మీరు చేస్తున్న‌ది ఏమిటి మ‌హాశ‌యా!

Share Icons:

మీరు చేస్తున్న‌ది ఏమిటి మ‌హాశ‌యా!

కాంగ్రెస్ పార్టీ చేసిన త‌ప్పిదాల వ‌ల్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి విభ‌జ‌న క‌ష్టాలు వ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చెప్పిన విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.

పార్ల‌మెంటు తలుపులు మూసి మ‌రీ బ‌ల‌వంతంగా రాష్ట్రాన్ని విభ‌జించార‌ని కూడా ఆయ‌న శెల‌విచ్చారు. అదీ క‌రెక్టే.

అందులోనూ ఎలాంటి సందేహం లేదు. మ‌రి అయితే ఇది జ‌రిగి నాలుగేళ్లు దాటింది. నాలుగేళ్లుగా ప్ర‌ధానిగా ఉన్న‌ది మోడీ మ‌హాశ‌యులే!

కాంగ్రెస్ పార్టీ చేసిన త‌ప్పిదాల‌ను స‌రిదిద్దేందుకు నాలుగేళ్లు స‌రిపోలేదా? ఒక్క రోజులో రాష్ట్రాన్ని విడదీశార‌ని కోపంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు నామ‌రూపాలు లేకుండా చేసేశారు.

మ‌రో 20 ఏళ్ల వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మ‌ర్చిపోవ‌డ‌మే త‌ప్ప ఏం చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొని ఉంది. మ‌రి ఐదేళ్ల హ‌యాంలో మోడీ కూడా అదే చేస్తే అలాంటి తీర్ప‌నే ప్ర‌జ‌లు చెబుతారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాకేం లేదు క‌దా మాకు పోయేది ఏముంది అంటే మ‌నం ఏం చెప్ప‌లేం కానీ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ఉంద‌నే విష‌యం మాత్రం ప్ర‌ధాన మంత్రి గుర్తు పెట్టుకోవాలి.

వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ విభజించిన తీరు వల్లే ఇన్నేళ్లయినా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు.

అయితే నాలుగేళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం చేసింది శూన్య‌మ‌నే విష‌యాన్ని ఆయ‌న మ‌ర‌చిపోయారు.

‘ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మేం మద్దతు పలికాం. వాజ్‌పేయి ప్రభుత్వం దీర్ఘదృష్టి కారణంగా మూడు రాష్ట్రాలు విభజించినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. ఎవరి వాటాలు ఆయా రాష్ట్రాలకు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అలా జరగలేదు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు.

నామమాత్రం ప్రతిపక్షం, ప్రసార మాధ్యమాలపై నియంత్రణతో కాంగ్రెస్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. తమ నిర్వాకాలు బయటకు రాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారీతిగా వ్యవహరించింది. అంటూ మోడీ లోక్‌స‌భ‌లో తాజాగా చేసిన ప్ర‌సంగం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను శాంతింప‌చేయ‌లేదు.

ఎందుకంటే ఇలాంటి మాట‌లు వింటూ నాలుగేళ్లు గ‌డిపేశారు. ఇక ఉపేక్షించి లాభం లేద‌నే ఉద్దేశ్యంలోనే వారు ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది.

అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా ఈ అంశంపై తాడో పేడో తేల్చుకోవ‌డానికే సిద్ధంగా ఉన్న‌ట్లు కూడా క‌నిపిస్తున్న‌ది.

రాజ‌కీయాలు శాశ్వ‌తం కాదు. రాష్ట్రాలో శాశ్వ‌తం. ఈ విష‌యాన్ని బిజెపితో స‌హా అన్ని పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలి.

 

English Summary: Prime Minister Narendra Modi today criticized Congress party for bifurcation of United Andhra Pradesh.

Leave a Reply