తండ్రికొడుకులు కలిసి కమిషన్లు బాగా తిన్నారుగా

Share Icons:

అమరావతి:

రోజు మాదిరిగానే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు.  పేదలకు పెట్టిన అన్నం ముద్దలో కూడా తండ్రి (చంద్రబాబు), కొడుకు (లోకేశ్) కమిషన్లు తిన్నారని ఆరోపించారు. 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ. 53 కోట్ల అవినీతి చోటు చేసుకుందనే విషయం విచారణలో తేలిందని చెప్పారు.

రెండు కాంట్రాక్టు సంస్థలతో వాటాలు మాట్లాడుకుని… వాటికే పనులు దక్కేలా టెండర్లను రూపొందించారని విమర్శించారు. ఒక చదరపు అడుగుకు రూ. 4,500 ఖర్చు అవుతుందా చంద్రబాబు గారూ, లోకేశ్? అని ప్రశ్నించారు. మరో వైపు విజయసాయిరెడ్డి ట్వీట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. విచారణ జరిపిన వాళ్లు ఎవరు సార్? అని ప్రశ్నిస్తున్నారు. సొల్లు మాటలు వద్దు… ప్రభుత్వం మీదేగా, దమ్ముంటే అరెస్ట్ చేయండి, మీకు మేము అండగా ఉంటామని ట్వీట్లు చేస్తున్నారు.

అదేవిధంగా మరో ట్వీట్ లో గతంలో ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రైవేటు ఆపరేటర్ల ప్రయోజనాల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములను తనవాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణం కోసం లీజుకు ఇప్పించారని ఆరోపించారు. చంద్రబాబు ఆర్టీసీని మూసివేత దశకు తీసుకెళ్లారని దుయ్యబట్టారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనీ, ఆర్టీసీకి తిరిగి ఊపిరి పోశారని ప్రశంసించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కోర్టుకు హాజరు కాలేను…

ఇదిలా ఉంటే అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన కోర్టుకు హాజరు కాలేదు. తాజాగా, సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఎన్నో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని… పరిపాలనకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతి వారం కోర్టుకు హాజరుకావడం వల్ల పరిపాలన దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.

పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బోగోలేదని… తాను కోర్టుకు హాజరుకావాలంటే ప్రొటోకాల్ తో పాటు భద్రతకు భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. తన తరపున న్యాయవాది అశోక్ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని విన్నవించారు. వ్యక్తిగతంగా తాను హాజరుకావాలని కోర్టు భావించినప్పుడు… తప్పకుండా కోర్టుకు వస్తానని తెలిపారు. ఈ పిటిషన్ పై నేడు కోర్టు విచారించనుంది.

 

Leave a Reply