మరో రికార్డు నెలకొల్పిన పాక్ ఓపెనర్….

Pakistan Opener fakhar jaman created new record in one day series
Share Icons:

బులవాయో, 23 జూలై:

జింబాబ్వేతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 364/4 పరుగులు చేయగా, జింబాబ్వే కేవలం 233/4 పరుగులు చేసి 131 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ని 5-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.

అయితే ఇప్పటికే పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌తో కలిసి అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 304పరుగులు జోడించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఫకార్‌(210; 156బంతుల్లో 24×4, 5×6) అజేయంగా నిలిచి పాక్‌ తరఫున అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి ద్విశతకం నమోదు చేసిన ఆటగాడిగా మరో రికార్డు సృష్టించాడు.

ఇక నిన్న జరిగిన ఐదో వన్డేలో ఫకార్‌ జమాన్‌(85; 83బంతుల్లో 10×4, 1×6) మరోసారి రెచ్చిపోయాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌(21 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు) పేరిట ఉండగా, ఫకార్‌ దానిని 18 ఇన్నింగ్‌లలోనే చేరుకున్నాడు.

ఫకార్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకూ 18మ్యాచ్‌లాడి సగటు 76తో మొత్తం 1065పరుగులు సాధించాడు. అందులో మూడు శతకాలు, ఒక ద్విశతకం, ఆరు అర్ధశతకాలున్నాయి. అలాగే ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 257.5 సగటుతో 515 పరుగులు చేశాడు.

మామాట: రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడుగా…!

Leave a Reply