ఎన్నికల ప్రచార బరిలో పవన్: బీజేపీకి కలిసొస్తుందా?

pawan kalyan sensational comments
Share Icons:

ఢిల్లీ: 70 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న కేంద్ర పాలిత రాష్ట్రం ఢిల్లీలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే రాష్ట్రం చిన్నదే అయినా, అసెంబ్లీ సీట్లు తక్కువగానే ఉన్నా.. దేశరాజకీయాలను ప్రభావితం చేయడంలో మాత్రం హస్తిన నగరం తక్కువేం కాదు. దేశ రాజధాని కావడం, అందులో అన్ని వర్గాల, రాష్ట్రాల ప్రజలు నివసిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో హస్తినని చేజిక్కించుకునేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి.

అక్కడ ఇతర రాష్ట్రాల ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తెలుగు వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారానికి పవన్ ను దించాలని కమలనాధులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన అధినేతతో చర్చలు మొదలయ్యాయి. వచ్చే వారంలో పవన్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు అధికారికంగా దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది.

ఇక పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరునున్నారు. అందులో భాగంగా ఇప్పటికే నాలుగు రోడ్ షోలకు ప్రణాళికలు సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో..పాటు కరోల్ బాగ్ ప్రాంతంలో బహిరంగ సభ సైతం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బీజేపీ తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటుగా పవన్ సైతం ప్రచారం చేయనున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ తెలుగు రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల గెలుపు ఆ పార్టీకి ఎంత అవసరమో..పవన్ కళ్యాణ్ కు సైతం అంతే ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. పవన్ ఏ స్థాయిలో ప్రభావితం చూపించగలరనేది తెలియనుంది.

 

Leave a Reply