జనసేన కార్యకర్తలపై కేసు: ఫైర్ అయిన పవన్

janasena president pawan kalyan comments on jagan and ysrcp
Share Icons:

గుంటూరు: ఇటీవల గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో తిరునాళ్ళు సందర్భంగా ఆ గ్రామస్తులు ఓ నాటిక ప్రదర్శించారు. ఈ నాటిక ప్రదర్శన సందర్భంగా కొందరు జనసేన జెండాలు ప్రదర్శించారు. దీంతో అక్కడున్న పోలీసులు నాటికని ఆపేసి జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. పోలీసులతో గ్రామస్తులకు వాగ్వివాదం జరగడంతో, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పోలీసుల వాహనంఫై గ్రామస్తులు రాళ్లు రువ్వారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

‘ఓ పోలీసు ఉద్యోగి అనాలోచిత, విచక్షణారహిత, పక్షపాత వ్యవహార శైలివల్ల నేడు ధర్మవరం గ్రామం అశాంతితో అల్లాడిపోతోంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఉన్న ఈ గ్రామంలో చాలా మంది పురుషులు పోలీసుల భయం కారణంగా గ్రామం వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని పవన్ తెలిపారు.

అలాగే ‘శాంతి, భద్రతలు కాపాడాల్సిన పోలీసులే అశాంతికి కారణమైతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? గ్రామంలో ఏటా జరిగే తిరునాళ్లలో ఆనందంగా నాటికను ప్రదర్శించడమే పాపమా? ఆ నాటికలో జనసేన జెండాలు ప్రదర్శించడమే నేరమా?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘నాటికను మధ్యలో బలవంతంగా ఆపేసే అధికారం ఆ పోలీసు ఉద్యోగికి ఎవరు ఇచ్చారు? ఈ నాటిక ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది పోలీసులే.. దీనిని ప్రశ్నించిన మహిళను నెట్టివేయమని ఏ చట్టం చెబుతోంది? లాఠీలతో కొట్టడానికి ఆ అధికారికి ఎవరు అనుమతి ఇచ్చారు?’ అని పవన్ నిలదీశారు.

‘అక్రమంగా అరెస్టు చేసిన జనసేన కార్యకర్తలను విడుదల చేయాలి. మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలి. ఎవరెలా రెచ్చగొట్టినప్పటికీ మేము శాంతియుతంగా సమాధానం చెబుతాం. ఇటువంటి సమయంలో జనసైనికులు సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను’ అని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు పలువురు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని అన్నారు.

ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పడం లేదని… కానీ, తెలుగును మాతృ భాషగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మాతృ భాషను, మన మాండలికాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అన్నారు. ‘జగన్ రెడ్డి గారు, ‘మా తెలుగు తల్లికి’ అంటూ పాడాల్సిన మీరు… తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

Leave a Reply