం, సందర్భం, ప్రాదేశిక, శీతోష్ణస్థితిగతులకు అనుగుణంగా తమను తాము మలచుకున్న జీవులే మనుగడ సాగిస్తాయని డార్విన్ పరిణామ సిద్ధాంతంలో పేర్కొన్నారు. అందుకే మన మనుగడను సాఫీగా సాగించడానికి, బ్రతుకును బాగుపర్చుకోడానికి మనల్ని మనం మలచుకోవాలి.

సానుకూల ఆలోచనలను అలవర్చుకోవాలి. సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాలను పెంపొందించుకోవాలి. గత అనుభవాల ప్రతిరూపాలలో మార్పు తెచ్చి భవిష్యత్తులో ఉపయోగపడేలా చేసుకోవాలి. ఇందుకు అంతర్గత మానసిక స్థితికి తోడ్పడే సృజనాత్మకను ఆవిష్కరించుకోవాలి. సహనాన్ని, సహజీవనాన్ని అలవర్చుకోవాలి. సత్యనిష్ఠలో శక్తి నిబిడీకృతమై వుంటుందన్న నిజాన్ని గుర్తించాలి. వాస్తవికతను అలవర్చుకోవాలి. మనసులో అనుకున్నదే మాట్లాడగలగాలి. ప్రకృతితో స్నేహం చేయాలి. సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం, ఆహ్లాదం, ఆనందం, చమత్కారం, దరహాసం తదితర మానసిక స్థితులను అంటిపెట్టుకోవాలి. బేషజాలు, తారతమ్యాలు, అహంభావం, అధికులమనే భావన విడనాడి కలసి జీవించడం నేర్చుకోవాలి. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అసంతృప్తి, అసహనం, విసుగుదలను విడనాడాలి.

అభివృద్ధికి అడ్డుగా నిలిచే ఆత్మన్యూనత, మూఢ నమ్మకాలు, సెంటిమెంట్లను దరిచేరనీయకూడదు. దుష్టాలోచనలు, దుర్మార్గ చర్యలు, దుర్వర్తనలకు దూరంగా వుండాలి. సన్మార్గం, అనురాగం, క్షమ, దయ, జాలి, కరుణ, ఆప్యాయతలకు స్థానమివ్వాలి. చేసే పనిపట్ల ఇష్టం, వృత్తిలో నిబద్ధత, ఆత్మ సంతృప్తి, సమయపాలన, మంచి వ్యక్తిత్వం సొంతం చేసుకోవాలి. అనవసర వాదనలు మనుషులను దూరం చేస్తే, పరస్పర చర్చలు సఖ్యతను చేకూరుస్తాయని గుర్తించాలి. సజ్జన సాంగత్యం, ఉత్తమ సాహిత్యం, స్వాధ్యాయం, స్నేహతత్వం లాంటి అంశాలు పాజిటివ్ థింకింగ్‌కు తోడ్పడుతాయి. నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలకు, శరీరాన్ని పట్టి పీడించే రుగ్మతలకు ప్రతికూల ఆలోచనలు, ఉద్వేగ లోపాలే కారణం. మానసిక అశాంతి, చిత్తచాపల్యం, అరాచక ప్రవర్తన మనుషులను మనసులను రోగగ్రస్తం చేస్తాయి. ఉత్తమ ప్రవర్తన, సానుకూల దృక్పథం వ్యక్తులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ వాస్తవాన్ని ప్రతివారు గుర్తించి నియమబద్ధ జీవన శైలిని అలవర్చుకోవాలి.

-నందిరాజు రాధాకృష్ణ

 

Leave a Reply