దిగొస్తున్న చమురు ధరలు!

Share Icons:

ముంబై, జనవరి 9,

కొత్త ఏడాదికి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర అంచనాలను అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ 62.50 డాలర్లకు తగ్గించింది. అమెరికా షేల్ గ్యాస్ ఉత్పత్తి పెరుగుదల, చమురు మిగులు అధికం కావడంతో ఏడాది అంచనాలను 70 డాలర్లనుంచి తగ్గించినట్లు గోల్డ్‌మన్ తన నివేదికలో వెల్లడించింది. బ్రెంట్‌తో పాటు డబ్ల్యుటీఐ క్రూడ్ అంచనాలను కూడా గోల్డ్‌మన్ తగ్గించింది. డబ్ల్యుటీఐ క్రూడాయిల్ ధర ఏడాది అంచనాను 64.5 డాలర్ల నుంచి 55.50 డాలర్లకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. మరో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు సొసైటి జెనరల్ సైతం క్రూడాయిల్ ఏడాది ఎస్టిమేషన్స్‌ను తగ్గించింది.

బ్రెంట్ ధర అంచనాను 64.25 డాలర్లకు, డబ్ల్యుటీఐ క్రూడ్ ధర అంచనాను 57.25 డాలర్లకు తగ్గించింది. గతేడాది చివరలో ఒపెక్ క్రూడాయిల్ ఉత్పత్తి భారీగా పెరగడంతో ఈ ఏడాది సరఫరా మిగులు ఉండొచ్చని బ్రోకరేజ్‌ల అంచనా. దీంతో పాటు యూఎస్ పెర్మైన్ బేసిన్‌లో పైప్‌లైన్ ఇబ్బందులు అనుకున్న సమయం కన్నా ముందే ముగిసిపోతాయని గోల్డ్‌మన్ అభిప్రాయపడింది. బ్రెజిల్, కెనెడాల్లోని బడా ఆయిల్ ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తయి ఉత్పత్తి ఆరంభించనున్నాయి. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను మరింత పెంచుతాయి.

ఈ ఏడాది చమురు మార్కెట్లో కనిష్ఠ మార్జినల్ ధరలు బాలెన్స్ అవుతాయని, సరఫరా మిగులు, షేల్ గ్యాస్ ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణాలని గోల్డ్‌మన్ ప్రతినిధి డామియన్ కార్వాలిన్ చెప్పారు. గత సంవత్సరం అక్టోబర్‌లో దాదాపు 90 డాలర్లను సమీపించిన క్రూడాయిల్ ధర డిసెంబర్ నాటికి సగానికి పడిపోయి 50 డాలర్లకు అటుఇటుగా ట్రేడవుతోంది. యూఎస్, చైనా వాణిజ్యయుద్ధ భయాలతో ప్రపంచ ఎకానమీలో జోరు తగ్గిన కారణంగా చమురు ధరలు ఉన్నట్లుండి పడిపోయాయి. ఈ భయాలకు లిక్విడిటీ కొరత, వడ్డీరేట్ల పెంపు ఆజ్యం పోశాయి. దీంతో క్రూడాయిల్ భారీగా క్షీణించింది. ఈ పతనం చాలా ఎక్కువగా జరిగిందని బ్రోకింగ్‌సంస్థలు అభిప్రాయపడ్డాయి.

ప్రపంచ ఎకానమీ వృద్ధి అంచనాలు 3.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆయిల్‌మార్కెట్లు దీన్ని ప్రైస్‌ఇన్ చేసి ఉంటాయని అంచనా వేశాయి. అందువల్ల ఇకమీదట చమురు ధరలు కాస్తంత రికవరీ కావచ్చని తెలిపాయి. ప్రపంచ వృద్ధి 2.5 శాతాని కన్నా దిగువకు వస్తే మాత్రం ముడి చమురు ధరల్లో మరో పతనం ఉంటుదని హెచ్చరించాయి.

మామాట:  ఏమైతేనేం.. పెట్రోలు -డీజలు ధరలు తగ్గడం లేదు కదా…

Leave a Reply