ఒకప్పుడు ఆఫ్ఘన్​ మంత్రి… ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్​!

Share Icons:
  • సోషల్ మీడియాలో సయ్యద్ అహ్మద్ షా ఫొటోలు వైరల్
  • 2018లో ఘనీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రి
  • 2020లో రాజీనామా చేసి జర్మనీకి

ఆయన పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్.. మొన్నటిదాకా ఆయన ఆఫ్ఘనిస్థాన్ సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ, అంతపెద్ద హోదా నుంచి ఒకేసారి పిజ్జా డెలివరీ బాయ్ గా మారిపోయారు. ప్రస్తుతం జర్మనీలోని లీప్జిగ్ లో ఓ పిజ్జా తయారీ సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు.

ఆయన ఫొటోలను స్థానిక విలేకరి ఒకరు క్లిక్ మనిపించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సైకిల్ పై స్థానికంగా పిజ్జాలను డెలివరీ చేస్తూ కనిపించారాయన. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తిని కలిశానని, రెండేళ్ల కిందట తాను ఆఫ్ఘనిస్థాన్ మంత్రినంటూ చెప్పారని ఆ జర్నలిస్టు ట్వీట్ లో పేర్కొన్నారు.

2018లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో తాను మంత్రిగా పనిచేసినట్టు సయ్యద్ అహ్మద్ షా సాదత్ చెప్పారు. 2020 వరకు రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశానని వివరించారు. ఆ తర్వాత రాజీనామా చేసి గత ఏడాది డిసెంబర్ లో జర్మనీకి వచ్చేశానన్నారు. ఇక, ఆయనకు కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో రెండు పీజీలున్నాయి. ఘనీ ప్రభుత్వం ఇంత వేగంగా కూలిపోతుందని అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply