Header Banner
Header Banner
TRENDING NOW

పోల్ నెం. 21 బాబు నేలవిడిచి సాము

పోల్  నెం. 21    బాబు నేలవిడిచి సాము

పుడుతూనే ఎవరూ పరుగు పెట్టరు. అన్న ప్రాసన రోజే ఎవరూ ఆవకాయ తినరు. కూచుని పడుకోమని మన పెద్దలు చెప్పారు. కానీ ముఖ్యమంత్రికి ఇవేవీ పట్టవు… తాను ఏదో చేస్తానని ఏమీ చేయకుండా మిగిలిపోవడం ఆయనకు అలవాటు. ఆ లక్షణమే ఇపుడు రాష్ట్రానికి తలనొప్పిగా పరిణమించింది.

 

 

 

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అనుభవం ఉన్న నేతను ఎన్నుకుంటే రాష్ట్రంలో పరిపాలన గాడిన పడుతుందని నమ్మిన ప్రజలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. టీడీపీ కి పట్టం కట్టారు.

అయితే, గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు ప్రజలలో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అయోమయంగా ఉన్నాయి. పునాది రాయి వేయడం నుంచీ అన్ని పనులు తెలుగుదేశం పార్టీ స్వంత కార్యక్రమాలుగా భావించి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలుచేయడంలో పాటించ వలసిన కనీస సంప్రదాయాలను ముఖ్యమంత్రి ఎక్కడా పట్టించుకున్నట్టు కనిపించదు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రతిపక్షానికి కనీస సమాచారం ఇవ్వడం లేదు. ప్రారంభోత్సవాలకు ఆహ్వానించడం లేదు. కొత్తగా, తొలి సారి శాసన సభలో అడుగుపెట్టి, ప్రతిపక్షనేతగా ఉన్నయువకుని పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆశ్ఛర్యకరంగా ఉంది. తన రాజకీయ అనుభవం అంత వయసుకూడాలేని యువ నేతను సాదరంగా ఆహ్వానించి, హుందాగా వ్యవహరించాల్సిందిపోయి, నీతో నేను మాట్లాడడమా, నీకు అనుభవం లేదు, అనే అహంకార పూరిత వ్యవహారశైలితో శాసన సభలో వాతావరణాన్ని విజయవంతంగా కలుషితం చేసిన చంద్రబాబు.. అమరావతి నిర్మాణ ప్రక్రియలో ఎవరినీ విశ్వాసంలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు.

రోము నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అన్న సామెత చంద్రబాబుకు ఎందుకు గుర్తులేదో, లేక కావాలనే గుర్తులేనట్లు నటిస్తున్నారో అర్థంకావడం లేదు. హైదరాబాదుకు ధీటైన నగరాన్ని ఐదేళ్ల తన పదవీ కాలంలోనే నిర్మించడానికి చంద్రబాబు మయుడు కాదు కదా, విభజన చట్టం మేరకు ఉండడానికి  పది  సంవత్సరాలు సమయం ఉన్నా హైదరాబాదును వీడి రావడం పొరబాటు, ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం దేశీయంగా ఉన్న వనరులను, సాంకేతికతను, నిపుణులను వినియోగించుకోకుండా, విదేశాల చుట్టూ తిరగడం ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. మన దేశంలో ఎన్నో ఇంజనీరింగ్ సంస్థలున్నాయి. వేలాది మంది నిపుణులున్నారు. వీరి నుంచి సలహాలు తీసుకోకుండా, కేవలం విదేశీ సంస్థలను నమ్ముకోవడం ద్వారా బాబు ఎటువంటి సందేశం ఇస్తున్నారు. ఎంతసేపూ సింగపూరు, మలేషియా అంటూ వాటి చుట్టూతిరుగుతున్నారు. ఎక్కడో ఎందుకు మన పొరుగున ఉన్న తమిళనాడులో చక్రాల కుర్చీలో నుంచే కరుణానిధి నిత్యం బిజీగా ఉండే మౌంట్ రోడ్డులో చాలా తక్కువ సమయంలో  కొత్త సచివాలయ భవనం నిర్మించలేదా. అందుకు కరుణానిధి ఇంత ఆర్భాటం చేయలేదే..

మన రాజధానికి మన సంస్కృతి ఆకృతి అక్కరలేదా.. మన నిర్మాణ శైలి ఉండవద్దా, ఇక్కడి యువతకు స్వంత రాజధాని నిర్మాణంలో పాలు పంచుకున్న సంతృప్తి వద్దా, ఎందుకు సింగపూరు వెలుగులను కోరుకుంటున్నారో ఖచ్చితంగా చంద్రబాబైనా ఇప్పటి వరకూ ప్రజలకు చెప్పారా… పరిపాలనలో ఇటువంటి ఏకపక్షధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రతిపక్షనేతను వ్యక్తిగతంగా కాదు రాజ్యాంగ బద్ధంగా గుర్తించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి గుర్తుచేయవలసి రావడం దారుణం. ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా నేల విడిచి చేస్తున్నసాము విడిచిపెడతారో లేదో తెలియదు.  వీటికి కాలమే సమాధానం ఇవ్వాలి.

మామాట : రాజధానిలో మాయాలోకం నిర్మిస్తున్నారా… మనుషులుండడానికి నిర్మిస్తున్నారా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: