పదవికోసం గోడదూకే గోపికలు

Share Icons:

పాలిటిక్స్ లో నీతి నియామాలు ఉండవనే నానుడిని ఇటీవల చాలా సంఘటనలు రుజువుచేస్తున్నాయి. మంచి తనం కలిగిన నాయకులు గానీ, నిజాయితీ కలిగిన నాయకులగురించి వాకబు చేయడానికి ప్రయత్నిస్తే… అంతా పాత చింతకాయ పచ్చడి, ఆ కాలం ఇపుడు లేదు అనే మాట వినిపిస్తోంది. రాజకీయాలు అంటే ఏ విలువలవలువలూలేని వ్యక్తుల నర్తనగా మారిపోయింది కాలం.

గత దశాబ్ధంలో తెలుగునాట రాజక్రీయ క్రీడ మరీ దిగజారిపోతోంది. అసలు నైతిక సూత్రాలు, విలువలు, నిబద్దత, నీతి సూత్రాలు అన్నవిగానీ, పారదర్శకత గానీ లేకుండా పోతోంది. పదవిలో ఉండడం, కుదరకపోతే పాలక పక్షంలో కీలక వ్యక్తిగా గుర్తింపు కోసం రాజకీయ నాయకులు చేస్తున్న విన్యాసాలు ప్రజాస్వామ్య వాదులకు విసుగు పుట్టిస్తున్నాయి. అయ్యో స్వతంత్ర్య భారతమా ఎటు నీ ప్రయాణం అనే భావనతో మనసు రోధించే పరిస్థితి ఉంది.

[pinpoll id=”60907″]

 

అటు తెలంగాణాలో, ఇటు ఏపీలో ఒక పార్టీ గుర్తుపై, బీఫాం పై పోటీచేసి, గెలిచి, అకస్మాత్తుగా, పాలక పక్షంలోకి జంప్ చేస్తున్నవారు పెరిగిపోతున్నారు. ఇది పూర్తిగా అనైతిక చర్య. అన్ని విలువలకూ విరుద్ధమైనది. మరి పార్టీలు, నేతలు, ప్రజలు దీనికి అంగీకరిస్తున్నారు. మేధావులు అక్కడక్కడా  స్వల్పంగా అసంతృప్తి వ్యక్తం చేసినా, అది నిరసనగా చిగురువేయడం లేదు.

ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్షం వైఎస్ ఆర్ పార్టీ టికెట్ పై గెలిచి ఇపుడు తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టి మంత్రులైనవారు ఉన్నారు. వారు చదువుకున్నవారు, యువత కూడా కావడం ఆశ్చర్యకరం, కొత్తరక్తంలో నిజాయితీ ఉంటుందనుకుంటే, కోవర్టులుగా పనిచేసి, ఎన్నికల్లో గెలిచి, పార్టీఫిరాయించేవారిని ఏ మనాలి. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా దీనిని ఆమోదిస్తున్నారా, లేక పోతే ఎందుకు ఆగ్రహజ్వాలలు ఎగయడం లేదు. లేకపోతే ప్రజాగ్రహాన్ని పెట్టుబడీ దారి పుత్రికలైన పత్రికలు పట్టించుకోవడంలేదా. వాస్తవం మీడియా తొక్కిపెడుతోందా. ఇదే నిజమైతే ప్రజాస్వామ్యాన్నికి పత్రికలు పట్టుగొమ్మలు కాదు కదా, మీడియానే  గొడ్డలిపెట్టుగా మారడం ఖాయం. దీనిపై చట్ట సవరణకు చర్యలు తీసుకోవాలి. అలా ఒక పార్టీ టికెట్ పై గెలిచే మరో పార్టీలో చేరేవారిని, వారి రక్త సంబంధీకులను శాస్వతంగా రాజకీయ పదవులకు అనర్హులుగా ప్రకటించాలి.

నిన్న ఆదివారం కొత్త ఢిలీలో ఉప రాష్ట్రపతి చేసిన ఈ వాఖ్యలు చూడండి….

“ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరేవారు ముందుగా రాజీనామా చేసి పార్టీ వీడాలి. లేదంటే అలాంటి వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కిందమూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి. ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఇంకో పార్టీలో మంత్రులవ్వడం ఏంటి?  ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.”  మరిపుడు ఉపరాష్ట్రపతి స్వయంగా రాజ్యాంగ విరుద్దమని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వేరే పార్టీ మంత్రులు కనీసం ఇప్పటికన్నా చేసిన పనికి సిగ్గుపడి వెంటనే పదవులకు రాజీనామాచేయాలి. ఎన్నికలకు ఎటూ పెద్దగా సమయం లేదు కనుక వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేసి విజయం సాధించాలి. మొత్తం మీద ఉపరాష్ట్రపతి తేనె తెట్టు కదిలించారు. ఎందుకంటే ఆయన ఈ వాక్యలు చేసే సమయానికి అక్కడ కర్నాటకలో పదవీఊయల ఊగడానికి  25 మంది శాసన సభ్యులు కాంగ్రెస్ నుంచి బిజేపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  వీరంతా ఊరకే ప్రజాసేవకోసం పార్టీ మారనున్నారనుకోవడం అమాయకత్వం. వీరు తమ శాసనసభ్యత్వానికి రాజీనామాలు సమర్పించిన తరువాతే బిజేపీ వారిని పార్టీలోకి తీసుకోవాలి.. అలా జరుగుతుందనుకోవడం కూడా ఇంకా పెద్ద అమాయకత్వమే అవుతుంది కదూ. ఇంతకూ మీరేమంటారు.

మామాట:  అవునూ ఇపుడు సిగ్గుపడే రాజకీయులున్నారంటారా..

Leave a Reply