పప్పు పౌష్టికాహారము

Share Icons:

పప్పు-రాచ్చిప్ప-ముద్దకవ్వంల కలయిక అపూర్వం. పప్పును రాచ్చిప్పలో వేసి ముద్దకవ్వంతో ఎనిపితే ఆ రుచి అమోఘమని మా అమ్మమ్మ అంటుండేది. నాకు వంటచేయండం అంటే మహా ఇష్టం. ఈరోజు మిక్సర్, బ్లెండర్ వాడకుండా రాచ్చిప్పలో ఉడికించిన పప్పు, అకులు, దినుసులు రాచ్చిప్పలో వెసి కర్రముద్దకవ్వంతో ఎనిపి పొనగంటాకుపప్పు తయారు చేస్తుండగా పప్పు మీద మంచి పోస్ట్ పెట్టాలనిపించింది.

పప్పు ప్రాశస్త్యం:-

పప్పు లేదా పప్పు కూర తెలుగువారు ఎంతో ఇష్టంగా అన్నంలో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి భోజనంలో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన కూరగా తింటారు. రుచి కోసం రకరకాల మసాలాలు, ఆకులు, కూరగాయ ముక్కలు మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని రొట్టెలు, చపాతీలతో కలిపి తింటారు.

శనగలు, మినుములు, రాజ్మా, కందులు, పెసర్ల వంటివి తరచుగా తింటూనే ఉంటాం. ఇలాంటి పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. వెంటనే ఆకలి కాకుండా చూస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి. అంతేకాదు శరీరానికి బలాన్ని ఇవ్వటంతో పాటు జబ్బులను నివారించుకునే శక్తినీ అందిస్తాయి.

కందులు, పెసర్ల వంటి పప్పులు క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి.
తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. ప్రోస్టేట్, మలద్వార క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతున్నట్లూ వెల్లడైంది. వీటికి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణమూ ఉంది.

రకరకాల పప్పులు:-

కాబూలీ శెనగలు: వీటిల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అందువల్ల కాబూలీ శనగలను తరచుగా తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ను (ఎల్‌డీఎల్), ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా గుండెజబ్బులూ దూరంగా ఉంటాయి. అయితే వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ లాభాలు.

రాజ్మా: విషయగ్రహణ శక్తిని పెంపొదించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రాజ్మాలో అధికంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లూ, అల్త్జెమర్స్ బారినపడకుండా చూసే థైమీన్ కూడా దండిగానే ఉంటాయి.

ఉలవలు: ఇనుము, క్యాల్షియం, మాలిబ్డినమ్ వంటివి ఉలవల్లో దండిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ గుణాలు గల ఫాలీఫెనాల్స్ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబోడీలు, స్వీయరోగనిరోధక చర్యల్లో కనిపించే హీమగ్లుటినిన్ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్, కడుపు ఉబ్బరం తగ్గటానికీ తోడ్పడతాయి.

సోయాబీన్స్: వీటిల్లో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలూ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పడతాయి. ప్రస్తుతం వీటితో తయారుచేసిన పాలు, టోఫూ వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే సోయాబీన్స్ ఉత్పత్తులను పరిమితంగానే తినాలి. ఇకపోతే-

కంది పప్పు
పెసర పప్పు
పప్పు చారు
ఉత్త పప్పు
ముద్ద పప్పు
వంకాయ పప్పు
దోసకాయ పప్పు
చామదుంప పప్పు
మామిడి కాయ పప్పు
టమాట పప్పు
చింతకాయ పప్పు
పొనగంటాకు పప్పు
గోంగూర పప్పు
బచ్చలి కూర పప్పు
కాసాకు పప్పు
తోట కూర పప్పు
పాల కూర పప్పు
మెంతి కూర పప్పు
కలగూర పప్పు
ఖీమా పప్పు
నాటుకోడి పప్పు

-తదితర పసందైన పప్పుకూరలు ఎన్నో నిత్యం మన ఆహారంలో భాగమయ్యాయి. భిన్న దేశాల్లో విభిన్న రుచులు చవిచూసిన ఓ బ్రిటన్ రచయిత భారతీయ పప్పుకు సాటి మరే వంటకం లేదంటున్నారు. తన అభిమాన వంటకమైన పప్పును ‘లైఫ్ సేవింగ్ డిష్ ‘(ఎల్ఎస్‌డీ) గా రచయిత సిమోన్ మజుందార్ అభివర్ణిస్తున్నారు. 38 దేశాల్లోని శాకాహార, మాంసాహార వంటకాల్లో ఉత్తమమైన వాటి కోసం అన్వేషించారు. చివరకు భారతీయ పప్పు అత్యుత్తమ వంటకమని తేల్చేశారు.

అలాంటి పప్పు ఇప్పుడు నెటిజనుల నోళ్లలో మరో రకంగా నలుగుతోంది.

Leave a Reply