ఓడ మల్లన్న. బోడి మల్లన్న.. 

Share Icons:

ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటిన తరువాత బోడి మల్లన్న. ఈ ధోరణి సాధారణ జీవితంలోనే కాదు; ఈమధ్య రాజకీయ, పత్రికా రంగాలలో ఎక్కువైంది. రాజకీయాలలో జన్మనిచ్చి, గుర్తింపు ఇచ్చి, పదవులు కట్టబెట్టి సంపద పెంచిన తల్లిపార్టీని కాలదన్ని స్వార్ధం, అర్థం కోసం రంగులు మార్చడం రాజకీయలలో అలవాటే. అయితే సమాజంలో విలువలు దిగజారి పోతున్నాయని కన్నీళ్ళ పర్యంతమయ్యే పాత్రికేయులు గోడలు దూకడం, గెంతులేయడాన్ని ఏమనాలో? దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట ఈ వ్యాధి పత్రికా రంగంలో ప్రవేశించి. రాజకీయలకంటే వేగంగా క్యాన్సర్లా వ్యాప్తి చెందింది.

గతంలో ఖాసా, ఎంసి, ముట్నూరి, భోగరాజు, న్యాపతి, కొమర్రాజు, గాడిచెర్ల, కాశీనాథుని, సురవరం, కోటంరాజు, ప్రకాశం పంతులు, మద్దూరి, చింతామణి, ఎన్‌జి రంగా, నార్ల, నండూరి, పురాణం, నీలంరాజు, పండితారాధ్యుల, విశ్వం, గోరాశాస్త్రి, శివలెంక వంటి ఉద్దండులెందరో ఎడిటర్ మహాశయులుగా వృత్తిబాధ్యతలు నిర్వర్తించారు. రాఘవాచారి, బొమ్మారెడ్డి, పొత్తూరి, వాసుదేవ దీక్షితులు ఎడిటర్లుగా వ్యవహరించారు. వీరిలో పలువురు దేనికోసమో పత్రికలు మారలేదు. చివరి వరకు ఆ పత్రికలకే అంకితమయ్యారు. రాను రాను వ్యాపార ధోరణి పత్రికల్లోనే కాకుండా పాత్రికేయుల్లోకి చొచ్చుకురావడంతో గ్రూపులు, డబ్బు, వర్గాలు, పార్టీలు, కులాలు, చివరకు ప్రాంతాలు, ప్రయోజనాలు ఇక్కడ ప్రభావితం చేశాయి. దాంతో పత్రికలు పాత్రికేయులు విశ్వసనీయత కోల్పోవలసి వచ్చింది. 1980 తరువాత ఈ గోడదూకుడు ఎక్కువైంది.

పత్రికలు ఇబ్బడిముబ్బడిగా రావడం తరువాత, తరువాత.. చానళ్ళు రంగంలో దిగడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. పూర్వం ఒక వ్యక్తి ఎడిటర్ స్థాయికి ఎదగాలంటే దశాబ్దాలు పట్టేది. ఇప్పుడలా కాదు. పట్టు పరిశ్రమకే పెద్దపీట. యజమాని ప్రయోజం భుజాన వేసుకుని, తన లాభం చూసుకునే ‘సంపాదకు’లు మొదలయ్యారు. తనకు అవకాశమిచ్చిన పెద్దలకు మంగళంపాడి,  వెంట వచ్చిన సిబ్బందిని ఏటిలో ముంచిన పెద్దలూ ఉన్నారు. తమ జీతాలు మాట్లాడుకుని సిబ్బందికి రిక్తహస్తాలు చూపిన గొప్పవాళ్ళూ లేకపోలేదు. అభ్యుదయ భావ మేధావులుగా చెప్పుకుని. కాపిటలిస్టు వ్యక్తులవద్ద లక్షల రూపాయలు ఉద్యోగమనే సేవకు దిగినవారికీ మనకు కొదవలేదు. జాతీయ స్థాయి పత్రికలను వీధి స్థాయికి దిగజార్చిన అఖండులూ ఉన్నారు.

 నావకు కెప్టెన్ గా ఉద్యోగంలోచేరిన వ్యక్తి (ఎడిటర్) నెలల్లో సంపాదక మహాశయుడిగా ఎదిగి, సంపాదన ధ్యేయంగా కాళ్ళు కదిపే వ్యక్తులు పబ్బం గడుపుకుని బయట పడి కొత్త యాజమాన్యాన్ని వెదుక్కోవడం కొత్త ఆచార మైంది. మళ్ళీ కొన్నేళ్ళకు కథ మొదటికొచ్చి,. మరో గడప నెక్క ఎక్కడం పరిపాటి అయింది. అంతటితో ఆగక తాము బయటకు వచ్చిన సంస్థను ద్వేషించడం, తూర్పారబట్టడం ఫాషనయికూర్చుంది. గతంలో పెద్దలు అనేకులు పత్రికలు మారారు కాని దిగజారి ఆ పత్రికల యాజమన్యుల పైకి యుద్ధానికి సిధ్ధమయ్యే దిగజారుడు తనమ కానరాలేదు.

ఒక సంస్థలో పని చేస్తూ ప్రత్యర్ధి సంస్థలకు పత్తేదార్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తులూ ఉన్నారు. ఏకారణంచేత సoస్థకు రాజీనామాచేసినా, ఒక్క పొల్లు మాట మాట్లాడకుండా విలువలు కాపాడుకుంటూ బతుకుతున్న గౌరవప్రదులూ ఉన్నారు. అలాగే ఏరు దాటగానే వీధులకెక్కి సంస్థను, యజమానినీ నీచంగా చిత్రీకరించే ఉద్యోగులూ కనబడతారు. అనుభవం, పైబడిన వయసును కాదని వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు దిగుతూ అప్పటి వరకు బధ్ధ వైరులుగా ప్రకటించుకుని దుమ్మెత్తిపోసిఉన వ్యక్తుల ఆశ్రయంలో చేరిన వారు అసంఖ్యాకం. సంస్థలో ఎడిటొరియల్ సిబ్బందిని తమ పనులకు వినియోగించుకుని అవసరం తీరగానే ఏరిపారేసిన ఘనులూ కోకొల్లలు. కేసులనుండీ బయటపడిన పెద్దలూ లెక్కకుమించే ఉన్నారు. ఇక చిన్నపాటి ఉద్యోగులు రాత్రికి రాత్రే రంగులు మార్చుకుని హంగులు అనుభవిస్తున్న వారి గురించి చెప్పుకోనక్కరలేదు.

ఇక తెలుగు చానళ్ళ విస్తృతితో సర్వం అథః పాతాళానికే.. చానళ్లది నేరుగా బ్లాక్ మెయిలింగ్ ప్రక్రియే…. చెప్పుకోవడం వృధాప్రయాసే!!

-నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply