పాక్ సెమీస్ చేరకుండా భారత్ కుట్ర చేయలేదు: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

pakistan captain sarfaraz comments on team india
Share Icons:

ఇస్లామాబాద్:

 

వరల్డ్ కప్ లో చెప్పుకోదగిన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ జట్టు పాక్ ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు దక్కించుకుంది.

 

కాగా, టోర్నీ లీగ్ దశ ముగియడంతో పాక్ జట్టు స్వదేశం చేరుకుంది. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కరాచీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ, ఇంగ్లాండ్ పై టీమిండియా కావాలనే ఓడిపోయిందన్న ఆరోపణలు సరికాదని అన్నాడు.

 

పాకిస్థాన్ సెమీస్ చేరకుండా భారత్ ఈ విధంగా కుట్ర చేసిందన్న వాదనలు సమంజసం కాదని, తమను అడ్డుకోవడానికి కోహ్లీ సేన కావాలనే ఓటమిపాలైందని తాను అనుకోవడంలేదని స్పష్టం చేశాడు. భారత్ కారణంగా తమ సెమీస్ అవకాశాలు దెబ్బతిన్నాయని తాను భావించడంలేదని తెలిపాడు.

 

 

అయితే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయన్న నేపథ్యంలో, టీమిండియా ఓటమిపాలైంది. దాంతో, కోహ్లీ సేన కావాలనే ఓడిందని, కొందరు చాంపియన్లు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదని పాక్ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. పాక్ ను సెమీస్ రేసు నుంచి తప్పించడానికి టీమిండియా కుట్రపూరితంగా ఓడిందంటూ ఇష్టంవచ్చినట్టు వకార్ యూనిస్ తదితరులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారందరి అభిప్రాయాలకు భిన్నంగా పాకిస్థాన్ కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు  చేయడం పట్ల భారత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply