ప్రయాణికుల నిర్లక్ష్యం కాదు… రైల్వేశాఖదే బాధ్యత

Share Icons:

న్యూఢిల్లీ, మే 10 :

రైల్వే పరిధిలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అది ప్రయాణికుల నిర్లక్ష్యం అని తప్పించుకోవడానికి లేదు. ఇకపై రైల్వే శాఖలో ఆ పదానికి తావు ఉండరాదు. పూర్తిగా రైల్వే శాఖనే బాధ్యత వహించి నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్డు సంచలన తీర్పునిచ్చింది.

రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 124ఏ ప్రకారం బాధితులకు నష్టపరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సి వున్నప్పటికీ, పలు సందర్భాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని రైల్వే శాఖ హైలైట్ చేస్తూ, పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటుండగా, రైలు ప్రమాద కేసుల్లో హైకోర్టులు వివిధ రకాల తీర్పులను ఇస్తున్నాయి.

దీనిపై ఓ కేసులో విచారణ జరిపిన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ చిన్న ప్రమాదం జరిగినా అందుకు తగ్గ పరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని తెలిపింది.

రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ జారి పడి గాయాల పాలైనా, ప్రాణాలు కోల్పోయినా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేందుకు వీలు లేదని న్యాయమూర్తులు ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ప్రమాదాల బాధితులు రైల్వే శాఖ నుంచి నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చింది. ఇకపై ప్రమాదాలు జరిగితే పరిహారం రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఆదేశించింది.

మామాట : రైల్వే శాఖ తప్పించుకునే వీలు లేకుండా దారులు మూసేసిన సుప్రీం కోర్టు

Leave a Reply