రాహుల్ ఓడినంత మాత్రాన ప్రజస్వామ్యం ఓడినట్లు కాదు: మోడీ

Share Icons:

ఢిల్లీ, 26 జూన్:

రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో భాగంగా ప్రధాని మోడీ, కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. కొందరు విపక్షనేతలు ఇటీవల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. తమ ఓటమికి ఓటర్లను నిందిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని హితవు పలికారు.

అయితే అహంకారానికీ ఓ హద్దుంటుందని, ఓటర్లను తక్కువచేసి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దేశప్రజలు ఓడిపోయినట్టుగా ప్రచారం జరుగుతోందని, రాహుల్ ఓడినంత మాత్రాన ప్రజాస్వామ్యం ఓడినట్టు కాదని మోదీ స్పష్టం చేశారు.

ఇక ఈరోజు తెలంగాణ పర్యటనకి వచ్చిన బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లని సీఎంను ఇంతవరకూ తానెప్పుడూ చూడలేదని అన్నారు.

ఒక్క కేంద్ర పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారని, ఇక్కడ తమ పార్టీ వేగంగా పుంజుకుంటోందని అన్నారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ లో మంచి ఫలితాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.

ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కశ్మీర్ లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయబోతున్నామని అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని, జులై 6న బీజేపీ సభ్యత్వ నమోదును మోదీ ప్రారంభించనున్నట్టు చెప్పారు.

 

Leave a Reply