ఇండియాలోని అధికార పార్టీ ముస్లిం వ్యతిరేకి: పాక్ ప్రధాని

Share Icons:
ఇస్లామాబాద్, 7 డిసెంబర్:

పాకిస్థాన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి భారత్‌పై పరోక్ష విమర్శలు చేస్తున్న ఇమ్రాన్ ఖాన్..మరోసారి బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఆయన ‘వాషింగ్టన్ పోస్ట్‌’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో…నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్రాన్ ‘స్నేహహస్తాన్ని’ అందించినా ఇండియా ఎందుకు నిరాకరిస్తోందన్న ప్రశ్నకు సమాధానంగా.. ఇండియాలోని అధికార పార్టీ ‘ముస్లిం వ్యతిరేకి’ అని అన్నారు. ఆ ‘అధికార పార్టీ ముస్లిం, పాకిస్థాన్ వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తోంది అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

 అయితే ఇండియా నుంచి సరైన స్పందన రాకపోవడానికి రాబోయే నెలల్లో ఆ దేశంలో జరుగనున్న ఎన్నికలు కారణమని చెప్పారు. అందువల్లే తన విన్నపాలను తోసిపుచ్చుతోందని ఆయన తెలిపారు.

ఇక అధికార బీజేపీపై ఇమ్రాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా పాకిస్థాన్‌తో విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశానికి ఇండియా నిరాకరించడంపై ట్విట్టర్‌లో ఇమ్రాన్ ‘అసంతృప్తి’ వ్యక్తం చేశారు.

ఇండియా నిర్ణయం ‘దురహంకారపూరితం’గా ఉందని, చిన్న వ్యక్తులు పెద్ద పదవుల్లోకి వచ్చినప్పుడు విశాల దృక్పథంతో చూడలేరు’ అంటూ పరోక్షంగా మోదీని విమర్శించారు.

మామాట: మరి ఈ విమర్శలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో

Leave a Reply