ఇండియా-పాక్ జట్ల మధ్య ఉన్న తేడా అదే….కోహ్లీసేన సమిష్టిగా రాణిస్తుంది

Share Icons:

లండన్, 19 జూన్:

ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించడంపై పాక్ జట్టు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందించాడు. గత కొన్నేళ్లుగా భారత్-పాక్ జట్ల మధ్య చాలా తేడా వచ్చిందని, ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో అది కనిపించిందని వకార్ వివరించాడు. ఏ ఒక్క బౌలర్ పైనో, బ్యాట్స్‌మన్ పైనో పాక్ జట్టు ఆధారపడుతుందని, అదే సమయంలో భారత్ జట్టు సమష్టిగా ఆడుతోందని కితాబిచ్చాడు. భారత జట్టులో ఎవరి పాత్ర ఏమిటనేది ఆటగాళ్లకు తెలుసని అన్నాడు.

ప్రస్తుత భారత జట్టు పాకిస్థాన్‌ను భయపెట్టిందన్నాడు. భారత్‌తో తలపడిన ప్రతిసారీ పాకిస్థాన్ జట్టు ఒత్తిడిలో కూరుకుపోతోందన్న వకార్.. తమది బలహీనమైన జట్టన్న భావనలో కూరుకుపోతోందన్నాడు. తొలుత దీని నుంచి సర్ఫరాజ్ సేన బయటపడాల్సి ఉంటుందన్నాడు. అలాగే పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా భారత ఆటగాళ్లతో సమానంగా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ జట్టు ఒక్కొక్క ఆటగాడిపైనా ఆధారపడుతుందని, కానీ భారత్ జట్టు ఏకమొత్తంగా ఆడుతుందని యూనిస్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే పాక్ క్రికెట్ అభిమానిని రణ్‌వీర్ దగ్గరకు తీసుకుని ఓదార్చుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రణ్‌వీర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల జరిగిన భారత్ – పాక్ మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడిపోవడాన్ని చూసిన ఓ పాక్ అభిమాని భరించలేకపోయాడు. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ అతన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చడమే కాకుండా అతనితో కలిసి ఓ సెల్ఫీ కూడా దిగాడు. మరో అవకాశం ఉందిలే బాధపడకని ధైర్యం చెప్పాడు.

Leave a Reply