ఆధ్యాత్మిక జీవనం

Share Icons:

ఆధ్యాత్మిక జీవనం

ఆత్మతో ఆత్మీయంగా ఉండగలగటమే ఆధ్యాత్మికం. ఆత్మ ఒక్కటే సత్యం, తక్కినవన్నీ అసత్యం- అనే బలమైన భావన మనలో ఉంటే, ఎలాంటి బలహీనతలూ మనల్ని దరి చేరలేవు.ఆధ్యాత్మిక జీవనం ఎలా సాగించాలి అనే విషయం చాలా మందిని తికమకలోకి నెడుతుంది. దైవ సంబంధ కార్యాలన్నీ ఆధ్యాత్మికం కాదు. దేహ సంబంధ సౌఖ్యాలేవీ స్థిరమూ శాశ్వతమూ కావు. ఈ రెండు విషయాలనూ మనం మరిచిపోకూడదు.మన ప్రతి చర్యలో ఉదాత్తత ఉండాలి.మన ప్రతి మాటలో ప్రేమ, ఆత్మీయత తొణికిసలాడుతూ ఉండాలి. ‘అందరూ నావారే. నేను అందరి వాడను’ అనే మాటను పదేపదే అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఎవరి పట్లా మనకు అసూయ కలగదు, ద్వేషం ఏర్పడదు.మన మనోమందిరాన్ని ఎప్పటికప్పుడు సద్భావనలతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
దైవనామ స్మరణతో పవిత్రం చేసుకోవాలి.పెదవులతో నామస్మరణ చేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. రామనామస్మరణ చేయదలిస్తే ఆంజనేయుడిలా అంకితభావనతో చెయ్యాలి. నారాయణ స్మరణ చేయాలనుకుంటే ప్రహ్లాదుడిలా పరవశంతో చెయ్యాలి. అలా చెయ్యాలంటే ‘అంతా రామమయం- జగమంతా రామమయం’ అనే స్పృహతో సర్వం దైవసమానంగా భావించగల స్థితికి ఒక్కో మెట్టూ ఎక్కుతూ చేరుకోవాలి. శిఖరం ఎక్కాక కిందికి చూస్తే అంతా సమానమే! ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి చేరుకున్నాక జాతి, కుల, మత విచక్షణలన్నీ నశించిపోతాయి. ఆత్మ మహాత్మగా మారిపోతుంది. ఇంకా పరిణతి చెందితే దివ్యాత్మ అవుతుంది.అలాంటి స్థితిలో ఎటు చూసినా దివ్యానందమే కలుగుతుంది. పందిలో వరాహావతారాన్ని, చేపలో మత్స్యావతారాన్ని భక్తుడు వూహించుకొంటాడు. అన్నింటినీ దైవరూపాలుగానే భావించగలుగుతాడు.అప్పుడు మనసు బృందావనంగా మారిపోతుంది.నిత్య వసంతంలో మనిషి జీవిస్తాడు. ఎక్కడో ఆనందాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలుంటాయి. ఆ మాటకొస్తే భావోద్వేగమే లేని జీవిని మనం  అసలు మనిషిగానే గుర్తించలేం. భావోద్వేగాలు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమని అనేవారు మనస్సు కూడా ఆటంకమే అంటారు. అటు తరువాత శరీరం కూడా దానికి ఆటంకమంటారు. అవును, ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే.శరీరం, మనసు, భావోద్వేగ శక్తులు జీవితంలో ఆటంకాలుగా, ఎదుగుదలను నిరోధించేవిగా ఉండొచ్చు లేదా అవే ఎదుగుదలకు సోపానాలు కూడా కావచ్చు. అదంతా వాటిని జీవితంలో ఎవ్పుడు ఎలా మలుచుకున్నారు అనే విషయం మీద ఆధార పడి ఉంటుంది.  మానవ శరీరం ఓ అద్భుతమైన సాధనం. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైనది. ఈ సాధనంలో ఏ లోపం లేదు. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే సమస్యగా మారింది. ఎందుకంటే దాన్ని తెలుసుకోవడానికి గానీ, నియంత్రించడానికి గానీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. కనకనే మనస్సుని నియంత్రించలేని వారంతా దాన్నో సమస్యగా భావిస్తున్నారు. నిజమే. వారి మనస్సు వారికొక సమస్యే. అటువంటి వారి ఆలోచనా సరళి అందరికీ సమస్యే. అంతేగానీ మనస్సు దానికై అది ఒక సమస్య అని అర్ధం కాదు
-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply