ఎన్‌ఆర్‌సిపై లొల్లి….అమలు చేస్తామన్న అమిత్ షా….ఒప్పుకోమన్న మమతా

NRC process to be carried out across entire country, says Amit Shah; not in Bengal, retorts Mamata
Share Icons:

ఢిల్లీ:  భవిష్యత్తులో జాతీయ పౌరసత్వ ముసాయిదా(ఎన్‌ఆర్‌సి)ను అమలు చేయడంపై పెద్ద రచ్చ జరిగేలా ఉంది. తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దీనిపై ఓ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ ముసాయిదా(ఎన్‌ఆర్‌సీ-నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్‌షిప్)ను అమలుచేస్తామని అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. అసోంలో నిర్వహించినట్టే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్‌సీ నిర్వహిస్తామన్నారు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియలో ఎలాంటి మతపరమైన వివక్షలు ఉండబోవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుందని తెలిపారు.

అయితే అక్రమ వలసదారులను గుర్తించేందుకే ఎన్‌ఆర్‌సీ తీసుకొస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో హిందువులు, బౌద్దులు, జైనులు, క్రిస్టియన్స్, సిక్కులు, పార్సీ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని తెలిపారు. జాతీయ పౌరసత్వ బిల్లును లోక్‌సభ ఆమోదించిందని, సెలెక్ట్ కమిటీ ఆమోదం తర్వాత సభ రద్దయిందని గుర్తుచేశారు. త్వరలోనే పౌరసత్వ బిల్లు సభ ముందుకు వస్తుందన్నారు.

ఇక ఈ బిల్లుని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలను మత ప్రాతిపదికన విభజించడానికి తృణమూల్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదన్నారు. ఎవరి పౌరసత్వాన్ని ఎవరు లాగేసుకోలేరని అన్నారు. అసోంలో అగస్టు 31న వెల్లడించిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో 14లక్షల మంది హిందువులు, బెంగాలీలకు ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. బెంగాల్‌లో మతపరమైన చిచ్చు పెట్టడానికే ఎన్‌ఆర్‌సీ కుట్రకు తెరలేపారని.. ఇక్కడ దాన్ని అమలుచేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు.

అయితే ఈ‌ ఎన్‌ఆర్‌సిపైనే కాకుండా కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నష్టాలు, అప్పులతో తీవ్ర సతమతమవుతోన్న టెలికాం కంపెనీలకు కేంద్రం నుంచి ఊరట లభించింది. ఇప్పటివరకు బకాయిపడ్డ రూ.1.47లక్షల కోట్ల చెల్లింపును 2022 వరకు వాయిదా వేసింది. కాగా, టెలికాం ఆపరేటర్లు దాదాపు రూ1.47లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని సమాచార మంత్రిత్వ శాఖ బుధవారం పార్లమెంటులో వెల్లడించింది. లైసెన్స్ ఫీజులతో పాటు స్పెక్ట్రమ్ వినియోగానికి గాను ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు చెప్పింది. ఎక్కడ సంస్థల్ని మూసివేయాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం బకాయిల చెల్లింపును వాయిదా వేయడం వారికి ఊరట కలిగించింది.

 

Leave a Reply