మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు కానీ ముందు అది కట్టండి…

Share Icons:

కర్నూలు: కర్నూలు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, స్థానిక సమస్యలపై స్పందించారు. ఈరోజు కర్నూలు ఓల్డు సిటీ లోని జమ్మిచెట్టు ప్రాంతం, జోహరాపురం కాలనీ మధ్య హంద్రీ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లు అయినా చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.

బాధ్యత గల ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోతే జరిగే నష్టం ఇలాగే ఉంటుందని అన్నారు.  ప్రజలకు డబ్బులు పడేశాం కనుక ఓట్లు వేశారని, ఇక వారికి పని చేయాల్సిన అవసరం లేదని నాయకులు భావిస్తున్నారు కనుక ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. గత ప్రజాప్రతినిధి, ప్రస్తుత ప్రజాప్రతినిధి మధ్య  తగాదాల కారణంగా ప్రజలకు ఉపయోగపడే నిర్మాణం నిలిచిపోవడం బాధాకరమని, రెండు, మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే పనులను కూడా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసి, కొత్తవి ప్రారంభించడం వల్ల ఎంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అన్నారు. మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు కానీ, ముందు జోహరాపురం వంతెన నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు.

ఇక కర్నూలులోని బండిమెట్ట ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై సాధారణ కేసు నమోదు చేశారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. మైనర్లపై లైంగిక దాడి చేస్తే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ సాధారణ కేసుగా పరిగణించడమేంటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. చిన్నారిపై ఖాజా మొహినుద్దీన్ (40) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని స్థానిక నేతలు తెలిపారు.

 

Leave a Reply