మాజీ ప్రధానితో పాత్రికేయునిగా మధుర జ్ఞాపకాలు…

Share Icons:

మాజీ ప్రధానితో పాత్రికేయునిగా మధుర జ్ఞాపకాలు…

శ్రీ పీ వీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనొక సాధారణ పౌరుణ్ణి. విద్యార్థి దశనుంచీ ఆర్జన దశలోకి అడుగుపెట్టిన వయసు. జీతంతో జీవితంలో కాలుపెట్టిన బ్యాంక్ ఉద్యోగిని. తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల సమయంలో ముద్రణా మాధ్యమాలు తక్కువ కావడంతో సమాచారం అరకొరగానే ఉండేది. రెండు ఉద్యమాల వలన నష్టపోయిన యువతరంలో నేనూ ఒకడిని. ఆయన గురించి వినడమే కాని, చదివింది అర్ధం చేసుకున్నది తక్కువే. నేను పుట్టి పెరిగి చదువుకున్నది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన పుట్టుక నుంచీ దివంగతులయ్యే వరకూ అంచలంచెలుగా ఎదిగింది నిజాము ప్రభువు నెదిరించిన తెలంగాణలో. ఆయన సౌమ్యుడు కావడమేగాక, రాజకీయ చక్రం తిప్పిన ముఠా నాయకుడు కానందున పెద్దగా తెలుసునే అవకాశం లేకపోయింది.

శ్రీ పీ వీ దేశ రాజకీయాల్లో ధ్రువతారగా ప్రకాశించడం మొదలయినతరువాత నేను 1979 లో పాత్రికేయంలో కాలుపెట్టడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి అవకాశం లభించింది. నాలుగు దశాబ్దాల నా పాత్రికేయ ప్రతినిధి అనుభవంలో వివిధ హోదాలు అధిష్ఠించించిన ఆ తెలుగుతేజం కార్యక్రమాలకు, రాజకీయ సభలకు విలేఖరిగా హాజరయ్యే అదృష్టం దక్కింది. ప్రధాని హోదాలోనూ, మాజీ ప్రధానిగానూ ఆయన్ను అతి దగ్గరగా చూసే అవకాశం లభించింది. పాత్రికేయులంటే ఆయనకు ఇష్టం. ఓ మూడు నాలుగు పర్యాయాలు ఒకరిద్దరు సన్నిహితుల మధ్యలో వారితో నేనూ ఉండడం, అప్పుడు దొర్లిన సంభాషణలు మదిలో నిక్షిప్తమైపోవడం…

నిజాం పాలన నుంచీ హైదరాబాద్ సంస్థానానికి, విముక్తి కలిగించడం. భారత స్వాతంత్ర్య సిద్ధి లక్ష్యాల సాధనకు, ప్రజాసేవకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక శక్తివంత ఆయుధంగా శ్రీ పీ వీ తనకు సన్నిహితుడయిన సదాశివరావుతో కలసి 1948లో వరంగల్లు నుంచి ‘కాకతీయ’పత్రిక ప్రచురణ ప్రారంభించిన విషయం 1979 “ఈనాడు” శిక్షణ కాలంలో తెలుసుకున్నాను.. ఆ పత్రికకు వీరిద్దరూ సంపాదకులని. నిష్కర్ష విమర్శలతో కాకతీయ పత్రిక తెలుగు పత్రికా రంగంలో ఒక అపూర్వ ప్రయోగంగా చరిత్ర సృష్టించిందనీ, శ్రీ పీ వీ. కాళోజీకి ఆప్త మిత్రుడనీ తెలుసుకున్నాను.

ఆయన బహుభాషా పండితుడైనా, ఒక తెలుగువాడిగా తెలుగంటే ప్రత్యేక అభిమానం. ప్రధానిగా ఉన్నప్పుడు, అంతకు ముందు అనేక కీలక పదవుల్లో ఉన్నప్పుడు కూడా పత్రికలను ఆయన చాలా ప్రేమించేవారు. సాహిత్య కృషి, సంగీతం, సినిమా, నాట‌కాలంటే ఇష్టం. భార‌తీయ ఫిలాస‌ఫీ, సంస్కృతి, ర‌చ‌నా వ్యాసంగం, రాజ‌కీయ వ్యాఖ్యానం, భాష‌లు నేర్చుకోవ‌డం, తెలుగు, హిందీలో క‌విత‌లు రాయ‌డం, సాహిత్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ, అనేక అభిరుచులు. ఆయనది మొదటినుంచీ పాత్రికేయ కలం కనుక పత్రికలు అందులోనూ కొన్ని తెలుగు పత్రికలంటే ఆయనకు ప్రత్యేక అభిమానం కూడా.  ఆంధ్రప్రభ పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం చాటి చెప్పాలంటే.. ఆయన రాసిన “ఇన్ సైడర్”నవల తెలుగు అనువాదం – లోపలి మనిషి – ప్రచురణకు వారు &qఉఒత్;ఆంధ్రప్రభqఉఒత్;ను ఎంచుకోవడమే తార్కాణం. మొదటి నుంచీ “ఆంధ్రపత్రిక”తో పాటు రామ్‌నాథ్ గోయెంకా ఎక్స్‌ప్రెస్ గ్రూపు పత్రికలను మిక్కిలి అభిమానించేవారు. దిల్లీలో ఉన్నంతకాలం ‘ఆంధ్రప్రభ’ను ప్రతిరోజూ కచ్చితంగా చదివేవారు.

శ్రీ పీ వీ నరసింహారావు రాసిన   ఇన్ సైడర్  తెలుగు అనువాదం ‘లోపలి మనిషి’ధారావాహిక ప్రచురణ ”ఆంధ్రప్రభ”లో 1998లో మొదలైంది. ఏడాదికి పైగా ప్రచురణ సాగింది. పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింద.  చాలామంది పాఠకులు స్వయంగా పీవీగారే తెలుగులో రాస్తున్నారనుకున్నారు.  ది ఇన్ సైడర్ ను తెలుగులోకి అనువదించి సీరియల్ గా ప్రచురించాలన్న ఆలోచన ఆంధ్రప్రభ – న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని మనోజ్ కుమార్ సొంతాలియా నుంచి వచ్చింది. అప్పుడు సంపాదకులుగా ఉన్న శ్రీ వాసుదేవదీక్షితులు ఆ అనువాదం బాధ్యతను ఆంధ్రప్రభలో తన తరువాతి స్థానంలో సహాయ సంపాదకులుగా ఉన్న శ్రీ కల్లూరి భాస్కరంకు అప్పగించారు. ఎవరు అనువాదం చేస్తారని శ్రీ పీ వీ అడిగినప్పుడు కల్లూరి భాస్కరం పేరు చెప్పారు. మొదట రెండు అధ్యాయాలు అనువదించి పంపించమని పీవీ అడిగారు. పంపిన తర్వాత సరే అన్నారు. వాటిని అక్కడక్క ప్రూఫ్ రీడింగ్ కూడా చేసి నేరుగా శ్రీ కల్లూరి భాస్కరంకే కవర్ లో వాటిని పంపించారు. దానికి ఒక లేఖ కూడా జతపరిచారు. అందులో అనువాదం బాగుందని, కొనసాగించమని, తన సహాయం కూడా ఉంటుందని రాశారు. ఆ లేఖ చూసి శ్రీ కల్లూరి భాస్కరం ఆశ్చర్యపోయారు. ఎడిటర్ల స్థాయిలోనే ఆయన వ్యవహరిస్తారని నేరుగా తనతో ఇంటరాక్ట్ కారన్న ఆయన ఊహ తలకిందులైంది. పీవీగారికి ప్రోటోకాల్ పట్టింపులేవీ ఉండవని, పని చేసేవారితోనే నేరుగా సంభాషిస్తారని అర్థమైంది.

పీవీతో సన్నిహిత పరిచయం ఉన్న ఒక సీనియర్ పత్రికా సంపాదకుడు  ది ఇన్ సైడర్  అనువాదానికి మరో రచయిత పేరును పీవీకి సూచించారట. ఆయన కథారచయితగా కూడా అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడు. కానీ పీవీ ఆ సలహాను తోసిపుచ్చారు. భాస్కరం అనువాదం బాగుంది, అతనే చేస్తాడు  అని చెప్పారు. ఈ సంగతి పార్లమెంటు సభ్యులు శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ స్వయంగా శ్రీ భాస్కరంకు చెప్పారు. పివి ఆత్మకథ   ఇన్‌ సైడర్   ను  లోపలి మనిషి గా ఆంధ్రీకరించిన ఏకైక సమర్థుడు, నిష్టాగరిష్ఠుడైన పాత్రికేయుడు శ్రీ కల్లూరి భాస్కరం.. ఒక్కరే!

ధారావాహిక ప్రచురణ జరిగినంతకాలం పీవీ ప్రతి అధ్యాయాన్ని స్వయంగా చూశారు. ప్రూఫ్ రీడింగ్ కూడా చేశారు. అప్పట్లో టెక్స్ట్ ను నేరుగా కంప్యూటర్ ద్వారా పంపించే వెసులుబాటు లేదు. ప్రింట్ ఔట్స్ ను కంటైనర్ సర్వీస్ ద్వారా ఢిల్లీ లోని ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయానికి పంపిస్తే, ఢిల్లీలో ఆంధ్రప్రభ ప్రతినిధి శ్రీ సి.హెచ్.వి.ఎం.కృష్ణారావు వాటిని పీవీకి అందజేసేవారు. ఆయన చూసిన తర్వాత ఆ ప్రింట్ ఔట్స్ ను హైదరాబాద్ కార్యాలయానికి పంపేవారు. పీవీగారి జ్ఞాపకశక్తి అమోఘం. అనువాదం ప్రింట్ ఔట్లు చూసి పంపేశాక కూడా ఎప్పుడైనా ఫోన్ లో సవరణ సూచించేవారట. ఏ పేజీలో, ఏ పేరాలో, ఏ వాక్యంలో ఏ మాటకు బదులు ఇంకో మాట ఉంటే బాగుంటుందో చెప్పేవారు.

 ది ఇన్ సైడర్  అనువాదం సందర్భంలో శ్రీ కల్లూరి భాస్కరం తరచు శ్రీ పీ వీ ని కలిసేవారు. మొదట్లో ఒకటి రెండుసార్లు శ్రీ వాసుదేవదీక్షితులు కూడా కలిశారు. తెలుగు అనువాదానికి శీర్షిక ఆయన సూచించినదే. మాటల సందర్భంలో &qఉఒత్; ఆంధ్రప్రభ &qఉఒత్; గురించిన ముచ్చట్లు దొర్లేవి. నార్ల, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల నాగేశ్వరరావు తదితర సంపాదకుల గురించి ప్రస్తావించేవారు. పొత్తూరి వేంకటేశ్వర రావు గారంటే పివీ గారికి ప్రత్యేక అభిమానం ఉండేది. అనేక సందర్భ్జాలలో ‘ఆంధ్రప్రభ’ తో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకునే వారు.

చైనా, పాకిస్తాన్ దేశాలతో భారత్ యుద్ధాల గురించి రక్షణ నిపుణుల సమాచారాన్ని, విశ్లేషణలను పొందుపరుస్తూ శ్రీ పివీ విస్తారంగా రాశారు. ధారావాహిక ప్రచురణలో ఆ వివరాలు కథాగమనాన్ని కుంటుపరచి పాఠకుల ఆసక్తిని తగ్గించవచ్చు కనుక వాటిని క్లుప్తం చేస్తే బాగుంటుందేమో నని శ్రీ కల్లూరి భాస్కరం సూచించినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. భావి తరాలవారికి వాటి గురించి తెలియాలి కనుక అవి అలాగే ఉండవలసిందే నన్నారు. సాధారణంగా మౌనివలే కనిపించే ఆయన కొన్ని విషయాల్లో రాజీలేని ముక్కుసూటి తనం పాటించేవారు. తెలుగులో ‘భారతి’లాంటి సాహిత్య పత్రికను కూడా బతికించుకోలేకపోయినందుకు ఆయన ఒకసారి  చాలా బాధ వ్యక్తం చేశారు. మిగతా భారతీయభాషల్లో మంచి సాహిత్యపత్రికలు ఉండగా తెలుగులో లేకపోవడం విచారించదగ్గ విషయం అన్నారు. ఆ సమయంలో కల్లూరి భాస్కరంతో ఉన్న ఒక ఆంధ్రప్రభ జర్నలిస్టు, తెలుగువారు సాహిత్యపత్రికలను ఆదరించారని అన్నప్పుడు ఆయన చాలా నొచ్చుకున్నారు. తెలుగువారి గురించి మీరు అలా అనడం తప్పు అని మందలించారు. ఆ సందర్భంలో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక  చేసిన సాహిత్యసేవను ప్రస్తావించారని…. ఈ విషయాలన్నీ శ్రీ భాస్కరం స్వయంగా తెలిపారు.

పీ వీ  ఆంధ్రప్రభ  రోజూ తప్పక చదువుతారనే విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి శ్రీ పి వి రంగయ్యనాయుడే 1991 లో స్వయంగా చెప్పారు. నేను 1991 నుంచీ 1996 వరకూ ఖమ్మం జిల్లా ఆంధ్రప్రభ/ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై శ్రీ పి వి మంత్రివర్గంలో టెలి కమ్యూనికేషన్స్ ఉపమంత్రిగానూ, విద్యుత్, జలవనరుల సహాయ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 1991 నవంబర్ లో జరిగిన నంద్యాల లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీ పి వీ రంగంలో ఉండడంతో తెలుగుదేశం అధినేత, నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టి రామారావు శ్రీ పివీ పట్ల గౌరవభావంతో అభ్యర్ధిని పొటీ పెట్టలేదు. బిజెపి అభ్యర్ధిగా శ్రీ బంగారు లక్ష్మణ్ పోటీచేసి ఆయనతో ఢీకొని 5.8 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఉపఎన్నిక సమయంలో నేను నంద్యాల ఎన్నిక వార్తల సేకరణకు కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళాను. మొదటి సారి శ్రీ పి వీ గారిని కలిసే అవకాశం లభించింది. కోట్ల విజయభాస్కర రెడ్డి అనుయాయులలో ముఖ్యుడొకరు  ఈయన రాధాకృష్ణ, ఆంధ్రప్రభ ఖమ్మం జిల్లా రిపోర్టర్, చాకు అని పరిచయం చేశారు.  జాగ్రత్త, కోసుకుంటుందేమో చాకు, అని హాస్యోక్తి విసిరారు. ఖమ్మం అనగానే వెంగళరావు ఎలా ఉన్నారు, కలుస్తుంటావా, ఆయనకు మరో పోటీ ఉన్నాడే… సిద్దారెడ్డి తెలుసా.. అన్నారు.

ఆ తరువాత ఖమ్మం జిల్లా రిపోర్టర్ గా రంగయ్య నాయుడు పై అనేక విమర్శనాత్మక వార్తలు, కేంద్ర మంత్రి అనుయాయులపై కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల గురించి రాసినప్పుడు, రంగయ్యనాయుడు నాపై విరుచుకుపడేవారు. కమ్యూనికేషన్ మంత్రిగా, ఆతరువాత 1996 సాధారణ ఎన్నికలప్పుడు నా వార్తలు నాయుడుగారికి చికాకు, తలనొప్పి కలిగించాయి.  ఎందుకు నా వెంట పడతావు. నేను ఢిల్లీలో ఉన్నా నాకెప్పుడూ ‘ఆంధ్రప్రభ’లో వార్తల గురించే తలనొప్పి. ఏం రాస్తావో పీకమీద కత్తిలా. ఖమ్మం వార్తలు ఢిల్లీలో తెలిసేది మీ పత్రిక వల్లనే. ఆ పెద్దాయన పొద్దున్నే ఆంధ్రప్రభ చేతిలో పెట్టుకుంటాడు. మీ వాళ్ళేమో నీ పేరుతో మరీ వార్తలేస్తారు..qఉఒత్; అని చిందులేసేవాడు. 1996 ఎన్నికల సమయంలో  ఓటమి దారిలో రంగయ్యనాయుడు  అంటూ రాసిన నా విశ్లేషణలను చూసి నాయుడుగారు అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు. ఎన్నికల్లో ఓడిపోయారు అంతే..

శ్రీ పి వీ ప్రధాని పదవినుంచీ దిగిపోయిన తరువాత, రెండు పర్యాయాలు రాజ్ భవన్ గెస్ట్ హఔజ్ లో, మరో మారు గాంధీభవన్  గ్రంథాలయంలో కలుసుకునే అదృష్టం కలిగింది. మాజీ ప్రధానిగా ఆయన గాంధీభవన్ కు వచ్చినా నాయకులెవరూ పట్టించుకోలేదు కూడా. అప్పుడాయన నేరుగా వెనుక ఉన్న లైబ్రరీకి వచ్చారు. చెక్క కుర్చీ లో దులుపుని కూర్చుని ఓ అరగంట పాత మిత్రులతో ముచ్చటించారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధి భవన్ లో మూల స్తంభం వంటి దివంగత ఎస్ వి పంతులు.. మరో నలుగురే ఆయన వెంట ఉన్నారు. పంతులుగారికి ఆయనతో మంచి సంబంధాలుండేవి, మాటా మాటా జరుగుతుండగా.. పంతులుగారు పక్కనే ఉన్న నన్ను పరిచయం చేసారు.. ఈయన రాధాకృష్ణ, గుంటూరువాడు … అంటుండగనే,  ఆంధ్రప్రభ లో లేవా నువ్వు ఇప్పుడు. ఎన్నికలప్పుడు నంద్యాలలో పరిచయం చేసిన తరువాత పరోక్షంగా తెలుసితను. ప్రభ వెలిగించినట్లున్నాడు అని నవ్వారు. ప్రకాశంపంతులు గారు, నడింపల్లి వెంకట లక్ష్మి నరసింహారావు లను ప్రస్తావించి ఒకరు ఆంధ్ర కేసరి, మరొకరు గుంటూరు కేసరి.. అనిగుర్తుచేసారు. ఎన్ జి రంగా ను ఎప్పుడైనా కలిసావా.. అని అడిగారు.. గుంటూరు వాడివా, సొంతూరేది అని అడిగారు.. పుట్టినూరు బాపట్ల అనగానే, వల్లూరి బసవరాజు, కోన ప్రభాకరరావు అక్కడి వాళ్ళే.. బీరకాయ పీచు సంబధం… ఉండే వుంటుందిలే… ముక్త సరిగా అన్నారు.

తరువాత రాజ్ భవన్ గెస్ట్ హౌజ్ లో రెండు సార్లు కలిసినప్పుడు.. గుర్తుంచుకుని మరీ, ‘ప్రభ’ లో మార్పులు, పొత్తూరిగారు, వాసుదేవ దీక్షితులు గారు, కల్లూరి భాస్కరం గార్లను గుర్తుచేసారు. కొండా వెంకటప్పయ్య .. విన్నావా, వావిలాల తెలుసా.. ఆ రోజుల్లోనే గుంటూరంటే ఎడ్యుకేషన్ ప్రసిద్ధి… ఏ సి కాలేజీలో చదివావా, అని అడిగారు. కాదండీ హిందూ కాలేజి స్టూడెంట్ ను అనగానే, పాపయ్య శాస్త్రిని చూసావా అని ప్రశ్నించారు. వారు బాగా తెలుసండీ. సాహితీ సదస్సులలో, ఏసి కాలేజీలో కలిసేవాణ్ణి అని చెప్పాను. నువ్వు విన్న మరో కవి మరొకరిని చెప్పు, ఆ జిల్లాలో అని వారనగానే గుర్రం జాషువా… గారిని గురించి విన్నాను. వారి కావ్యాలు పాఠ్యాంశంగా చదూకున్నానని చెప్పగానే. తల  ఊపారు పివి గారు. మరోసారి రాజ్ భవన్ గెస్ట్ హౌజ్ లో కలిసినప్పుడు… ఎస్ వి ఎల్ అని ఎంపీ ఉండేవాడు అఖండుడు.. అని మెచ్చుకోలుగా మాట్ల్లాడారు. బెజవాడ ‘ప్రభ’లో చేసావ? అని అడిగినప్పుడు, లేదండీ, “ఈనాడు”లో చేసాను, అని జవాబిచ్చాను. విశ్వనాధ ఎవరో తెలుసా.. అని ప్రశ్నించారు.. అంతలో ఎవరో రావడంతో సంభాషణ ముగించారు. మేము బయటకొచ్చేసాం.

– నందిరాజు రాధాకృష్ణ 

(పి వీ శతజయంతి సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పత్రిక “తెలంగాణ మాసపత్రిక” ప్రత్యేక డిసెంబర్ సంచికలో ప్రచురితమైన వ్యాసం  )

Leave a Reply