వ్యక్తిత్వాన్ని వికాసాన్ని పెంచే విద్య నేటి అవసరం. 

Share Icons:

వ్యక్తిత్వాన్ని వికాసాన్ని పెంచే విద్య నేటి అవసరం. 

విలువలను పెంచేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, ప్రకృతిలో సర్దుబాటుకు తోడ్పడేది, మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును సంపూర్ణంగా వికసించేటట్లు చేసేది, భావిజీవిత సవాళ్లను అధిగమించేందుకు శక్తినిచ్చేది విద్య అని విద్యా లక్ష్యాల గురించి మనం చెప్పుకుంటుంటాం. అనేక పాఠ్యాంశాల ద్వారా ఏడాది పొడవునా బోధించిన చదువు ద్వారా ఎంతో కొంత విద్యా లక్ష్యాలు సాధించవచ్చునని ఆశిస్తుంటే పరీక్షల సమయంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటికి పిల్లల్ని తయారుచేసి పరీక్షల నుండి బయటపడేసే నేటి చదువుల ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి నిర్మాణం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది.
మరి అలాంటపుడు వేలకోట్ల రూపాయలతో పెట్టుబడిపెట్టి నడుస్తున్న పాఠశాలలు ఏం సాధిస్తున్నట్లు? నేటి సమాజంలో టి.వి.లు., సినిమాల వల్లనైతేనేమి, యాంత్రికజీవితం వల్ల అనేక సామాజిక రుగ్మతలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులు క్షణికావేశానికి గురై తల్లిదండ్రులు మందలించారనో, ఉపాధ్యాయులు దండించారనో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఇటీవల కొన్ని వున్నాయి. పరీక్షలలో ఉత్తీర్ణత చెందలేదని, ఎదుటివారు అవమానపరిచారని అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే శక్తి వున్న నేటి యువత ఇలా అనర్థాలకు బలికావలసిందేనా?
ఆంగ్లమాధ్యమం, ప్రైవేట్‌ చదువుల ప్రాబల్యంవల్ల నేటి విద్యార్ధులు నిరంతరం ఒత్తిడికి గురౌతున్నారు. మానసిక బలహీనత, న్యూనతాభావం కూడా మరికొన్ని కారణాలు. ఉమ్మడి కుటుంబంలో నైతేనేమి, ఇటీవల కాలం వరకు కూడా గ్రామీణ ప్రాంతాలలో సంబంధాలు బలంగా వుండటం, రాకపోకలు, మానవ సంబంధాలు బలంగా వున్ననాడు సామాజిక రుగ్మతలు తక్కువగా వుండేవి. కానీ నేటి యాంత్రిక జీవనంలో ప్రక్కవారితో కూడా కనీస సంబంధాలు లేని నేటి స్థితిలో తల్లిదండ్రులిద్దరు ఉద్యోగాలు చేయడం, పిల్లలను హాస్టళ్లలో నిర్బంధంగా వుంచడం, మార్కుల టార్గెట్‌ పెట్టడం విద్యార్థులు ఒత్తిడికి గురికావడానికి కారణాలుగా భావించాలి. యాంత్రిక జీవితంవలన పిల్లలు సహజత్వాన్ని కోల్పోయి మానసిక బలహీనులవుతారు. వ్యక్తిత్వం కొరవడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నత విద్యలు చదివి పట్టాలు ఎన్ని పొందినా వారిలో విలువలు నశించి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ, అభిమానాలు, మర్యాద, మన్ననలు, కృతజ్ఞతా సహనాలను కోల్పోతున్నారు.
ప్రణాళికలో వుండవలసిన అంశాలు ఏమిటి?
వికృత చేష్టలకు విరుగుడుగా చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాస విద్యా ఒఢన అవసరం. అందువల్ల  విద్యార్థులు ఊహాలోకంలో కాకుండా నిజ జీవితంలో జీవిస్తారు. భ్రమలకు లోనుకారు. కనుక, విపరీత పరిణామాలు చోటుచేసుకోవు. దీనిద్వారా ప్రతిదానికి ఆలోచించి, పరిష్కరించే నేర్పు, సమయస్ఫూర్తి, సందర్భోచిత చర్యలు అలవడతాయి. విజయం ఆశిస్తారే కాని తగిన మార్గాన్ని ఎన్నుకోరు.  శ్రమను ఆయుధంగా చేసుకోవాలని, నిరంతరసాధన, పట్టుదల, కార్యదీక్షతో ముందుకెళ్లాలని చెపుతూనే ఈ స్పృహ లేకపోతే అపజయం పాలవుతామని తెలియజేయాల్సి వుంటుంది. ఏకాగ్రత ఎలా సాధించాలి? సమయపాలన, క్రమశిక్షణ పాటించే చిత్తశుద్ధి, నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా వుండడమెలా?
 ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, కష్టాలకు కృంగిపోయే బలహీనతలు-పరిష్కారాలు ఇందులోని మరికొన్ని అంశాలు.
చిన్న నాడే ఇలాంటి వారిలోని బలహీనతలను తగ్గించకపోతే పెద్దవారైన తర్వాత జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోలేక బలహీనులయ్యే ప్రమాదముంది. ఉన్నతస్థాయికి ఎలా చేరుకోవాలి? అంచెలంచెలుగా చేయవలసిన కృషి, అనుభవాలు, జ్ఞాపకాలు, మహానుభావుల జీవితచరిత్రలు కూడా జోడించడం ద్వారా విద్యార్థులకు మరింత ప్రయోజనముంటుంది. కోపాన్ని జయించడం, దుఃఖం నుండి బయటపడడం, వివిధ మానసిక సంఘర్షణలు, భావావేశాల నుండి రక్షింపబడటం కూడా ముఖ్యమైన సందర్భాలే. వాయిదావేసే తత్వాన్ని మార్చుకోవడం, అవాంతరాలను అధిగమించడంతోపాటు సహకారం, ప్రేమ, ఆత్మీయత, త్యాగం, జాలి, కరుణ మానవతా విలువలను పెంచే కృషి ఇందులో దాగిఉంటాయి..
ప్రేమోన్మాదం పేరున జరిగే హత్యలు, రాగింగ్‌ పేరున కళాశాలల్లో జరుగుతున్న రాక్షస కృత్యాలు, తుపాకి సంస్కృతి, దాడులు తగ్గిపోయి మానవత్వంతో ఆలోచించే ప్రశాంత పరిస్థితులు పాఠశాలల్లోను, సమాజంలోను నెలకొనాలి. తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే, ఇరుగు పొరుగువారితో కష్టసుఖాలలో పాలుపంచుకునే మహోన్నత సంస్కారం చిన్ననాటి నుండే ప్రతివ్యక్తిలో అలవడాలి. ఆ వైపుగా సమాజాన్ని నడిపించాలంటే నేటి విద్యార్థులు, యువతలో పెనుమార్పులు రావాల్సి వుంది. దానికి సామాజిక చైతన్య కార్యక్రమాలు, మానసిక విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా విద్యార్థుల కనుగుణంగా వ్యక్తిత్వ వికాస విద్య ప్రణాళికను రూపకల్పన చేయించి ప్రతి పాఠశాలలో తప్పకుండా అమలు పరచవలసిన బాధ్యత ప్రభుత్వంపై తో పాటు సమాజంలోప్రతి వ్యక్తిపైనా ఉంది.
-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply