ఎవరు మన తొలి శత్రువులు!?

Share Icons:

ఎవరు మన తొలి శత్రువులు – మలి శత్రువులు – మనః శత్రువులు..!?

ఉమ్మడి కుటుంబాల నుండి ఒంటరి (1+1+1 or 2) కుటుంబాలకు కాలానుగుణంగా మనలో చాలామంది పరివర్తనం అయి ఉండవచ్చు. కానీ ఉమ్మడి ఆలోచనలకు, నిర్ణయాలకూ మాత్రం ఎన్నడూ దూరం కాకూడదు. “ప్రేమ – అకర్షణ – ఇష్టం – చదువు – సంపాదన – స్వేచ్చ – భవిష్యత్తు – జీవితం” -ఇవన్నీ మానవ జీవన ప్రయాణంలో అంతర్భాగాలే. వీటిగురించిన కనీస అవగాహన లేని జీవితం వృథా. అంతేకాదు ప్రమాదకరమైనది (వ్యక్తికి – సమాజానికి) కూడా. మరీ ప్లే క్లాస్ నుండే కేవలం ర్యాంకులకోసం వెంపర్లాడే తల్లిదండ్రులే (అందరూ కాదు చాలా కొందరు) పిల్లలకు తొలి శత్రువులైతే, ఇలాంటివారి కోసమే ద్వారాలు తెరుచుకుని ఉన్న కార్పొరేట్ విద్యావ్యాపారులు తదితరులు (అందరూ కాదు చాలా కొందరు) మలి శత్రువులు. ఇక, మూడవ శత్రువు మనః శత్రువులు -ఈ శత్రువులు కోరికల, వ్యామోహాల, కాంక్షల రూపంలో వ్యక్తి మనసులోనే దాగివుండి మిక్కుటమైనప్పుడు నెత్తికెక్కి స్వయంకృత అపరాధాలకు పూనుకోమని మెదడును తొలిచివేస్తూ ఉంటాయి.

‘పాఠశాల – కళాశాల – విశ్వవిద్యాలయం’… ఇది ఒక ‘అశ్వశృగాలిక’ వనం. (గుఱ్ఱానికి, నక్కకు గల స్వాభావిక వైరాన్ని అశ్వశృగాలిక అంటారు) విలక్షణముల కూడలి. ఒక ‘జూ’ (Zoo) లాంటిదే అయినా, విభజన లేకుండా అందరినీ ఒకే చోట కట్టి పడేస్తారు. ఇక్కడ తులసిమొక్కలు – గంజాయిపొదలు అన్నీ కలిసే పెరుగుతాయి. ఎవరికి వారు తమ తమ బలాల్ని, బలహీనతల్ని ప్రదర్శించేందుకు అనువైన రంగస్థలం ఇది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల మీద ఉన్న అనురాగం, అభిమానం, అరాధన, ఆక్రోశం, అసహ్యం, జుగుప్స, ద్వేషం తదితరాలు అన్నింటినీ బయట పెట్టుకునేందుకు కొందరికిది ఒక వెసులుబాటైన క్రీడావేదిక.

అణచి పెట్టబడిన భావస్వేచ్ఛ, భౌతికస్వేచ్ఛ ఒక్కసారిగా అందుబాటులోకి రావడంతో కొందరు పిచ్చెక్కిన కుక్కల్లా, కోతుల్లా… ప్రలాపిస్తారు – ప్రవర్తిస్తారు. ర్యాగింగ్, సీనియర్స్ ఇలా పేరేదైనా? ముఖ్యంగా కుటుంబం నుండి తాము పోగొట్టుకున్నామని అనుకుంటున్నదాన్ని రాబట్టుకోవాలన్న కసితో రెచ్చి పోతుంటారు. తమ పిరికితనాన్ని వికృత రూపంలో విచ్చలవిడిగా ప్రదర్శిస్తుంటారు. ఓండ్రకు, ఊళకు, సకిలింతకు తేడా తెలియక, గుఱ్ఱాలమని విర్రవీగుతూ గాడిదల్లా, గుంటనక్కల్లా మిగిలిపోయే….. ఎన్నటికీ అశ్వాలు కాలేని వారు కొందరుంటారు. రోలుకు, రాయికి, చెట్టుకు, పుట్టకు కల్తీ పసుపురాసి స్టిక్కర్ బొట్లు పెట్టి వరాలిమ్మని వేడుకునే వాళ్లకు – భ్రమే భాగ్యమని, భోగమని, సవ్యమని భావించి వేధించే వీళ్లకు పెద్దగా తేడా ఏమీ ఉండదు.

యోగమేమిటో తెలిసి వచ్చే సమయానికి రోగం ముదిరి సగం చెక్కి వదిలేసిన అసంపూర్తి శిల్పాల్లా మిగిలి పోతారు. జాలి పడటానికి కూడా పూర్తిగా అర్హులు కాకుండా పోతారు. కనీసం చాకిరేవు బండలా కూడా ఉపయోగ పడకుండా బ్రతుకంతా ఇరుసు లేని బండిని లాగుతూ ఉంటారు. రెప్పలార్చు సమయం లోపునే ఎంత సౌన్దర్యాన్ని, సౌభాగ్యాన్ని కోల్పోతున్నారో తెలుసుకోలేని కొందరు అభాగ్యులు తమ ఉన్మాదానికి “ప్రేమ – LOVE” అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుని ఇతరుల జీవితాలతో ఆటలాడుకుంటుంటారు.

నిజంగా మతి చెడి ‘పిచ్చి’ పట్టి ఉన్మాదులైన వారితో సమస్యే లేదు. వారి కొరకు ‘పిచ్చాసుపత్రులు – శరణాలయాలు’ ఉన్నాయి. కామోన్మాదాన్ని, కాంక్షోన్మాదాన్ని మనసులో పెట్టుకుని ‘ఇంటా – బయట’ అయినవారిని, కానివారిని వేధిస్తూ స్వయంగా మతిని చెడుపుకుంటున్న వారితోనే సమస్య.

అసలు వీళ్లను ‘ప్రేమోన్మాదులు’ అనడం కూడా తప్పే. వీళ్లు ‘కామోన్మాదులు’ఈ పత్రికల, టీవి గొట్టాల భాషను వదలిపెట్టి ఇకపై మనం అలాంటి వారిని కామోన్మాదులుగానే వ్యవహరిద్దాం.

2012 డిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురైన ‘నిర్భయ’ (కుమారి జ్యోతి సింగ్ పాండే) ఉదంతం ఒక బలమైన దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారి లోక్ సభ, రాజ్య సభలు అట్టుడకగా 1973 నాటి పాత ‘లైంగిక వేధింపులు’ చట్టానికి మార్పులు చేసి, 3 ఏప్రిల్ 2013న క్రొత్తగా నిర్బయ చట్టాన్ని తీసుక వచ్చారు. అయినా ఫలితం ఏమిటి? ఈ లౌకికవాద ప్రజాస్వామ్యంలో… అలౌకిక శక్తులైన, అరాచకులైన ఏలికలు కొందరు రాజ్యాన్ని ఇష్టారాజ్యంగా నడిపిస్తున్న తరుణంలో ఈ “నిర్భయ చట్టం ఎవరికి చుట్టం!?” ఏ ఏ రాజకీయ తాబేదారులకు!?, ఒక పార్టీ అని లేదు కామోన్మాది అయినా, రేపిస్ట్ అయినా, హంతకుడైనా, వాడు తమవాడైతే చాలు వాడి అంగాంగానికీ అందరూ సంరక్షకులే! కేవలం అమాయకులైన, అభాగ్యులైన వారికి మాత్రమే చేతికి సంకెళ్లు, వీపు మీద వాతలు పడతాయి. మన దేశంలో చట్టముల అమలు తీరు ఇలా ఉంటుంది కనుకే ఈ కామోన్మాదులకు, వారిని కాపాడాలనుకునే పరపతి మెండుగావున్న తల్లిదండ్రులు లేక బంధుగణానికి బెయిలు కూడా సాధ్యంకాని ఈ చట్టం ఒక ‘చీపురుపుల్ల’ క్రింద జమైపోయింది. స్త్రీలపై కామోన్మాదుల వేధింపులు, యాసిడ్ దాడులు, మానభంగాలు, ర్యాగింగులు మరింత పెరిగి పోయాయి. అయితే ఇక్కడ ‘ఉద్యమం’వ్యర్ధమై పోయిందని మనం భావించ కూడదు. ప్రతి ఇంటా ఈ ఉద్యమ స్పూర్తిని కొనసాగించాలి.

ఈ సమయంలోనే మనం…తొలి శత్రువులు – మలి శత్రువులు – మనః శత్రువులు.. గురించి “నేను! నువ్వు! మేము! మీరు! మనము! పై శత్రువులలో ఒకరై ఉన్నామా?” -అని ఆలోచించడంలో తప్పు లేదు. ఆలోచించక పోవడమే తప్పు.

తొలి శత్రువులు:- తల్లిదండ్రులు..? కుటుంబ సభ్యులు..?

 1. పిల్లలను అతిగా గారాబం చేయడం మినహా వారి మానసిక స్థితిగతులను అర్ధం చేసుకోకుండా, వారి మంకుపట్టుకు తలవొగ్గి ముందువెనుక ఆలోచించకుండా వారి కోరికలను నెరవేర్చేవారు. పిల్లలు చేసే ప్రతి విరుద్ధమైన చేష్టను ఇతరులముందు అల్లరితనం లేక చురుకుదనంగా అభివర్ణిస్తూ సమర్ధించేవారు. అందుకు వంతపాడే కుటుంబ సభ్యులు.
 2. తమ పిల్లలు చేయకూడని పని చేసినా, చెడుగా ప్రవర్తించినా, దొంగిలించినా, బూతులాడినా, కొట్లాడినా నెపం ఇతరుల మీదకు నెట్టి – ఇంటాబయటా తమ పిల్లల్నే సమర్ధించి నెత్తికి ఎక్కించుకునేవారు.
 3. అనువంశికంగా లేక జన్యుపరంగా పిల్లల్లో కనిపించే విరుద్ద లక్షణాలను సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ‘మేనమామసాలు, మేనత్తసాలు, అవ్వసాలు, తాతసాలు, ముత్తాతసాలు’ అని వంశీకులతో పోల్చి వారి వంకరచేష్టలను, తింకరపనులను చూసి మురిసిపోవడమే కాకుండా ఆ విపరీత వైఖరులను ప్రోత్సహించేవారు.
 4. బాల్యం నుండి కౌమారము (బాల్యం తర్వాత – యవ్వనానికి ముందు దశ) లోకి పిల్లలు ఎదిగిన తరుణంలో నేర్పవలసిన లేక తెలిజేయవలసిన విజ్ఞానాన్ని, బుద్దులను (అంటే సంబంధబాంధవ్య, సంప్రదాయక, సామాజిక, నైతిక, లైంగిక, లౌకిక విషయ పరిజ్ఞానములు) నేర్పి, సుబోధకంగా ఆలోచింపచేయడం (కౌన్సిలింగ్) వంటి క్రియలను చేపట్టకుండా పిల్లలను తమ మానానికి తమను గాలికి వదలి వేసేవారు.

పై విధంగా వ్యవహరించేవారు బాధ్యత కలిగిన తల్లిదండ్రులు కానేరరు. బాద్యతగల పౌరులుగానూ అనర్హులే. ఇలాంటి వారంతా పిల్లలకు తొలి శత్రువులే. మూఢాచారాలు, డాంబికాలు, చాదస్తాలతో తమ చెట్టు కొమ్మను తామే నరుక్కనే మూర్ఖమతులు. బాల్యాన్ని – కౌమారాన్ని చిదిమేయమని ఎవ్వరూ చెప్పరు. మారాం చెయ్యడం పిల్లల హక్కు. బుజ్జగించడం, నచ్చజెప్పడం, సన్మార్గాన్ని చూపడం పెద్దల బాధ్యత. అది లేలేత ప్రాయంలోనే చెయ్యాలి. 18 ఏండ్లు నిండి మేజర్లు (చట్టబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారు) అయి యవ్వనంలోకి అడుగు పెట్టాక పిల్లలు తమమాట వినడం లేదని వాపోవడం వెర్రితనమే అవుతుంది. ‘తల్లిదండ్రులే పిల్లలకు తొలి గురువులు’ -అన్న సత్యాన్ని మనలో ఎవ్వరం విస్మరించ కూడదు.

మలి శత్రువులు:- పాఠశాలలు..? హాస్టళ్లు..? గురువులు..? సహచరులు..? వివిధమాధ్యమాలు..?
 1. పాఠశాలలు: వీధిబడి నుండి విశ్వవిద్యాలయం వరకు అన్నీ పాఠశాలలే. నిత్యం ‘జనగణమన-‘ పాడించని ‘బడి’, అనుదినం ‘సంధ్యాదీపం’ వెలిగించని ‘గుడి’ -రెండూ స్మశాన సమానములే. ఇప్పుడు ఇలాంటి కార్పొరేట్/పంచతారల బడులు కొన్ని హంగు ఆర్భాటపు స్మశానవాటికలుగా మారి పిల్లలను జీవచ్ఛవాలుగా మార్చి, ర్యాంకుల పేరుతో రాచిరంపాన పెడ్తున్నాయి. వాటి ఘోషే వాటిదిగానీ ఎవరి గోడూ వినిపించుకోరు. పై పెచ్చు పేరుకుపోయిన నల్లడబ్బుతో పాలకపక్షాలను, ప్రతిపక్షాలను, పత్రికలను, టీవీ-గొట్టాలను కొనేస్తారు. ఇక ప్రచారహోరుతో (ఆ ప్రకటనల్లోనూ కేకలు, అరుపులే. సున్నితత్వం, సృజనాత్మకత అన్నది మచ్చుకైనా కానరాదు) ప్రజల బుర్రలను తినేసి, ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా విద్యార్ధులను/తల్లిదండ్రులను ‘వశీకరణం’ చేసిపారేస్తున్నాయి. ఇవి తమ ర్యాంకులను తప్ప విద్యార్ధుల బాగోగులను అస్సలు పట్టించుకోవు. ఇలాంటి బడులన్నీ పిల్లలపాలిట మలిశత్రువులే. ఈ భూతప్రేతాల నడుమ అంతోఇంతో క్రమశిక్షణతో, నైతికవిలువలతో నడిచే బడులు బక్కచిక్కి పోతున్నాయి. కొన్ని సందర్భాలలో మూతబడి పోతున్నాయి. ఈ వైఖరి మారాలంటే విద్యార్ధులలోనూ, వారి తల్లిదండ్రులలోనూ మార్పురావాలి. జీబ్రాలను (కొందరు స్నేహితులు, బంధువులు వగైరాలను) చూసి గాబరాపడి  మనం చారలు పెట్టుకోనక్కర్లేదు. నామోషీ పడనక్కర్లేదు. అలాచేస్తే మన పిల్లల్ని మలిశత్రువు ఇంటికి చేతులారా పంపిన వాళ్లమవుతాము. మెదడుకు, శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చే; మంచిచెడులను మనసుకు ఎక్కించే; లోకజ్ఞానాన్ని, లౌకికపరిజ్ఞానాన్ని ఉద్భోదించే; తెలివైన, గుణవంతులైన, శక్తివంతులైన పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాలను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. అలాంటి బడులకూ కొదువ ఏమీ లేదు. డొనేషన్ల బాధా పెద్దగా ఉండదు.
 2. హాస్టళ్లు: పై కార్పొరేట్/పంచతారల బడులకు మల్లే కొన్ని ప్రభుత్వ/ప్రైవేట్ హాస్టళ్లు విద్యార్ధుల పాలిట మృత్యుకుహరాలవుతున్నాయి. తమకూ పిల్లపాపలున్నారన్న జ్ఞనాన్ని విస్మరించి కొందరు ఆడ/మగ వార్డన్లు విద్యార్ధులకు మలి శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. ఉచ్ఛం-నీఛం తెలియని, వృత్తిధర్మాన్ని పాటించని, సహనగుణం లేని అరాచకశక్తులు వార్డన్లుగా అనర్హులు. ర్యాగింగులకు, ఇలాంటి హాస్టల్ వార్డన్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం “అందుకు పూర్తిగా బాధ్యులు సంబంధిత విద్యాలయాల యాజమాన్యాలే” అని ఎన్ని సార్లు హెచ్చరించినా ఆయా యాజమాన్యాలు చట్టపు లొసుగులను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో తప్పించుకుంటున్నాయి.
 3. గురువులు: ఈ దేశ సంస్కృతి “గురువే ప్రత్యక్ష దైవం” అని భావిస్తుంది. బోధిస్తుంది. అలాంటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి మచ్చతెచ్చే, చీడ పట్టించే కర్కోటకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పిల్లలను నానారకాలుగా ప్రలోభ పెట్టి శాడిస్ట్ మనస్తత్వంతో కొందరు ఆడ గురువులు తార్పుడుగత్తెలుగా, మగ గురువులు రేపిస్టులుగా మారి శిష్యుల పాలిట బ్రహ్మరాక్షసులుగా తయారౌతున్నారు. చట్టం అనుమతించదుగానీ- వీళ్లను ‘ఉరి’ తీసి కాదు ‘కొర’ వేసి చంపినా తప్పులేదు. ఇలాంటివాళ్లు అత్యంత ప్రమాదకరమైన మలి శత్రువులుజాబితాలో చేరుతారు.
 4. సహచరులు: పరిచితులు, స్నేహితులు, బంధువులు, కుల సంఘాలు, మత సంఘాలు ఇలా ఇంకాఇంకా ఎందరో ఈ సహచరగణంలో చేరుతారు.  ఈ సహచర వలయం ఒక పద్మవ్యూహం లాంటిది. ‘క్షణం’ అన్నది కనులు మూసి తెరచే లోపున జారిపోయే మహత్తర సమయం. చేజార్చుకునే ప్రతి క్షణమూ మనకు సంబంధించిన కేటాయింపు లోనిదే. సహచరులు ఎలాంటి వారైనా వారు చెప్పింది వినడం తప్పూకాదు, నేరమూ కాదు. వివేకం లేకుండా ఆచరించడం మాత్రం ‘నేరం’ చేయడం కంటే దారుణమైన ‘తప్పిదం’ అని మనమంతా గ్రహించాలి. ‘స్నేహబంధం’ విలువ తెలిసి అందుకు కట్టుబడేవాళ్లు ఎప్పుడూ అతి తక్కువమందే ఉంటారు. నిలువెత్తు ‘ఊబి’ని దాహార్తిని తీర్చే నీటి ‘చెలమ’ అని భ్రమింపచేసి అందులోకి దింపే సహచరులే ఎక్కువగా ఉంటారు. వీరంతా మనల్ని నిత్యం వెంబడించి ఉండే లోపభూయిష్టులైన మలి శత్రువులు.
 5. వివిధమాధ్యమాలు: ఓహ్హ్! సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్ సైట్లు, సోషల్ మీడియా వ్యాపకాలు -ఇవన్నీ ఇప్పుడు నిత్య జీవనావసరాలే! నాణానికి రెండు వైపులున్నట్లే ఇవీ ‘మంచి చెడు’ అనే రెండు పార్శ్వాలను కలిగి ఉంటాయి. అయితే నాణెము బొమ్మయినా బొరుసైనా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఈ మాధ్యమాలలోని మంచి-చెడును గుర్తించక వ్యామోహంలో చిక్కుకుంటే అవి మనకు మహా మలి శత్రువులుగా మారి మనసును వైపరిత్యాల వైపుకు నడిపిస్తాయి.

అయితే- కార్పొరేట్ పాఠశాలలలో చదివే, హాస్టళ్లలోవుండే, స్నేహితుల వెంబడి తిరిగే, సినిమాలు-టీవీలు చూసే, ఇంటర్నెట్ సైట్లు వెదికే, సోషల్ మీడియాలో చేరే ప్రతి ఒక్కరు చెడిపోతారని కాదు మా భావన. మన పిల్లల మనస్తత్వాన్ని, పోకడలను గ్రహించి జాగ్రత్త వహించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. వజ్రహృదయులు ఎక్కడైనా వజ్రసంకల్పంతోనే ఉంటారు. తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరిస్తూ ఏ మాలిన్యాన్ని అంటించుకోకుండా ముందుకు సాగుతారు. మానసిక బలహీనతలను జయించలేని అర్బకుల కొరకే ఇన్ని జాగ్రత్తలూ. ఇవి అవసరం కూడా.

మనః శత్రువులు:- అనువంశిక (జన్యు) లక్షణాలు..? విపరీత బుద్ధులు..? మాట వినని మనసు..?     

 1. మనిషికి పోలికల తోపాటు, కొన్ని మంచి చెడు లక్షణాలుకూడా మన పూర్వీకుల నుండి జన్యుపరంగా వచ్చితీరుతాయి. అయితే వాటిని బాల్య, కౌమార, యవ్వన దశల్లో తల్లిదండ్రుల, గురువుల, స్నేహితుల సహకారంతో మరియూ స్వయం శిక్షణతో తొలగించుకోవచ్చు. క్రమబద్దీకరించుకోవచ్చు. ఆహారం – నిద్ర – భయం – మైధునం సమస్త జీవరాసులకు సమానం. మనిషికి మాత్రమే అదనంగా లభించిన ‘మాట – మతిత్వం’ఇతరులకు ఇబ్బందికరం కారాదు. ముఖ్యంగా తనకు తానే ఇబ్బందిగా మారకూడదు. అన్న సంకల్పాన్ని ఆచరించి ఈ జన్యు లక్షణమనే మనః శత్రువును జయించాలి.
 2. వెనుకటి తరమే మనకు గురువు. ముందు తరానికి మనం గురువులం. గురుపరంపర తరంతరమానం. బుద్ధి, చిత్తము, చింతన, చేతన మనలో వేరువేరుగా ఉంటాయి.అయితే ఒకదాని మాట మరొకటి వినదు అనే భ్రమను తొలగించుకోవాలి. కోరిక కాంతి కంటే మహావేగంగా ప్రయాణిస్తుంది. నీ చేతనతో దాన్ని అదుపులో ఉంచుకోకుంటే అదే నీకు మనః శత్రువుగా మారుతుంది.
 3. మనసు మన మాట వినక పోవడం సర్వ సహజం. మనకు, సమాజానికి హానికరం కానంత వరకు మనసు మాట వినడంలో తప్పు లేదు. మనకు నచ్చింది మాత్రమే ‘మంచి’ నచ్చనిది అంతా ‘చెడు’ అనుకోవడమే ‘తప్పు’అని గ్రహించాలి. సామాజిక, నైతిక, కుటుంబ విలువలను గౌరవించనంత ‘స్వేచ్చ – స్వతంత్రము’ మనసుకు ఇవ్వరాదు. మతిత్వంతో, చేతనత్వంతో ఆలోచించి దాన్ని స్వాధీనంలో ఉంచుకోక పోతే, అ మనసే మనః శత్రువుగా మారి మనపై స్వారిచేస్తుంది.

తల్లిదండ్రులు, పాఠశాల, గురువులు, స్నేహితులు, సన్నిహితులు -ఇలా అందరూ మనకు సహకరించినా, చేదోడై నిలబడినా ఈ మనః శత్రువులను జయించక పోతే. అందరి శ్రమా ‘బూడిదలో పోసిన పన్నీరే’ అయినా సరే ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా’ అనే తత్వంలో ఉన్న ఉన్మాదులను కుటుంబంనుండి, సంఘంనుండి బహిష్కరించి పాయఖానా (లెట్రిన్) మురుగుతో ఒక చెరసాలను నిర్మించి అందులో శాశ్వతవాసం కల్పించేలా ఒక సరిక్రొత్త చట్టాన్ని రూపొందించేందుకు మానవతా వాదులంతా ఉద్యమించాలి. ఆ మహోదయాన్ని మన తరంలోనే చూడాలని పరిశ్రమిద్దాం. ఆకాంక్షిద్దాం.

-ప్రవల్హిక    

Leave a Reply