ఇవాళ్టిది కాదు. ఆరేళ్ళ కిందటి చెక్కు చెదరని అభిప్రాయం. 

Share Icons:

ఇవాళ్టిది కాదు. ఆరేళ్ళ కిందటి చెక్కు చెదరని అభిప్రాయం.      ………………………… కాకా శకం అలా ముగిసిపోయింది..

నేనెరిగిన వెంకటస్వామి కాంగ్రెస్ లో చాలా సీనియర్,, ఇందిర కుటుంబానికి చాలా దగ్గర. ప్రత్యేక తెలంగాణ వాది. 1969 ఉద్యమంలో తుపాకి గుళ్ళు ఎదుర్కొన్నాడు. తెలంగాన ప్రజా సమితిని చెన్నారెడ్డి కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించినా నిస్సహాయుడై మిగిలారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైనా వైఎస్సార్ ప్రభావంతో చివరకు సోనియా నిరాదరణకు గురయ్యాడు. 2003 లో ఎ ఐ సి సి ప్రకటించిన తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టి.ఆర్.సి.సి.సి.) 35 మంది సభ్యుల్లో ఈయన సీనియర్ సభ్యుడు. ప్రత్యేక తెలంగాణ అంశంలో వి హనుమంతరావు, ఎస్ జైపాల్ రెడ్డి, ఎం ఎస్ ఆర్, డి శ్రీనివాస్, సి జగన్నాధరావు, పి నర్సారెడ్డి, ప్ జనార్దనరెడ్డి, బి సరోజినీ పుల్లారెడ్డి ఒకే మాటపై నిలిచారు.

పాల్వాయి గోవర్ధన రెడ్డి, జి చిన్నారెడ్డి, షబ్బిర్ అలీ,  పొన్నాల, ముఖేష్, గీతారెడ్డి, జానారెడ్డి, జె రత్నాకర్ రావు, టి నిరంజన్ రెడ్డి, ఎ ఇంద్రకరన్ రెడ్డి, పులి వీరన్న, పి సుధాకర్ రావు, పి శంకర రావు, ఎస్ గంగారాం, బస్వరాజు సారయ్య, ఆమోస్, నంది యెల్లాయ్య, ఆర్ సురేందర్ రెడ్డి,  ఎం కోదండరెడ్డి, పి కిస్టారెడ్డి, యూసఫ్ ఖురేషి, సుల్తాన్ అహ్మద్, డి కె అరుణ.. ఈ యన నాయకత్వంలో నడిచారు. 2004 ఎన్నికలముందు కాంగ్రెస్, టి ఆర్ ఎస్ పొత్తు విషయంలో కాకా కీలక పాత్ర నిర్వహించారు.  వైఎస్సార్ నాయకత్వంలో 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రిపదవుల కోసం టి ఆర్ సి సి సి సభ్యులు ఆశపడి మందగించి తెలంగాణ ఊసెత్తడం మానేశారు.

 వెంకటస్వామి కుమారుడు వినోద్ కు మంత్రివర్గంలో స్థానం లభించడంతో తెలంగాణ ఆచూకీ లేకుండా తయారైంది. డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు కావడం తో వాదన చప్ప పడింది..అయినా వైఎస్సార్ వ్యతిరేకులు విహెచ్, మధు యాష్కి, పిజేఅర్, నర్సారెడ్డి, పాల్వాయి గొంతెత్తునే ఉన్నారు. వీరికి కాకా అండదందలు లభించేవి. రాను రాను 2009 ఎన్నికల ముందు టీఅరెస్ అధినేత చంద్రశేఖరావు స్పీడుకు దడిసి వైఎస్సార్ వ్యతిరేక కాంగ్రెస్ నేతలు ఒక వర్గంగా ఏర్పడ్డారు.

1977 నుంచి 2009 వరకు 7 పర్యాయాలు లోక్ సభకు ఎన్నిక 2004 వరకు కేంద్రంలో అనేక మంత్రి పదవులు చేపట్టారు. ఇందిర, రాజీవ్, సోనియాకు సన్నిహితుడుగా మెదిలారు. 2004 ఎన్నికల తరువాత వైఎస్సార్ ప్రభావంతో కేంద్రంలో మంత్రిపదవికి దూరమయ్యారు. 2009 ముందు వైఎస్సార్ను వ్యతిరేకించిన కారనం గా ఆయనకు టిక్కెట్ లభించలేదు. మరో కుమారుడు వివేక్ పార్లమెంటుకు గెలవడంతో మౌనం దాల్చారు. అయితే 2009 ముందు రెండేళ్ళు తెలంగాణ నేతలకు దిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరించి వైఎస్సార్ కు వ్యతిరేకి అయ్యారు.

మధు యాష్కి, సర్వే సత్యనారాయణ, విహెచ్, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, ఎం ఎస్ ఆర్, ఆమోస్, పాల్వాయి, ఇంద్రసేనరెడ్డి, యాదవ్ రెడ్డి, కమలాకర రావు, నంది యెల్లయ్య, మాణిక్ రావు, శ్రీధర్ రెడ్డి, నర్సారెడ్డి వీరందరినీ తరచు సమావేశపరచి తెలంగాణ గళం పెంచసాగారు.  పిజేఅర్-మర్రి శశిధర్ రెడ్డి కూడా పరోక్షంగా కాకాను సమర్ధించి వైఎస్ ను ఢీకొన్నారు. సోనియా నుంచి గవర్నరు పదవి హామీ లభించినా అంగీకరించక .. సీనియర్ మోస్ట్ నేతగా రాష్ట్రపతి పదవి ఆశించారు. కనీసం ఉపరాష్ట్రపతి దక్కుతుందని భావించారు. కేంద్రంలో వై ఎస్సార్ పలుకుబడి వల్ల తనకు పదవి దక్కలేదని, తెలంగాణకు కేంద్రం వ్యతిరేకంగా ఉందని ఆరోపించేవారు.

తెలంగాణ సీనియర్లకు వ్యతిరేకంగా వై ఎస్సార్ అభివృద్ధి తెలంగాణ వాదుల పేరిట మల్లు భట్టి విక్రమార్క, కనుకుల జనార్దన రెడ్డి, రాజలింగం గౌడ్, రసూల్ఖాన్,  రాజేశ్వరరావు, పద్మావతి, ఎం.ఏ.ఖాన్, బొమ్మా  శ్రీరామచంద్రమూర్తి, ఆర్. రవీందర్,  జి సూర్యప్రకాశ్, గండ్ర వెంకట రమణా రెడ్డి, సురేష్ షేట్కర్ లను సీనియర్లపై ఉసి గొల్పి తమకు ప్రత్యేక తెలంగాణకంటే , తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి ముఖ్యమని వెంకటస్వామి వర్గానికి వ్యతిరేకంగా దిల్లీ నాయకత్వం వద్దకు ప్రతినిధులను పంపేవారు.

కొన్ని సమయాల్లో సీనియర్లకు వారం పాటు సోనియాను కలిసే అనుమతికూడా లభించకుండా వై ఎస్ ఆర్ అడ్డుకున్నారే వారన్నది అందరికీ తెలిసిన విషయమే.. ప్రానహిత-చేవెళ్ళ విషయంలో కూడా వెంకటస్వామిని వైఎస్సార్ దూరంగాఉంచగలిగారన్న అసంతృప్తి తెలంగాణవాదులలో బలంగా నాటుకు పోయింది. నగరంలో స్థలాలు-అస్థుల విషయంలో కాకా కుటుమసభ్యులకు ప్రభుత్వం నుంచే వేధింపులు కూడా మొదలయ్యాయి. అనేక పర్యాయాలు తెలంగాణ సీనియర్లు వెంకటస్వామి కుమారుడు వివేక్ నివాసంలో సమావేశాలు నిర్వహించేవారు. ఒక సమ్మవేశం చివరి దశలో అకస్మాత్తుగా వై ఎస్ వచ్చి నాటకీయంగా సమావేశానికి ముగింపు పలికి భోజనం చేసి వెళ్ళారుకూడా..

తెలంగాణ సీనియర్లెవ్వరూ వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టడంలో ఆనాటి ముఖ్యమంత్రి కృతకృత్యులయ్యారు.. తెలంగాణ పై సి డబ్ల్యు సి లో అనేక పర్యాయాలు వెంకటస్వామి బలంగా గళం వినిపించి అధిష్టానాన్ని కూడా ధిక్కరించారు.  తెలంగాణ కల సాకల్యం అవుతుందని, తాను ప్రత్యేక తెలంగాణలోనే కన్నుమూస్తానని పదే పదే చెప్పుకున్న వెంకటస్వామి చివరికోరిక అలా నెరవేరింది. విలేఖరుల సమావేశాలు ముగిసిన తరువాత అందరినీ పంపివేసి..సీనియర్ పాత్రికేయులతో తన అనుభవాలను, ఆవేదనను వినిపించేవారు. సోనియాను సైతం పలువురు నాయకులు తప్పు దోవ పట్టిస్తున్నారని, అలా అయితే కాంగ్రెస్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు కూడా!!

(కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల విలేఖరిగా సుదీర్ఘ అనుభవంలో తారసపడిన ఒక ఘట్టం..)

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply