లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..!

Share Icons:

ఢిల్లీ, 18 జూన్:

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి ఎన్డీయే కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధానిగా మోడీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.

ఇక 17వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. ఈ రోజు కూడా నూతన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి.

ఈ క్రమంలోనే పదిహేడో లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. స్పీకర్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

అయితే లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది బీజేపీ సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు ఎన్డీయే వర్గాలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఓం బిర్లా రాజస్తాన్ కోటా నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. ‘ఒక దేశం.. ఒకేసారి ఎన్నికలు’ అంశంపై దేశంలోని అన్ని పార్టీల అధినేతలతో చర్చించాలని నిర్ణయించారు. ఇదే ప్రధానాంశంగా ఈ నెల 19న పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులతో భేటీ కానున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వివిధ పార్టీల అధ్యక్షులకు లేఖ రాశారు. అలాగే 20న ఉభయ సభల సభ్యులందరితో మోదీ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Leave a Reply