మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్….ఇండియాతో యుద్ధం

pak pm imran khan comments on former pm sharif
Share Icons:

 

ఇస్లామాబాద్:

 

జమ్మూ-కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. ఇండియాలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఎంతటి దుష్పరిణామాలను ఆ దేశం ముందు ఉంచనుందో అతి త్వరలోనే తెలుస్తుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్, పుల్వామా తరహాలో మరిన్ని దాడులు జరగవచ్చని హెచ్చరించారు.

 

భారత్ చర్యను తీవ్రంగా ఆక్షేపించిన ఆయన, ఈ నిర్ణయం తన ప్రభావాన్ని చూపకముందే పాలకులు మేల్కొనాలని అన్నారు. రెండు దేశాల మధ్యా యుద్ధం జరిగే పరిస్థితులకు దారితీయవచ్చని, ఆ పరిస్థితి రాకుండా ఇండియా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. కాశ్మీర్ లో యధాతథ స్థితిని కొనసాగించాలని సూచించారు.

 

కాగా, ఇదే సమయంలో లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడాన్ని తాము అంగీకరించబోమని చైనా వ్యాఖ్యానించగా, భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ విభజన పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము కల్పించుకోబోమని, ఇతర దేశాల నుంచి కూడా అదే కోరుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

 

ఇదిలా ఉంటే కాశ్మీర్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలువురు రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వేర్పాటువాదులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటి వరకు 400 మందిని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని ఉంచేందుకు హోటళ్లు, అతిథి గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు.

 

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను హరినివాస్‌లోని వేర్వేరు కాటేజీలకు తరలించగా, వేర్పాటువాద నాయకుడు (91) సయ్యద్ అలీషా గిలానీని గృహ నిర్బంధంలో ఉంచారు. తనను కూడా గృహనిర్బంధం చేశారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

Leave a Reply