అభ్యర్ధుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి…ఎన్నికలు రీషెడ్యూల్ చేయాలంటున్న అపోజిషన్స్…

Share Icons:

అమరావతి: కరోనా వైరస్ ప్రభావం కారణంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్ధానికపోరును ఆరు వారాలపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో ప్రతిపక్షాలు సంతృప్తినే వ్యక్తం చేశాయి. స్ధానిక ఎన్నికల పోరుకు ముందు అధికార వైసీపీ వైఫల్యాలపైనే విమర్శలు చేసిన విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఎన్నికల అరాచకాలపై గళమెత్తడం మొదలుపెట్టాయి. పల్నాడుతో పాటు రాయలసీమలో పలుచోట్ల జరిగిన దాడులు దీనికి ఆజ్యం పోశాయి. దీంతో తమ అభ్యర్ధులు నామినేషన్లు వేసే పరిస్ధితి లేనందున ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాయి.

చివరికి ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు వాయిదా వేసింది. అయితే క్షేత్రస్ధాయిలో అభ్యర్ధుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో పాటు మరికొన్ని కీలక అంశాల వల్ల ఎన్నికలు రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఎన్నికల వాయిదా లేదా రీ షెడ్యూల్ విషయంలో ఈసీ ఏ నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది.

స్ధానిక ఎన్నికల పోరు ఆరువారాల పాటు వాయిదా పడటంతో ఊపిరీపీల్చుకుందామనుకున్న విపక్ష పార్టీలకు ఆ తర్వాత అభ్యర్దుల నుంచి ఒత్తిడి మొదలైంది. అసలే అధికార వైసీపీని ఎదిరించి, భారీగా డబ్బులు ఖర్చుపెట్టి ఎన్నికల్లో సీటు తెచ్చుకుని నామినేషన్ కూడా వేస్తే ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడిపోతే తమ పరిస్ధితి ఏంటని అభ్యర్ధులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆరు వారాల పాటు ఎన్నికలు జరగకపోతే తాము వడ్డీలకు తెచ్చుకున్న డబ్బులతో పాటు అనుకూలంగా మార్చుకున్న పరిస్ధితులు ఎక్కడ తారుమారైపోతాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో నిత్యం పార్టీలో సీనియర్లతో మాట్లాడుతూ ఎన్నికలు ఎంత త్వరగా జరిపిస్తే అంత మంచిదనే డిమాండ్ వినిపిస్తున్నారు.

స్ధానిక ఎన్నికల్లో అభ్యర్ధులకు ప్రచారం, ఇతర ఖర్చుల కోసం పార్టీలు ఖర్చుపెట్టేదేమీ ఉండదు. వారే సొంతగా డబ్బులు సమకూర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయడం ఉంటుంది. అలాంటి సమయంలో భారీగా డబ్బులు సమకూర్చుకుని ఎన్నికలకు సిద్దమైన తరుణంలో అది కాస్తా వాయిదా పడటంతో ఇప్పుడు అభ్యర్ధులకే కాదు విపక్ష పార్టీల అధినేతలకూ చుక్కలు చూపిస్తోంది.

స్ధానిక పోరులో అభ్యర్ధుల ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలన్నా, ఇతర వనరులు సమకూర్చుకునేందుకు అవకాశం దక్కాలన్నా.. ఎన్నికల్లో అధికార వైసీపీతో పోటీ పడే పరిస్ధితులు రావాలన్నా మరింత సమయం అవసరమని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మధ్యేమార్గంగా ఎన్నికల రీ షెడ్యూల్ డిమాండ్ అందుకున్నాయి. వీరి డిమాండ్ పరిస్దితి ఎలా ఉన్నా ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు.

Leave a Reply