తెలంగాణలో పీసీసీ రచ్చ: సీనియర్‌తో రేవంత్‌కు తంటా!

Share Icons:

హైదరాబాద్: చాలా రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుని మారుస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలని మరొకరికి అప్పజెబుతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ పదవి కోసం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, వి‌హెచ్, భట్టి లాంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.  అయితే తెలంగాణలో టీఆర్ఎస్‌లో అంత బలంగా ఢీకొట్టగలిగే నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అని కాంగ్రెస్‌లో కొందరు నేతలు నమ్ముతున్నారని… రేవంత్ రెడ్డి సైతం తనకు ఈ పదవి ఇవ్వాలని చాలాకాలం నుంచి హైకమాండ్ దగ్గర లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం.

ఇందుకోసం ఆయన ఢిల్లీ స్థాయిలో తనకున్న అన్ని రకాల పరిచయాలను ఉపయోగించుకుంటున్నారనే వాదన ఉంది. అయితే రేవంత్ రెడ్డికి టీ పీసీసీ రేసులో మరో సీనియర్ నేత నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న భువనగిరి ఎంపీ, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… తాను టీపీసీసీ రేసులో ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తనకు ఒకసారి ఈ ఛాన్స్ ఇవ్వాలని బహిరంగంగానే కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో సోనియాగాంధీకి కూడా చెబుతానని అన్నారు. దీంతో రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోనూ, రాజకీయాల్లోనూ రేవంత్ రెడ్డికి ఎంతో సీనియర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాదని కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తుందా ? అనే చర్చ కూడా కాంగ్రెస్‌లో మొదలైంది. మరోవైపు కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు సైతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ విషయంలో మద్దతు ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిని మరో సీనియర్ నేత టెన్షన్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. మరి వీరిలో పి‌సి‌సి ఎవరికి దక్కుతుందో చూడాలి.

 

Leave a Reply