జగన్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్…

pawan kalyan sensational comments on ap people
Share Icons:

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం  ప్రవేశ పెట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ప్రతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పవన్ ముగ్గురు భార్యలకు ఉన్న పిల్లల్ని ఏ మీడియంలో చదివిస్తున్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

మీ అభిప్రాయాలు వెలువరించే సమయంలో అప్రమత్తత అవసరమన్నారు. ‘నేతలు, విద్యావంతులకు నేను విన్నపం చేస్తున్నా.. మీ అభిప్రాయాలు చివరకు విధానాలుగా రూపాంతరం చెందుతాయి. అవి కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయి. అందుకే, ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వైసీపీ ఇంగ్లీషు మీడియం ప్రతిపాదనపై విరుచుకుపడిందని ఆరోపిస్తూ, ‘మాతృభాషకు మంగళం’ అంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని పోస్టు చేశారు. అంతేకాదు, ‘ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా?’ అంటూ మరో కథనాన్ని కూడా ట్వీట్ చేశారు. అప్పుడు, ఇప్పుడు వైసీపీ కపట ధోరణికి ఇదే నిదర్శనం అంటూ పేర్కొన్నారు.

అటు జనసేన సోషల్ మీడియా విభాగం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తుంది. ‘ఇదీ మా సంస్కారం’ అంటూ గతంలో జగన్ ను విమర్శిస్తూ పవన్ గతంలో మాట్లాడిన వీడియోను జనసేన శ్రేణులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘జగన్మోహన్ రెడ్డి అలా తిడుతుంటే నేను కూడా బలంగా తిట్టగలను. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్లు నేను మాట్లాడలేను. వారి పిల్లలు, కుటుంబ సభ్యులు గుర్తొస్తారు’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో ఉన్నాయి.

ఇక జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు సంయమనం పాటించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విన్నవించారు. పవన్ పై జగన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దని… భవన నిర్మాణ కార్మికులపై మన అధినేత చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలాంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చేసినట్టు భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలసీల గురించి పవన్ మాట్లాడుతుంటే…. ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని… ఇది బాధాకరమని అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ… ప్రజాక్షేమం కోసం మనం భరిద్దామని పవన్ కల్యాణ్ చెప్పారని తెలిపారు.

 

Leave a Reply