జగన్ పై పవన్ సెటైర్: ఆంగ్ల మాధ్యమం చదివిన వారు జైలుకు ఎందుకెళ్లారు?

pawan kalyan comments on jagan about english medium
Share Icons:

తిరుపతి: ఏపీ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలని అంటున్నారు. ఈ మేరకు మన నది-మన నుడి పేరిట ఓ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్…తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ల పరిధిలోని నియోజకవర్గాల నాయకులతో తెలుగు వైభవం – తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీలో ఉర్దు, కన్నడ, ఒడియా, తమిళం, బెంగాళీ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని, వాటిని వదిలేసి తెలుగు మాధ్యమం జోలికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. భాషజోలికొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఇక తాను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నానన, ఆంగ్ల మాధ్యమం చదువే గొప్ప అయితే, ఆ మాధ్యంలో చదివిన వారు అవినీతికి పాల్పడి జైలుకు ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. అలాగే తెలుగు కవుల రచనలపై కార్యశాలలు నిర్వహించాలని,  మన నుడి- మన నది కార్యక్రమ లక్ష్యమిదే అని అన్నారు. తెలుగు సినిమాలో మన సాహిత్యం రోజురోజుకు దిగజారి పోతోందని,  తెలుగు భాష నిర్లక్ష్యం కావడానికి తరతరాలుగా వ్యవస్థను నడుపుతోన్న పాలకుల నిర్లక్ష్యమే కారణం’ అని వ్యాఖ్యానించారు.

అంతకముందు ఆయన కడప పర్యటనలో మాట్లాడుతూ… రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ స్టీల్ ప్లాంట్‌ను పక్కన పెట్టి న్యూక్లియర్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. తుమ్మలపల్లి యురేనియం ఫ్యాక్టరీ కారణంగా ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఆరు గ్రామాలను ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని పవన్ అన్నారు. రాయలసీమలోని దుర్బిక్షంపై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మొత్తంగా చూసుకొంటే రాయలసీమలో వర్షాపాతం తక్కువని, కానీ ఇక్కడ నేతల భూములు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయని, అదే సగటు రైతు భూములు మాత్రం బీడుపోయి ఉండటం నన్ను ఎంతగానో కలిచివేస్తుందని అన్నారు.

 

Leave a Reply